Magunta Srinivasula Reddy Press Meet: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎట్టకేలకు వైసీపీకి రాజీనామా చేశారు. గడచిన కొన్నాళ్ల నుంచి వైసీపీతో అనుబంధాన్ని తెంచుకున్న ఆయన.. బుధవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక వైసీపీని వీడుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే తన రాజకీయ భవిష్యత్, రాజకీయ వారసుడికి సంబంధించిన కీలక ప్రకటనను ఆయన చేశారు. ఒంగోలు ఎంపీ సీటును మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇచ్చేందుకు వైసిపి అధిష్టానం అంగీకరించలేదు. శ్రీనివాసులు రెడ్డికి సీటు ఇప్పించేందుకు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో మా గుంట శ్రీనివాసులు రెడ్డి కొన్నాళ్లపాటు నిరీక్షించి తాజాగా రాజీనామా చేసి పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన టిడిపిలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. 


ఒంగోలు ఎంపీగా మాగుంట రాఘవరెడ్డి


వైసీపీకి రాజీనామా చేసిన సందర్భంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి కీలక ప్రకటన చేశారు. గడిచిన కొన్నాళ్ల నుంచి తనకు, తన కుటుంబానికి అండగా ఉంటున్న ఒంగోలు ప్రజలు.. రానున్న రోజుల్లోనూ ఇదే విధమైన సహకారాన్ని తమ కుటుంబానికి అందించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా తన రాజకీయ వారసుడు మాగుంట రాఘవరెడ్డి బరిలో ఉంటారని, తనకు అందించిన సహకారాన్ని రాఘవరెడ్డికి అందించాలని ఈ సందర్భంగా ఆయన మీడియా ముఖంగా ప్రజలను కోరారు.


ఈ వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవుతారు అన్న చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లోనే తన రాజకీయ వారసుడిని బరిలో దించడం ద్వారా.. రాఘవరెడ్డికి రాజకీయంగా లైన్ క్లియర్ చేయాలని మాగుంట శ్రీనివాసులు రెడ్డి భావించినట్లు చెబుతున్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి.. ఎంపీ స్థానంపై తెలుగుదేశం పార్టీ నుంచి క్లియరెన్స్ వచ్చిందా..?  లేదా..? అన్నది తెలియాల్సి ఉంది. మాగుంట రాకతో టీడీపీకి కూడా బలం పెరుగుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.


కుమారుడు రాఘవరెడ్డికి ఎంపీ టికెట్ పై టీడీపీ అధిష్టానం నుంచి హామీ లభించిన తర్వాతే వైసీపీకి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. టిడిపిలో చేరేందుకు ముహూర్తం చూసుకుంటున్న ఆయన ఒకటి రెండు రోజుల్లో చేరబోతున్నారని చెబుతున్నారు. మాగుంట ఫ్యాన్ గాలి వదిలి.. సైకిల్ ఎక్కుతున్న తరుణంలో ఇక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.