Elections 2024 : ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. తన దగ్గర చంద్రబాబులాగా డబ్బులు లేవు.. ఆయన దగ్గర ప్రజల నుంచి దోచుకున్న డబ్బు ఉందని చెప్పుకొచ్చారు. పోలింగ్‌కు ముందు టీడీపీ వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకోండి.. అవి మీ దగ్గర నుంచి దోచుకున్న డబ్బేనని చెప్పారు. రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతోంది.. ఎవరు అధికారంలో ఉంటే మీకు మంచి జరుగుతుందో మీ కుటుంబసభ్యులతో మాట్లాడి ఓటేయండి అని పిలుపునిచ్చారు.
ఉత్తరాంద్ర నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని .. భోగాపురం ఎయిర్‌పోర్టు విస్తరన పనులు వేగంగా జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఉత్తరాంధ్రలో కొత్తగా 4 మెడికల్ కాలేజీలు కడుతున్నామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో సెల్‌ఫోన్ కనెక్టవిటీ పెంచామని అన్నారు. ఎన్నిక ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సీఎం జగన్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..జూన్ 4న విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. మూడు జిల్లాలను ఆరు జిల్లాలను చేశామని గుర్తు చేశారు.
విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్దాన సమస్యను పరిష్కరించామని, కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు కుట్రలు చేశాడని మండిపడ్డారు సీఎం జగన్. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఢిల్లీ వాళ్లతో కలిశాడని దుయ్యబట్టారు. బటన్లు నొక్కిన సొమ్ము పేదలకు అందకుండా కుట్రలు చేశాడని ధ్వజమెత్తారు. ఈ పథకాలకు బడ్జెట్‌లో ఆమోదం కూడా తెలిపామని తెలిపారు. పథకాలు ఆపగలరు కానీ.. వైసీపీ విజయాన్ని ఆపలేరన్నారు.
59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. . అక్కచెల్లెమ్మలకు నేరుగా రూ. 2లక్షల 70 వేల కోట్లు అందించామన్నారు. మేనిఫెస్టోని 99 శాతం హామీలను నెరవేర్చామని.. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చామని స్పష్టం చేశారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం.. 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు ఉన్నారన్నారు. అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మార్పులు వచ్చాయని గుర్తు చేశారు. విద్యారంగంలో మేం చేసిన అభివృద్ధి బాబు హయాంలో జరిగిందా అని ప్రశ్నించారు. అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, అక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చామన్నారు. అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నామని గుర్తు చేశారు. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచామని.. గతంలో రైతన్నకు ఇంత మంచి జరిగలేదన్నారు.
చంద్రబాబు దగ్గర ప్రజల నుంచి దోచేసిన సొమ్ము చాలా ఉంది. దోచేసిన సొమ్ముతో చంద్రబాబు ఓటర్లను ప్రలోభపెడతారని అన్నారు. బాబు డబ్బులిస్తే తీసుకోండి.. కానీ ఓటేసే ముందు ఆలోచించాలని సూచించారు. ఎవరి వల్ల మీ కుటుంబానికి మంచి జరిగిందో ఆలోచించాలని సూచించారు. మీరు వేసే ఓటుతో ఢిల్లీ పీఠం కదలాలని పిలుపునిచ్చారు.