Munugode By Election Live Updates: మునుగోడులో కొనసాగుతోన్న పోలింగ్, ఇప్పటి వరకూ 86 శాతం పోలింగ్ నమోదు
Munugode By Election Live Updates: మునుగోడు పోలింగ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి
మునుగోడులోని 13 కేంద్రాలలో పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 86 శాతం పోలింగ్ నమోదు అయిందని అధికారులు అంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారికి టోకెన్లు అందించారు. వారినే ఓట్లు వేసేందుకు అనుమతి ఇస్తున్నారు.
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్ చివరి గంటలో ఘర్షణ వాతావరణం నెలకొంది. చండూరు సహా పలు మండలాల్లో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఘర్షకు దిగారు. క్యూలో ఆరు గంటల వరకు వేచిఉన్న వారికి టోకెన్లు అందించి ఓటింగ్ కు అనుమతించారు.
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ 77.55 శాతంగా నమోదు అయింది. నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,41, 805 ఉండగా 1,87,527 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఘర్షణకు దిగారు. చండూరు పట్టణంలో గుంపులుగా ఉన్న టీఆర్ఎస్, బీజేపీ నేతలను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ , బీజేపీ నేతల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. మునుగోడులో ఇప్పటి వరకూ 59.92 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు.
మునుగోడు ఉపఎన్నికల్లో పోలీంగ్ జోరుగా సాగుంతోంది. మూడు గంటల వరకు 59.92 శాతం పోలింగ్ నమోదైంది. 2లక్షల 41వేల 805 ఓట్లకు గానూ... లక్షా 44వేల 878 ఓట్లు పోల్ అయ్యాయి ఇంకా సుమారు లక్షల మంది ఓట్లు వేయాల్సి ఉంది. ఇప్పటకే వేల మంది పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరి ఉన్నారు. సాయంత్రం ఆరుగంటలతో పోలింగ్ ముగియనుంది. అప్పటి వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు.
- మధ్యాహ్నం 1 గంటకు పోలైన ఓట్లు ఇవీ
- పోలైన ఓట్ల శాతం - 41.3 శాతం
- మొత్తం ఓట్లు - 2,41,805
- మొత్తం పోలైన ఓట్లు - 99,780
మునుగోడు ఉప ఎన్నిక వివరాలను ఎలక్షన్ అధికారులు వివరించారు. ఉదయం 11 గంటల వరకు 25.8 శాతం పోలింగ్ నమోదైనట్లుగా చెప్పారు. ‘‘మునుగోడు ఉప ఎన్నికల్లో 3 చోట్ల ఈవీఎంలు, 2 చోట్ల వీవీ ప్యాట్ల సమస్య తలెత్తింది. వెంటనే పరిష్కరించాం. ఈవీఎం సమస్యతో ఒకచోట పోలింగ్ 45 నిమిషాలు ఆలస్యం అయింది. మర్రిగూడలో పోలింగ్ కేంద్రానికి సమీపంలో చిన్నగొడవ జరిగింది. ఇరు వర్గాలను చెదరగొట్టి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఫిర్యాదుల రూపంలో ఇవాళ 38 కాల్స్ వచ్చాయి. 42 మంది స్థానికేతరులను బయటికి పంపించాం. రెండు చోట్ల ₹ 2.99 లక్షల నగదు పట్టుకున్నాం. గతంలో మాదిరిగా పోలింగ్ 90 శాతం దాటుతుందని అనుకుంటున్నాం’’ అని ఓ అధకారి తెలిపారు.
మండలాల వారీగా పోలింగ్ శాతం ఇలా (ఉదయం 10 గంటల వరకూ)
- మునుగోడు: 9.25 శాతం
- చౌటుప్పల్: 8.8 శాతం
- గట్టుప్పల్: 8.9 శాతం
- చండూరు: 9.5 శాతం
- నారాయణపూర్: 8.2 శాతం
- మర్రిగూడ: 8.5 శాతం
- నాంపల్లి: 8.5 శాతం
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం టీపీ గౌరారంలో టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతుండగా స్థానికులు పట్టుకున్నారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డికి సంబంధించిన అనుచరుల వాహనాల్లో డబ్బులు తీసుకొచ్చారని స్థానికులు తెలిపారు.
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం టీపీ గౌరారంలో టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతుండగా స్థానికులు పట్టుకున్నారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డికి సంబంధించిన అనుచరుల వాహనాల్లో డబ్బులు తీసుకొచ్చారని స్థానికులు తెలిపారు.
మర్రిగూడ మండల కేంద్రంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బీజేపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ జరిగింది. స్థానికేతరులు గ్రామాలలోకొచ్చి అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం చేస్తూ డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలంటూ ఆందోళన చేశారు. అందోళన చేసిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
మునుగోడు మండలం కోంపల్లిలో ఈవీఎంల సమస్య వచ్చింది. అవి పని చేయకపోవడంతో ఓటర్లు క్యూలైన్లలోనే వేచి ఉన్నారు. ఈ మండలంలో రెండు చోట్ల ఈవీఎం సమస్యలు వచ్చాయని ఎన్నికల అధికారులు తెలిపారు. వెంటనే తాము సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతున్న వేళ టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. చండూరులో, నల్గొండ జిల్లాలో మర్రిగూడ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సిద్దిపేటకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ నాన్ లోకల్ వాళ్లు ఎవరూ లేరని టీఆర్ఎస్ నేతలు చెబుతుండగా, బీజేపీ నేతలు ఖండిస్తున్నారు.
చండూరు మండలం ఇడికూడలోని పోలింగ్ కేంద్రం 173 లో కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మునుగోడు నియోజకవర్గంలోని పుట్టపాక గ్రామం నుండి సంస్థాన్ నారాయణ్ పూర్ వైపు వెళ్తున్న మారుతీ సుజుకీ ఏర్టిగా TS 21A 6667 వాహనంలో టీఆర్ఎస్ నాయకుల వద్ద రూ.1,02,300 పట్టు బడ్డాయి. పోలీసు అధికారులు కారుని, డబ్బులను సీజ్ చేశారు. ఆ కారుపై టీఆర్ఎస్ మండల్ పార్టీ ప్రెసిడెంట్ అని రాసి ఉంది.
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారి గూడెంలో కూసుకుంట్ల ప్రభాకర్ ఓటు వేశారు. ఆ తర్వాత పోలింగ్ తీరును పరిశీలించారు.
మునుగోడులో బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోలింగ్ మొదలయ్యాక శివాలయంలో పూజలు చేశారు. తర్వాత వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతున్న తీరును పరిశీలించడానికి వెళ్లారు. నాంపల్లి మండలంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించడానికి కూడా ఆయన వెళ్లనున్నారు.
మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. క్రమంగా ఓటర్లు తమ ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 45 స్థానాల్లో 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 298 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ సహా 50 టీమ్‌లను భద్రత కోసం మోహరించారు. 5వేల మంది పోలీసులు, 15 కేంద్ర సంస్థ బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్, బీఎస్పీ, తెలంగాణ జన సమితితో పాటు స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 47 మంది బరిలో ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 119 కేంద్రాల్లో 298 బూత్ లను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. వీటిని నల్గొండ కలెక్టరేట్ నుంచి వీక్షించవచ్చు. హైదరాబాద్ లోని ఎన్నికల ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేశారు.
మునుగోడు నియోజకవర్గంలో నేడు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1,21,720 మంది పురుషులు, 1,20,128 మంది స్త్రీలు ఉన్నారు.
Background
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో అర్బన్‌లో 35 ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 263 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 298 పోలింగ్ కేంద్రాల్లో 105 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. వాటిపై అధికారుల ప్రత్యేక దృష్టి పెట్టారు.
సమస్యాత్మక కేంద్రాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాలను వెబ్‌కాస్టిగ్ చేపట్టారు. ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఎదురైనా బలగాలను కూడా సిద్ధంగా ఉంచారు. పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభంకానుంది. సాయంత్ర ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు ఇతర అధికారులు ఉంటారు. నియోజకవర్గంలో సుమారు రెండు వందల మంది మైక్రో అబ్జర్వర్లను అందుబాటులో ఉంచారు.
మునుగోడు నియోజకవర్గంలో 2.41 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 50 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. 5,686 మందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉన్నప్పటికీ కేవలం 730 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. ఓటర్ల నుంచి ఫిర్యాదుల కోసం సి-విజిల్ యాప్ అందుబాటులోకి తెచ్చారు. నేరుగా పోలింగ్ కేంద్రం నుంచే గంటకోసారి ఓటింగ్ శాతం నమోదు చేయనున్నారు.
అర్థరాత్రి హైడ్రామా
అర్థరాత్రి మునుగోడు నియోజకవర్గం చండూరులో హైడ్రామా నడిచింది. నియోజకవర్గం వ్యాప్తంగా టీఆర్‌ఎస్ నేతలు, మంత్రులు మకాం వేసి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ధర్నా చేశారు. చండూర్ ఆర్వోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళన చేపట్టారు. తన అనుచరులతో వచ్చి ఆర్వోతో మాట్లాడారు. అనంతరం ఆర్వో కార్యాలయం ఎదుట ధర్నాకు కూర్చున్నారు.
మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం తాను రాజీనామా చేశానని... ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజగోపాల్ రెడ్డి. రూల్స్‌కు విరుద్ధంగా తెలంగాణ మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే మకాం వేశారని ఆరోపించారు. అధికారులు పట్టించుకోవట్లేదంటూ ధర్నాకు దిగారు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. స్థానిక టీఆర్‌ఎస్ నాయకలు ఇళ్లల్లోనే ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారని తెలిపారు.
స్థానికేతరులు ఉన్నారని ఆర్వోకి ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పోలీసులు పూర్తిగా బిజెపి నాయకులపై వివక్ష చూపిస్తున్నారన్నారు. కేంద్ర బలగాలు వచ్చి మూడు రోజులు అవుతున్నా గ్రామలలో ఎటువంటి భద్రత రక్షణ పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గత నెల రోజుల నుండి తనపై తన కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి. మంగళవారం ప్రచారం ముగిసిన నుంచి బయట వ్యక్తులు టిఆర్ఎస్ పార్టీ నేతలు మునుగోడు నియోజకవర్గంలో ఉంటున్నారని ఆక్షేపించారు. తనపై దాడి కారణంగా నియోజకవర్గంలో ఉండే పరిస్థితి లేదన్నారు. తాను రాజీనామా చేసింది మునుగోడు ప్రజల కోసమని... ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని అనుకుంటున్నామన్నారు. బయట వ్యక్తులు మునుగోడు నియోజకవర్గం నుంచి వెళ్లిపోయేవరకు ధర్నా చేస్తామన్నారు.
పోలీస్ అధికారులు కానీ జిల్లా ఎస్పీ కాని రెండు రోజులుగా ఫోన్లు చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి. బయట వ్యక్తుల్ని వెంటనే పంపించాలని ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన. అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా...? అని ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో మూటల కట్టలతో మునుగోడు ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్నారని ఆక్షేపించారు.
మునుగోడులో ఓటమి ఖాయమైపోయిందని గ్రహించిన బీజేపీ కొత్త డ్రామాలకు తెరతీసిందని కౌంటర్ ఇచ్చారు మంత్రి జగదీశ్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి బలం బలగం అపారంగా ఉందన్నారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు మునుగోడు నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు వెళ్లిపోయారని గుర్తు చేశారు. మునుగోడులో గెలవలేక... ఓటమి భయంతో దింపుడు కళ్లెం ఆశలతో రాజగోపాల్ రెడ్డి అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. రాజగోపాల్ రెడ్డి తాపత్రయమంతా సానుభూతి పొందేందుకేనన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తన ధర్నా కార్యక్రమంతో పోలీసులతో బలవంతంగా అరెస్టు చేపించుకొని సానుభూతి పొందే ప్రయత్నం రాజగోపాల్ రెడ్డిదని విమర్శించారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -