TRS Politics :  టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 3న కేబినెట్ మీటింగ్ తో పాటు టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు.  కేసీఆర్ రాజకీయ వ్యూహాలు అంచనా వేయడం కష్టమే.  వచ్చే నెల మూడో తేదీన మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఇది రొటీనే. ఎప్పుడూ జరిగే మంత్రి వర్గ సమావేశమే కదా అనుకోవచ్చు. కానీ అదే రోజు టీఆర్ఎస్ ఎల్పీ భేటీ కూడా ఏర్పాటు చేశారు. ముందు కేబినెట్ భేటీ జరుగుతుంది. తర్వాత టీఆర్ఎస్ ఎల్పీ భేటీ జరుగుతుంది. మామూలుగా అయితే కేబినెట్ భేటీల్ని గంటల తరబడి నిర్వహిస్తూ ఉంటారు కేసీఆర్. కానీ మూాడో తేదీన మాత్రం త్వరగా ముగించి తెలంగాణ భవన్‌కు వెళ్లనున్నారు. ఇంత అర్జెంట్‌గా టీఆర్ఎస్ఎల్పీ భేటీ ఎందుకు అన్న చర్చ టీఆర్ఎస్ పార్టీలో జరుగుతోంది.  


జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందా ?


జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని రైతు ఎజెండాగా ముందుకు వెళ్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. బుధవారమే ఆయన బీహార్ కూడా వెళ్తున్నారు. అక్కడ చర్చలు జరిపి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కేసీఆర్ ఇతర పార్టీలను కలుపుకోవడం కన్నా.. సొంతంగా జాతీయ పార్టీ పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. బీఆర్ఎస్ అని ప్రాథమికంగా అనుకున్నారు.  బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అనే ప్రచారం జరిగింది. కానీ భారత రైతు సమితిగా మార్చాలని కేసీఆర్ అనుకుంటున్నారు. రైతులందర్నీ ఏకం చేస్తే కేంద్రాన్ని ఎదిరించవచ్చని కేసీఆర్ గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే ఆయన కేబినెట్ భేటీలో మంత్రుల వద్ద అభిప్రాయం తెలుసుకుని.. భారత రాష్ట్ర సమితిని ప్రకటించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. 


ముందస్తు ఎన్నికలపై చర్చిస్తారా ? 


జాతీయ రాజకీయాల్లో బీజేపీని ఓడించాలంటే ముందుగా తెలంగాణలో గెలవాలి. ప్రస్తుత పరిస్థితులు టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు.  ఇప్పుడు ఎన్నికలకు వెళ్లి మూడో సారి అధికారంలోకి వస్తే.. బీజేపీని ఢీ కొట్టడం సులువు అవుతుందన్న అంచనా కూడా ఉంది. నిజానికి పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. గ్యాప్ కేవలం ఐదారు నెలలు మాత్రమే ఉంటుంది. అంత తక్కువ గ్యాప్‌లో జాతీయ రాజకీయాలను సమన్వయం చేయడం కష్టమవుతుంది. అందుకే ముందస్తుకే వెళ్లి .. తెలంగాణ ఎన్నికల్లో గెలిచేసి ఆ తర్వాత ప్రశాంతంగా పార్లమెంట్ ఎన్నికల గురించి ఆలోచిస్తారన్న చర్చ కూడా జరుగుతోంది.  


జిల్లాల పర్యటన పూర్తి చేస్తున్న కేసీఆర్ !


టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను కేసీఆర్ యాక్టివ్ చేశారు. పీకే టీం ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తోంది.  సమీకృత జిల్లా కలెక్టరేట్ల భవనాలు ప్రారంభం, బహిరంగ సభలు, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ప్రారంభం చేపట్టి పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజ నింపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రస్తావిస్తూనే టీఆర్‌ఎస్ కు అండగా నిలవాలని అభ్యర్థిస్తున్నారు. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ మరోసారి ముందస్తుకు వెళ్తారనే ప్రచారం ఊపు అందుకుంది. మునుగోడు ఉపఎన్నికను ఎదుర్కోవడం కన్నా.. ముందస్తుకువెళ్లడం మంచిదన్న ఆలోచనలో కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. 


మూడో తేదీన తెలంగాణ రాజకీయంపై క్లారిటీ ! 


కేసీఆర్ ఏం చేసినా బయటకు తెలియకుండా చేస్తారని.. ఈ సారి అలాంటి నిర్ణయాలు కూడా ఏమైనా తీసుకుంటారా అన్న చర్చ కూడా వినిపిస్తోంది. ఎలాంటి సంచలనాలు ఉండవని.. రొటీన్ సమావేశాలేనని టీఆర్ఎస్ వర్గాలు కవర్ చేస్తున్నాయి. ఈ మొత్తం అంశంపై మూడో తేదీన క్లారిటీ రానుంది.