BJP  Manifesto: దీపావళి పండగ తర్వాత బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో (BJP Manifesto)ను ప్రకటించనున్నట్లు కేంద్ర మంత్రిర, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) చెప్పారు. శనివారం నాంపల్లి బీజేపీ కార్యాలయం (BJP Office)లో  కిషన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నేత ప్రేమ్ సింగ్ రాథోడ్ (Prem Singh Rathore) బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు బీజేపీ (Telangana BJP)కి అవకాశం ఉందన్నారు. బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు.


కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అరాచకం రాజ్యమేలుతుందని కిషన్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయి కక్కిస్తామని చెప్పారు. తెలంగాణలో అవినీతి బీఆర్ఎస్ పాలనను అంతం చేద్దామని పిలుపునిచ్చారు. దీపావళి తర్వాత తాము ప్రచారాన్ని ముమ్మరం చేస్తామన్నారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, యోగి, రాజ్‌నాథ్ సింగ్, హిమాంత బిశ్వశర్మ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మహారాష్ట్ర సీఎం షిండే, శివసేన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తారని స్పష్టంచేశారు. 


ప్రధాని మోదీ ఈ నెల 26, 27 తేదీల్లో తెలంగాణలో పర్యటించే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభంజనం ఖాయమన్నారు. మజ్లిస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతున్నారని, కానీ తాము ఎప్పటికీ మజ్లిస్ పార్టీతో కలిసేది లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ పార్టీపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తాడన్నది ఎంత అబద్ధమే, బీజేపీ, మజ్లిస్ కలిసి పని చేస్తాయని చెప్పడం కూడా అంతే అబద్దమన్నారు. 


మజ్లిస్ మతతత్వ పార్టీ అని, మజ్లిస్ రజాకార్ల పార్టీ, గుండాలు, రౌడీల పార్టీ, మత కలహాలు ప్రేరేపించే పార్టీ అని మండిపడ్డారు. తమ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఎంఐఎంతో కలిసి పని చేసేది లేదని స్పష్టం చేశారు. బీజేపీ చరిత్ర ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసని, కాంగ్రెస్, కేసీఆర్ సర్టిఫికెట్ తమకు అవసరం లేదన్నారు. గతంలో మజ్లిస్ పార్టీతో కలిసి లాభపడిందే కాంగ్రెస్ అన్నారు. ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీతో మజ్లిస్ పార్టీ అంటకాగుతోందన్నారు. కేసీఆర్ ఒక భుజంపై అక్బరుద్దీన్ ఓవైసీ, మరో భుజంపై అసదుద్దీన్ ఓవైసీని మోస్తున్నారంటూ విమర్శించారు.


బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ చిన్నాభిన్నం  అయ్యిందని, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైందని కిషన్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటోందని, కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఆ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ఐదు హామీలతో కర్ణాటకపై భస్మాసుర హస్తం పెట్టిందన్నారు. రైతులకు కరెంట్ లేదని, ఆర్టీసీ బస్సులు నడిచే పరిస్థితి లేదని విమర్శించారు. ఒకటో తేదీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఐదు ఏళ్లలో చేయాల్సిన నష్టాన్ని కాంగ్రెస్ పార్టీ ఐదు నెలల్లో చేసిందన్నారు. 


అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బీజేపీ అభ్యర్థుల చేతుల్లోనే ఓడిపోతారని  కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.  బీజేపీ అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా సానుకూల వాతావరణం కనిపిస్తోందన్నారు. రాష్ట్రం మొత్తం మీద యువత బీజేపీ వైపు ఉన్నారని, ప్రచార కార్యక్రమాల్లో చురుకుగాగ పాల్గొంటున్నారని తెలిపారు. శుక్రవారం 111 మంది అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ తరఫున నామినేషన్లు వేసినట్లు చెప్పారు. 2014 నుంచి ఎన్డీఏ మిత్ర పక్షంగా ఉంటున్న  జనసేన తరఫున మిగతా 8 స్థానాల నుంచి నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు.