Chittoor District : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయం చాలా ఆసక్తిగా మారుతోంది. వైసీపీ క్లారిటీతో ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి ఎవర్ని పక్కన పెట్టాలనే అంచనాలతో ముందుగానే అందరికీ సంకేతాలు ఇచ్చేసింది. అనుకున్నట్టుగానే ఒకేసారి సీట్లు ప్రకటించేసింది. కానీ కూటమిగా ఏర్పాడిన టీడీపీ, జనసేన, బీజేపీలో మాత్రం సీట్లు కేటాయింపు జరిగిందే తప్ప ఇంకా సర్దుబాట్లు మాత్రం పూర్తి స్థాయిలో జరగలేదు. ఇంకా కొన్ని సీట్లపై అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. నేతలు కూడా బహిరంగగానే చర్చించుకుంటున్నారు.
ఊహించని మలుపు
ఉమ్మడి చిత్తూరును మూడు జిల్లాలుగా విభజించారు. ఇందులో తిరుపతి పార్లమెంటు పరిధిలో వైసీపీ నుంచి డాక్టర్ ఎం.గురుమూర్తి.. కూటమి నుంచి డాక్టర్ వి. వరప్రసాద్ రావు పోటీలో ఉన్నారు. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో గురుమూర్తి గెలుపొందారు. ఇప్పటికే తిరుపతి ఎంపీగా ఉండగా రెండోసారి వైసీపీ నుంచి ఎంపీ కావాలని కోరుకుంటున్నారు. వరప్రసాద్‌రావు తిరుపతి ఎంపీగా, గూడూరు ఎమ్మెల్యేగా వైసీపీలో పని చేశారు. అక్కడ సీటు లభించకపోవడంతో ఆదివారం బీజేపీలో చేరారు. అనూహ్యంగా ఆయన పేరు ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.
చిత్తూరు జిల్లాకు సంబంధించి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ రెడ్డప్ప రెండోసారి పోటీ చేస్తున్నారు. కూటమి నుంచి టీడీపీ తరపున దగ్గుమళ్ల ప్రసాద్‌రావు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అన్నమయ్య జిల్లాలో రాజంపేట నుంచి సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరోసారి పోటీలో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిగా కూటమి నుంచి పోటీ చేస్తున్నారు.
ఆశపడిన వాళ్లకు తప్పని నిరాశ
సీట్లు పంపకాలు జరిగినంత ఈజీగా సర్దుబాట్లు జరగడం లేదన్నది కూటమి నేతలు చెబుతున్న మాట. ప్రస్తుతం జరిగిన సీట్ల పంపకాలపై మూడు పార్టీల నాయకులు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. తమను కాదని ఇతరులకు సీటు ఇవ్వడం.. వైసీపీ నుంచి వచ్చిన వారికి సీట్లు కేటాయించడం.. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఐదేళ్లపాటు ఇబ్బంది పెట్టిన వారికి తిరిగి పని చేయాలంటే ఎలా చేస్తామంటూ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితిలో కూటమి అభ్యర్థులు ఎలా అందరిని కలుపుకొని ముందుకు వెళ్తారు అనేది ప్రస్తుతం చర్చ నడుస్తోంది. పార్టీ అధినాయకత్వం అన్ని పార్టీల వారిని బుజ్జగింపులు చేసింది.
ఏం చేస్తారనే గుబులు
పార్టీ అధినాయకత్వం బుజ్జగిస్తున్నా... భయపెడుతున్నా దారికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. బయటకు సైలెంట్‌గా ఉన్నట్టు కనిపిస్తున్న కొందరు నేతలు తెరవెనుక ఎలాంటి గూడుపుఠాణి చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఉదాహరణకు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు వ్యతిరేకంగా అన్ని పార్టీల నేతలు ఒక్కటయ్యారని టాక్ నడుస్తోంది. మంగళవారం ప్రత్యేక సమావేశం కూడా పెట్టుకున్నారని తెలుస్తోంది. ఆ సమావేశంలో ఏ నిర్ణయించుకున్నారో మాత్రం బయటకు రాలేదు. ఇలా కీలక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందని... ఎవరు ఎప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకుంటో అన్న భయం మాత్రం పార్టీల్లో ఉంది. బయటకు ఆల్ ఈజ్ వెల్ అంటున్నా లోలోపల మాత్రం రగిలిపోతున్నారు.