Madhya Pradesh Assembly Election Results: 



దూసుకుపోతున్న బీజేపీ..


మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం (Madhya Pradesh Election Result 2023) బీజేపీ అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడం ఖాయం అని కాంగ్రెస్ చాలా కాన్పిడెంట్‌గా చెప్పింది. కానీ ప్రస్తుత ఫలితాల ట్రెండ్ చూస్తుంటే అలా లేదు. పూర్తిగా వన్‌సైడ్‌గానే కనిపిస్తోంది. బీజేపీ లీడ్‌లో దూసుకుపోతోంది. కాంగ్రెస్ వెనకబడిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత చాలా వరకూ తమకు అనుకూలంగా మారుతుంతని కాంగ్రెస్ భావించినప్పటికీ ఆ ప్రభావం ఫలితాలపై పెద్దగా కనిపించడం లేదు. 230 నియోజకవర్గాలున్నా మధ్యప్రదేశ్‌లో 116 స్థానాల్లో గెలిచిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశముంటుంది. ఇప్పటి ట్రెండ్ ప్రకారం ఆ అవకాశాలు బీజేపీకే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే శివరాజ్ సింగ్ చౌహాన్ (Madhya Pradesh Election Results) కీలక ప్రకటన చేశారు. "మోదీ మనసులో ఉన్నదే ఇలా ఫలితాల రూపంలో కనిపిస్తోంది" అంటూ వెల్లడించారు. తాము చెప్పినట్టుగానే భారీ మెజార్టీతో రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ని మధ్యప్రదేశ్ ఓటర్లు కోరుకుంటున్నారని ముందునుంచే ప్రచారం చేశారు. 


మోదీ మేనియా..


ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ప్రభావమూ ఇక్కడ కనిపించింది. కొంత వరకూ బీజేపీకి ఇది పాజిటివ్‌ ఓట్లను తెచ్చి పెట్టి ఉండొచ్చు. ఇప్పుడున్న సమాచారం ప్రకారం 150కి పైగా సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అప్పుడే కాషాయ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కేంద్రమంత్రులూ ఇక్కడి ఫలితాల ట్రెండ్‌పై స్పందిస్తున్నారు. "మేం ఊహించిందే జరుగుతోంది" అని తేల్చి చెబుతున్నారు. నిజానికి మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్‌పై వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ ప్రచారం చేసింది. వెనకబడినవర్గాలకు గౌరవం లేదని విమర్శలు చేసింది. ఇటీవల కొంత మంది దళితులపై దాడులు కూడా జరిగాయి. ఈ సమస్యల్ని కాంగ్రెస్ ప్రస్తావించినప్పటికీ...ఓవరాల్‌గా చూస్తే అది ఎన్నికల ఫలితాలపై పెద్దగా ఇంపాక్ట్ చూపించినట్టైతే కనిపించడం లేదు. ప్రజలు మోదీనే ఆశీర్వదించారంటూ ఇప్పటికే బీజేపీ ప్రచారం మొదలు పెట్టింది.