Kodi Kathi Srinu Contests From Amalapuram Assembly Constituency: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడైన జనపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడి కత్తి శ్రీను వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. రానున్న ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు శ్రీను ప్రకటించారు. సోమవారం రాత్రి విజయవాడలోని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన శ్రీను.. ఈ మేరకు తన పోటీపై ప్రకటన చేశారు.


పేదవాడి కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏ ఒక్క కులం, మతం కోసమో తాను రాజకీయాల్లోకి రావడం లేదని, చట్టసభల్లో అడుగుపెట్టాలన్నారు. పేదవాళ్ల సమస్యల కోసం పోరాడాలని నిర్ణయం తీసుకున్నానని ఈ సందర్భంగా శ్రీనివాసరావు వెల్లడించారు. అమలాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. రానున్న అసెంబ్లీలో కచ్చితంగా బడుగు బలహీన వర్గాల తరఫున బలమైన వాయిస్ వినిపిస్తానని ఈ సందర్భంగా శ్రీనివాస్ స్పష్టం చేశారు.


జగన్ ప్రభుత్వంలో దగా పడ్డ యువకుడు జనపల్లి శ్రీనివాసరావు


సీఎం జగన్ ప్రభుత్వంలో దగా పడ్డ యువకుడు జనపల్లి శ్రీనివాసరావు అని జై భీమ్ రావు పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. కోడి కత్తి శ్రీను పార్టీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కుట్రలు, కుతంత్రాలు చేసే రాజకీయాలు మారాలని కోరారు. డబ్బు, అధికార మదంతో వైసిపి నేతలు విర్రవీగుతున్నారని, దళిత సోదరుడు జనపల్లి శ్రీనివాసరావు దళిత, రాజ్యాంగ రక్షణ కోసం తపన పడుతున్నాడన్నారు. రాజకీయాల్లో జనపల్లి శ్రీనివాసరావు రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు శ్రవణ్ కుమార్ వెల్లడించారు. పులివెందుల నుంచి సీఎం జగన్ పై జై భీమ్ రావు భారత్ పార్టీ నుంచి దస్తగిరి పోటీ చేస్తున్నారని, యువతను రాజకీయాల వైపు రావాలని తమ పార్టీ స్వాగతిస్తోందన్నారు. రాజకీయం ప్రస్తుతం డబ్బుతో ముడిపడి ఉందని, సామాన్యులకు రాజకీయ అవకాశం తమ పార్టీ కల్పిస్తోందన్నారు. భవిష్యత్తులో సరికొత్త రాజకీయాల కోసం పార్టీ వేదిక కాబోతోందని శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి బ్రతుకుదెరువు కల్పించాలన్న ఆలోచన శ్రీనివాసరావుకు ఉందన్నారు. దగా పడిన దళిత బిడ్డల్లో శ్రీనివాసరావు ఒకడని శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు.