Telangana Politics :  మహబూబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ కి మావోయిస్టులు కూడా సహకరించి గెలిపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరావు కోరారు.  భద్రాచలంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో కీలక వ్యాఖ్యలు చేశారు.  ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ భద్రాచలంలో అనేక అభివృద్ధి పనులు చేశామని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు చంపుతామని బెదిరించినప్పటికీ అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేసుకున్నారు.  రాణాలకు లెక్క చేయకుండా పరిపాలన అందించామన్నారు. ఎప్పుడూ కూడా అభివృద్ధిని ఆపలేదని పేర్కొన్నారు. 


భద్రాచలంలో కమ్యూనిస్టులు గెలుపొందిన సమయంలో కూడా అభివృద్ధిని ఆపకుండా చేశామన్నారు. ప్రజల కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీని గెలిపించేది కోసం మావోయిస్టు బలరాం నాయక్ కి మద్దతు ఇవ్వాలని తుమ్మల నాగేశ్వర కోరారు. గతంలో మంత్రిగా పనిచేసిన సమయంలో ఎన్నో మార్లు మావోయిస్టు ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించవద్దని హెచ్చరించారు. పర్యటిస్తే చంపుతామని బెదిరించారు. ఇవాళ చస్తే రేపటి ప్రజల కోసం సేవ చేస్తూ చనిపోతే అంతకంటే సంతోషం మరొకటి లేదన్నారు.  మేము వాగుల్లో వంకల్లో జీపులు వేసుకొని తిరిగామని అప్పుడు మా కోసం అమర్చిన మందు పాతర కూడా పేలలేదన్నారు.  నిక్కచ్చిగా నిస్వార్ధంగా పనిచేస్తే మందు పాతరలు కూడా పేలవని అన్నారు.  అడవుల్లో ఎవరికోసం అయితే ఉద్యమాలు చేస్తున్నారో ప్రాణాలు పరంగా పెట్టి గిరిజనులు అభివృద్ధి కోసం మీరు ఉద్యమాలు చేస్తున్నారని కాబట్టి ఆ గిరిజన అభివృద్ధి కోసం పని చేసే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. 


మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉంటాయి. మరుమూల గ్రామాల్లో  వారి ప్రభావంతోనే ఓటింగ్ జరుగుతుంది. అందుకే తుమ్మల ఈ వ్యాఖ్యుల చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఇటీవల ఎన్ కౌంటర్ల విషయంలో కాంగ్రెస్ పై మావోయిస్టులు ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణలో జరగకపోయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వ సహకారంతోనే సరిహద్దు రాష్ట్రాల్లో పోలీసులు ఎన్ కౌంటర్లు చేస్తున్నారని అంటున్నారు.                              


 ఇటీవల బీజాపూర్‌ జిల్లా ఊసూరు బ్లాక్‌ పూజార్‌ కాంకేర్‌లో తెలంగాణ గ్రేహౌండ్స్‌ స్పెషల్‌ పార్టీ పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన పోరులో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎన్‌కౌంటర్‌కు ములుగు ఎస్పీ బాధ్యత వహించాలని హెచ్చరించింది.  భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్‌ కమిటీ (బీకే-ఏఎస్‌ఆర్‌) మావోయిస్టు అగ్రనేత ఆజాద్‌ పేరిట శ లేఖ విడుదలైంది. కాంగ్రెస్‌ సీఎం రేవంత్‌రెడ్డి మావోయిస్టు పార్టీపై తన పోలీసు బలగాలతో దాడులు చేయిస్తూ రాజ్యహింసలో పాలించే వాళ్లంతా ఒకేగూటి పక్షులని రుజువు చేసుకున్నారని పేర్కొన్నది. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో తమ కామ్రేడ్‌పై ములుగు ఎస్పీ ఈ ఎన్‌కౌంటర్‌కు పాల్పడ్డాడని ఆరోపించింది. తప్పకుండా ఈ ఎన్‌కౌంటర్‌కు నెత్తుటి బాకీ తీర్చుకుంటామని లేఖలో పేర్కొన్నది. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారినే మద్దతు అడగడం హాట్ టాపిక్ గా మారింది.