Mlc Vamsikrishna Made Sensational Comments About Karumuri : మంత్రి కారుమూరు నాగేశ్వరరావు చేపల పులుసు పెట్టి మంత్రి పదవి కొట్టేసారని విశాఖ నగర జనసేన పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కెలికితే చేపల పులుసు కథ బయట పెడతానని ఆయన హెచ్చరించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అభ్యర్థుల ప్రకటనతో తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు వస్తున్నాయని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. కొంత మంది మంత్రులు తమ పొత్తులు గురించి మాట్లాడుతున్నారు అంటే భయపడుతున్నట్టే అర్థమన్నారు.  


కాపులు అమాయకులని ఒక మంత్రి అంటున్నారుని, త్వరలో కాపులు అమాయకులో, కాదో తెలియజేస్తారన్నారు. పవన్ కళ్యాణ్ ని వ్యక్తి గతంగా మాట్లాడి ఇబ్బందులు పెడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని వంశీ స్పష్టం చేశారు. కాపులంత కూటమికి ఓటేయడానికి డిసైడ్ అయ్యారన్న వంశీ.. అభ్యర్థులను కాకుండా పవన్ కళ్యాణ్ ని చూసి మాత్రమే ఓటు వేస్తారని స్పష్టం చేశారు. జనసేన తక్కువ సీట్లు తీసుకుందని అంటున్నారని, తీసుకున్న సీట్లుపై పవన్ కళ్యాణ్ కి క్లారిటీ వుందన్నారు. సీట్లు రాకపోయినా పవన్ కళ్యాణ్ వెంటే వుంటామని జన సైనికులు చెబుతున్నారని, కాపు కార్పొరేషన్ కి ఎన్ని నిధులు ఇచ్చారు చెప్పాలని వైసీపీ నాయకులను ఆయన డిమాండ్ చేశారు. 


40 రోజుల్లో ప్రభుత్వానికి నూకలు


నలబై రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బీసీలకి పెద్ద పీఠ వేశామని చెప్పడం దారుణమని4, 56 కార్పొరేషన్లకి ఒక్క రూపాయి ఇచ్చారా అని వంశీ ప్రశ్నించారు. చైర్మన్ పదవులను ఇచ్చి నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. యాదవ కార్పొరేషన్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి బీసీలకు ఏదో చేశామని చెబుతున్నారని, యాదవ్ కులాలకు ఓడిపోయే సీట్లు మాత్రమే ఇచ్చి బలి పశువులను చేశారన్నారు. బిల్డింగ్ ఓపెనింగ్ కి యాదవ కార్పొరేషన్ చైర్మన్ ని పిలిచారా..? అని ప్రశ్నించిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్.. పిలిస్తే ఆయన ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. ప్రజలు అడిగితే సమాధానం చెప్పలేక కేవలం జీతాలు ఇస్తున్నారని, నిధులు మాత్రం లేవన్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనను వ్యక్తిగతంగా మాట్లాడారని, హుస్సేన్ సాగర్ లో బుద్ద విగ్రహం అంటూ జగన్ మోహన్ రెడ్డిని తిట్టి మంత్రి అయిన వ్యక్తి తన గురించి మాట్లాడం ఏమిటని ప్రశ్నించారు. చేపల పులుసు పెట్టి మంత్రి అయ్యావని, అమ్మగారికి చేపల పులుసు పెట్టి మంత్రి అయ్యావంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనను కెలికితే ఊరుకునేది లేదని, చేపల పులుసు కథ బయట పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎంపీ ఎంవీవీ కోటి రూపాయలు ఇస్తానన్నాడని, అతను ఇచ్చినా యాదవులు తీసుకోరని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ నుంచే పోటీ చేస్తానని వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.