Pawan Comments On TDP: నాలుగు రోజులు ఆగండి... టీడీపీ, జనసేన నేతలు రోడ్లపైకి వచ్చి కొట్టుకుంటారు... ఇది ఈ మధ్యకాలంలో టీడీపీ, జనసేన పొత్తుపై వైసీపీ నేతలు చేసిన కామెంట్స్. నేతలు కాదు అధినేత అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. పోటాపోటీగా సీట్లు కూడా ప్రకటించేసుకున్నారు. 


టీడీపీ, జనసేన పొత్తు మరింత ముందుకు వెళ్లక ముందే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అరకు, మండపేట సీట్లలో అభ్యర్థులను టీడీపీ అధినేత ప్రకటించేశారు. డాక్టర్ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని మండపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు పోటీ చేస్తారని వెల్లడించారు. ఈ మధ్య రా కదలిరా పేరు నిర్వహించిన బహిరంగ సభలో అరకు అభ్యర్థిని కూడా వెల్లడించారు. ఇదే ఇప్పుడు జనసేనాని ఆగ్రహానికి కారణమైంది. 


ఆలస్యం అవుతుందనేనా 
ఇంకా ఎన్నిక షెడ్యూలు రాకముందే వైసీపీ తన అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తూంది. 60కిపైగా అభ్యర్థులను ఖరారు చేశారు జగన్. కానీ టీడీపీ, జనసేన కూటమి నుంచి అలాంటి ప్రకటన ఒకటంటే ఒకటి కూడా రాలేదు. అసలు ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో కూడా తెలియదు. ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వస్తున్నాయి. 


పవన్‌ను చంద్రబాబు వదల్లేని పరిస్థితి, బీజేపీని పవన్ వదల్లేకపోతున్నారు. కూటమిలోకి బీజేపీ వస్తుందేమో అన్న రీజన్‌తో రెండు పార్టీలు చూస్తున్నాయి. దీంతో సీట్ల సర్దుబాటు, ఇతర కార్యక్రమాలు ఆలస్యమవుతున్నాయి. అటు వైసీపీ మాత్రం సింహం సింగిల్‌గానే పోటీ చేస్తుందని దూసుకెళ్లిపోతోంది. ఏం చేయలేని పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఉన్న టీడీపీ, జనసేన లీడర్లు తలలు పట్టుకుంటున్నారు. తమకే సీటు వస్తుందన్న ధీమాతో ఎవరికి వారు విడివిడిగా ప్రచారం చేసుకుంటున్నారు. 


ఇలా క్షేత్రస్థాయిలో ఎవరికి వారు చేసుకుంటున్న ప్రచారం అధినాయకత్వంపై ఒత్తిడి పెంచుతుంది. అందుకే తొందరపడిన రెండు పార్టీలు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటించేసుకున్నారు. 


పోటాపోటీ ప్రకటనలతో నష్టం


ముందుగా కూటమి పార్టీని సంప్రదించకుండా టీడీపీ ఒక తప్పు చేస్తే దాన్ని ప్రశ్నిస్తూనే పవన్‌ పోటీగా అభ్యర్థులను ప్రకటించడం మరింత గందరగోళానికి దారి తీసింది. దీని వల్ల గ్యాప్ పెరుగుతుందే కానీ తగ్గదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేడర్‌కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారి విశ్లేషిస్తున్నారు. అయితే తమ నాయకులు తాము చెప్పినట్టు వినాలంటే వాళ్లు చెప్పినట్టు చేయాల్సి ఉంటుందని జనసేన అంటుంది.


వైసీపీకి మాట్లాడే ఛాన్స్


ఇలా ఎవరికి వారు సీట్లు ప్రకటించుకోవడం ప్రత్యర్థి పార్టీ వైసీపీకీ మాట్లాడే ఛాన్స్‌ ఇచ్చాయి టీడీపీ జనసేన. ఇప్పటికే పొత్తు బంధం విచ్చిన్నమవుతుందని అధికార పార్టీ జోస్యం చెబుతూ వస్తోంది. ఇప్పుడు వాళ్లు చేసిన పనితో విమర్శలు పదును పెరగబోతోంది.  తెలుసుకో తమ్ముడూ అంటూ మంత్రి అంబటి రాంబాబు పలు సూచనలు చేశారు. పొత్తు ధర్మమే కాదు ..ఏ ధర్మము పాటించని వాడే "బాబు" తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్... అంటు ట్వీటారు. ఆయనతోపాటు ఇతర వైసీపీ నేతలు కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నారు.