Janasena Chief Pawan Kalyan Speech: తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన సంయుక్తంగా చేపట్టిన మీటింగ్‌లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ పవర్‌ఫుల్‌ స్పీచ్‌ అందరిలో ఉత్సాహం నింపింది. సీఎం జగన్ తోపాటు వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు పవర్ స్టార్. తన మూడు పెళ్లిళ్లపై విమర్శలకు కౌంటర్‌గా... జగన్ తన నాల్గో పెళ్లామంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 


సిద్ధం సిద్ధం అంటున్న జగన్‌కు యుద్ధం ఇద్దామని జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌ తాడేపల్లి గూడెంలో గర్జించారు. యువతరానికి ఏ సంపదవిడిచిపెట్టాం. యుద్దం, రక్తం, కన్నీళ్లు , గాయాలు , బాధలు, వేదనలు తప్ప. కలలు, కలలు, పిరికితనం మోసం తప్ప. ఐదేళ్ల పాలనలో యువతను మోసం చేశారు. రైతులను మోసం చశారు. మహిళలను మోసం చేసారు. ఉద్యోగులను మోసం చేశారు. అందర్నీ మోసం చేసిన వ్యక్తికి బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చింది. 


టీడీపీ నాయకులు కానీ , జనసైనికులు కానీ మోసే జెండాకు చాలా విలువ ఉందన్నారు పవన్. పార్టీల స్ఫూర్తికి నిదర్శనం. 2024లో విజయానికి స్ఫూర్తి ఈ జెండాలు అని అన్నారు. అందుకే ఈ సభకు జెండా సభ అని పేరు పెట్టామన్నారు. బూతుల్లో వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోతే... జెండా కర్రతో తిరగబడాలనే ఈ జెండా సభ పెట్టామన్నారు. వైసీపీ పాలనలో జగన్ కలల ప్రకారం పాలనకు ఓ గీటు రాయి. ఆంధ్రప్రదేశ్‌ రోడ్లపై పాలు పోస్తే... మన గిన్నెల్లో ఎత్తుకునేలా ఉన్నాయంటున్నారు. విద్యార్థులు విద్యను పూర్తి చేయగానే విదేశాల నుంచి వచ్చిన కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు ఏ మూలకు వెళ్లినా కిళ్లీ దుకాణాల్లో దొరికేస్తున్నాయన్నారు . 


కత్తిపోట్లు, మర్డర్లు సినిమాల్లో తప్ప వైసీపీ పాలనలో కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రోడ్లపై వెళ్లాలంటే రోజులు అయిపోతున్నాయి. అందుకే కష్టమైన డబ్బులు ఖర్చుపెట్టి హెలికాప్టర్లలో తిరగాల్సి వస్తోంది. ఓజీలో వచ్చిన డబ్బులు కేజీ బియ్యం కూడా కొనకుండా హెలికాప్టర్లపై పెడుతున్నాను. ఏ కష్టం చేయకుండా నడిమంత్రపు సిరి వచ్చినప్పుడు దాని వెనుక నేరం ఉంటుందని ఫ్రెంచ్‌ రచయిత వ్యాఖ్యలను పవన్ కోట్ చేశారు. క్లాస్‌ వార్‌ అని చెప్పే జగన్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదు మందికి తాకట్టు పెట్టారు. వైఎస్‌ జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వీళ్ల కోసం ఐదు కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలు లేకుండా యువత రోడ్లపైకి వచ్చారు. ఏదైనా మాట్లాడదామంటే రౌడీలు, గూండాలు బెదిరిస్తున్నారు. అందుకే జనసైనికులకు చెబుతున్నాను... వైసీపీ గూండాలకు చూసి భయపడకండీ... మనం ఉన్నాం.. ఉద్దండుడైన రాజకీయ నేత చంద్రబాబు ఉన్నారు. వచ్చే 45 రోజులు పాటు తెలుగు దేశం, జనసైనికులపై చేయి పడితే... సామాన్య ప్రజలపై దాడి చేస్తే... మక్కిలిరగ్గొట్టి మడతమంచంపై కూర్చపెడతామని హెచ్చరించారు. ఏ జిల్లాకు వెళ్లినా వీళ్లు ఐదుగురే పంచాయితీలు చేస్తున్నారు. ఇది నిజమైన క్లాష్‌ వార్‌. ఉన్న నా ఒక్క ఎమ్మెల్యేను తీసుకెళ్లిపోయిన జగన్‌ ఒక్కడు ఎలా అవుతారు. 2014 నుంచి ప్రజాస్వామం కాపాడేందుకు రాజకీయం చేస్తున్నాను. అందుకే పొత్తులు పెట్టుకున్నాం. రాజకీయాల్లో సహకారం, సంఘర్షణ అనే రెండు విధానాలు ఉంటాయి. ఇప్పుడు సహకారం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పుడు తెలుగు దేశం  జనసేన కలహించుకంటే జనకంఠుడు జగన్ మళ్లీ గెలుస్తాడనే ప్రజలను గెలిపించడానికి పొత్తు పెట్టుకున్నాం. 


హైదరాబాద్‌లోని జుబ్లీహిల్‌ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి జగన్ బతుకు తనకు తెలుసు అన్నారు పవన్ కల్యాణ్. చెక్‌పోస్టులో ఏం చేసేవాడో తనకు తెలుసు అన్నారు. బంజారాహిల్స్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఏం చేసేవాడో తెలుసు అన్నారు. జగన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే తన వద్ద టన్నులు టన్నులు ఇన్‌ఫర్మేషన్ ఉందన్నారు. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ మంచి తనాన్ని, శాంతిని మాత్రమే జగన్ చూశాడని అన్నారు. కచ్చితంగా ఇకపై జగన్‌కు యుద్ధాన్ని ఇస్తానని అన్నారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ఉద్దండుడిని జైల్లో పెడితే తనకు బాధేసిందన్నారు. ఆయన భార్యను అనకూడని మాటలు అంటుంటే బాధేసింది. సుగాలిప్రీతి విషయం తెలిసినప్పుడు రెండు చోట్ల ఓడిపోయానని తెలిసి నిస్సహాయత వచ్చింది. ఇలా అన్ని వర్గాల ప్రజల బాధలు చూసి చలించిపోయాను. అందర్నీ మోసం చేశారు. ఇప్పుడు వీళ్లకు అండగా నిలబడకపోతే రేపు మనకు కష్టం వస్తే ఎవరూ నిలబడరని అలియన్స్ ప్రతిపాదించాను. 
అభివృది వికేంద్రీకరణ ఉండాలే తప్ప రాజధాని వికేంద్రీకరణ కాదు అన్నారు పవన్. అమరావతి మన రాజధాని అని మరోసారి పవన్ స్పష్టం చేశారు. జగన్ అధికారంలోకి వస్తే స్కామ్ ఆంధ్ర వస్తుందని 2014లో మోదీ చెప్పారు. 2019 నుంచి 2024 వరకు దోపిడీ ఆంధ్రగా మారిపోయింది. ఉద్యోగాలు లేవు, ఎక్కడకు వెళ్లాలో తెలియదు. ప్రజల సొమ్ము ప్రజలకు పంచి తాను దానకర్ణుడిలా మాట్లాడుతున్నారు జగన్. 


పదికిలోల బియ్యం ఐదువేల రూపాయలు ఇవ్వడానికి మేం లేదు.. పాతికేళ్ల భవిష్యత్ ఇవ్వడానికి వచ్చామన్నారు. పదివేల రూపాయలు మీ చేతిలో పెట్టడమా... లక్ష రూపాయలు సంపాదించే మార్గం చూపించడమా అనేది మీరు తెల్చుకోవాలి. పని చేసే మార్గం ఉన్నప్పుడే డబ్బులు ఉంటాయి. నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి, పరిశ్రమలను తీసుకొచ్చిన వ్యక్తి ఆయన అనుభవం కావాలి ఈ రాష్ట్రానికి అన్నారు. ఇప్పటి వరకు కులాల గణన తీస్తారే కానీ... ఇక్కడ ఇంతమంది యువత ఉన్నారు వారి ఆలోచనలు ఏంటీ, లక్ష్యాలు ఏంటీ అని ఎవరైనా ఎప్పుడైనా అడిగారా అని ప్రశ్నించారు. 


జగన్ మర్డర్లు చేసినా వారి అనుచరులు మానభంగాలు చేసినా దోపిడీలు చేసినా దారుణాలు చేసినా వారి సమూహం ప్రశ్నించడం లేదు. ప్రజల కోసం కష్టపడుతున్న తనను ఎందుకు తన వాళ్లే ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. నేను డబ్బులు తిన్నానా.. వేలాది కోట్లు వెనుకేసుకున్నానా... పదవులు అనుభవించానా.. పదేళ్ల నుంచి అవమానాలు, తిట్లు తప్ప ఏం సంపాదించుకున్నాను... కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీ కోసమే కదా పెట్టింది. నిజంగా నాకు మద్దతు ఇవ్వాలనుకునే వాళ్లు నన్ను ప్రశ్నించకండీ... నా వెనుకాలే నిలబడండి. నడవండీ... మా జనసైనికుల, వీరమహిళల్లా నడవండి, ప్రశ్నించకండి. ఎవరికి ఉంది ఓపిక. ఈ దేశం కోసం సాటి మనిషి కోసం కన్నీళ్లు కార్చే శక్తి ఉందా ఎవరికైనా. ఎక్కడో విదేశాల్లో కూర్చొని టీవీల్లో కూర్చొని నన్ను ప్రశ్నించడం కాదు.. నాతో నిలబడటం నేర్చుకోండి. నాతో నడిచేవాళ్లే నావాళ్లు. నా దృష్టిలో నియోజకవర్గం లేదు. దేశం ఉంది. నా ఆంధ్రప్రదేశ్ ఉంది. తెలంగాణ ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాను. నేను నియోజకవర్గం వ్యక్తిని కాదు. ఓడినప్పుడు మీతోనే ఉంటాను... గెలిచినప్పుడు కూడా మీతోనే ఉంటాను. పవన్ కల్యాణ్‌తో స్నేహమంటే చచ్చే వరకు... పవన్ కల్యాణ్‌తో శత్రుత్వం అంటే అవతలివాడు చచ్చేదాక. ఇద్దరు కలిస్తే చూడలేడు. నలుగురు నవ్వుకుంటే చూడలేడు. పదిమంది పచ్చగా ఉంటే భరించలేడు. అలాంటి వాడిని ఏమంటారు. చెల్లిని గోడకు వేసి కొట్టే వాడిని ఏమంటారు. తల్లిని చెల్లిని దూరం పెట్టే వాడిని ఏమంటారు.. ప్రజలను కష్టాలు పెట్టేవాడిని ఏమంటారు... దాష్టికుడు సైకో అంటారు. 


జగన్‌ దృష్టిలో పవన్ అంటే మూడు పెళ్లిళ్లు రెండు విడాకులు.. నాలుగు పెళ్లిల్లు అంటాడు... ఆ నాల్గో పెళ్లాం జగనే. కానీ జగన్‌... పవన్ కల్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్‌. ఈ దేశపు యువత కలలు. కన్నీళ్లు తుడిచే చేయి. ఆపదలో ఉంటే అర్థరాత్రి కదిలి వచ్చే 108 అంబులెన్స్, ఆడబిడ్డలకు రక్షణగా ఉండే రాఖీ, పెద్దోళ్ల భుజంపై కండువా, గర్వంతో ఎగిరే జాతీయ జెండా, నిన్ను నట్టేట ముంచే తుపాను, నిన్ను అదఃపాతాళానికి తొక్కే వామనుడి పాదం గుర్తుపెట్టుకో. ఒక్కడి ప్రతిఘటన కొన్ని కోట్ల మందికి తిరగబడే ధైర్యం ఇస్తుంది. గాంధీ, అల్లూరి, నేతాజి, అంబేద్కర్‌ స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడుస్తున్నాను. 2014లో ఒక్కడినే మొదలయ్యాను... 2024 నాటికి సైన్యంలా మారిందన్నారు.