Jubilee Hills By-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలు ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా ప్రశాంతంగా ముగిసినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏ బూత్‌లో కూడా రీ పోలింగ్ లేకుండా పక్కా ఏర్పాట్లతో ప్రక్రియను అధికారులు పూర్తి చేశారని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య కాసేపు వాగ్వాదాలు మినహా ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం లేకుండా పోలింగ్ ప్రక్రియ సాగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు మినహా ఎక్కడా శ్రుతి మించిన ఘటనలు లేవు. కొన్న బూత్‌ల వద్ద కాంగ్రెస్ నేతల అతి ఉత్సాహం కేసులకు దారి తీసింది. ఉదయం నుంచి బూత్‌ల వద్దకు చేరుకున్న ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. మధ్యాహ్నానికి విజేతపై క్లారిటీ రానుంది. 

Continues below advertisement

Continues below advertisement

ఎప్పటి మాదిరిగానే బస్తీల్లో జనం తప్ప భవంతుల్లో ఉన్న ఓటర్లు ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. అందుకే మరోసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తక్కువ పోలింగ్ శాతం నమోదు అయ్యింది. సాయంత్రం పోలింగ్ పూర్తి ముగిసే సమయానికి మొత్తం 48.24 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇందులో పురుషులు 47.59 శాతం మంది వచ్చి ఓట్లు వేయగా, మహిళలు 48.95 శాతం వేశారు. గతంతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ, అయితే ఇందులో ఇంకో కోణం ఏంటంటే, గత రెండు ఎన్నికలతో పోల్చుకుంటే కాస్త బెటర్ అన్నమాట.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 47.58 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. అంతకు ముందు ఎన్నికలు అంటే 2018లో 45.61 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. తెలంగాణ వచ్చిన జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో భారీ స్థాయిలో పోలింగ్ నమోదు అయ్యింది. 2014లో 56.85 శాతం నమోదు అయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో 52.80శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఈ ఏడాది తప్ప ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ గెలుస్తూ వచ్చారు. అయితే ఆయన అకాల మరణంతో ఇక్కడ ఇప్పుడు ఉపఎన్నిక అనివార్యమైంది. ఆయన తరఫున భార్య సునీత పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా కాంగ్రెస్ తరఫున సునీల్ యాదవ్‌ ఉన్నారు. దీంతో విజయం ఎవరివైపు ఉందనే ఆసక్తి నెలకొంది. 

ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యే ఉంది. గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసిన ఎంఐఎం ఈసారి పోటీలో లేదు. వారి మద్ధతు కాంగ్రెస్‌కు ఉన్నట్టు ఆ పార్టీ నేతలు చెప్పారు. ఇప్పుడు వారి ఓట్లు ఎటు పడ్డాయో అన్న ఉత్కంఠ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల్లో ఉంది. అందుకే కచ్చితంగా గెలుపు తమవైపు ఉందనే ధీమా ఎవరిలో లేదు. గెలుస్తున్నామని మీడియా ముందు చెబుతున్నా సన్నిహితులతో మాత్రం విజయంపై డైలమాలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. 

అందుకే పోలింగ్ రోజుల ఆఖరి బ్యాలెట్‌ సురక్షితంగా ప్రాంతంలో ఉంచి లాక్ చేసే వరకు ఇరు పార్టీల నేతలు డేగకళ్లతో పరిస్థితులను గమనిస్తూ వచ్చారు. రోజుంతా ఇరు పార్టీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేతలపై బీఆర్‌ఎస్ నేతలు రెండుసార్లు ఫిర్యాదులు చేశారు. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని, బీఆర్‌ఎస్ నేతలను బెదిరిస్తున్నారని బూత్‌ల్లోకి రానివ్వడం లేదని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆగడాలు శ్రుతిమించిపోయాయని బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత ధర్నాకే దిగారు. మొత్తానికి ఆఖరి నిమిషం వరకు పోటాపోటీగా విజయం కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేశారు.

దీంతో విజయం ఎవరివైపు ఉందో అన్న ఉత్కంఠ మాత్రం 14 వరకు కొనసాగనుంది. ఒకసారి బ్యాలెట్‌ బాక్స్‌లు ఓపెన్ చేస్తే ఎవరి జాతకం ఏంటో తెలిపోనుంది. అంత వరకు ఎవరి ధీమా వాళ్లకు ఉంటోంది. మరోవైపు వివిధ సర్వేసంస్థలు ఈ ఎన్నికపై సర్వేలు నిర్వహించాయి. ఇందులో కొన్ని ఆయా పార్టీలకు మద్దుతుగా ఉన్నందున వాటి సర్వేలను నమ్మడానికి జనం సిద్ధంగా లేదు. అందుకే 14వ తేదీ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని ప్రాముఖ్యం ఉన్న సర్వేలు ఒకట్రెండు కాంగ్రెస్‌ విజయానికి అవకాశాలు ఉన్నాయని చెబుతుంటే, మరికొన్ని బీఆర్‌ఎస్ విజయం ఖాయమనే విధంగా అంచనాలు వేస్తున్నాయి.