Tdp-Janasena Alliance : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తెలుగుదేశం(Tdp)-జనసేన (Janasena) కూటమిలో సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కివస్తోంది. చిక్కుముడులు ఉన్న సీట్లలో....రెండు పార్టీల నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులకు టీడీపీ, జనసేన అగ్రనేతలు నచ్చజెబుతున్నారు. దీంతో అసెంబ్లీ టికెట్ ఆశించిన రెండు పార్టీలకు చెందిన ఆశావహులు మెత్తపడుతున్నారు. అధిష్టానం చెప్పినట్లు నడుచుకునేందుకు రెడీ అవుతున్నారు. పార్టీ నిర్ణయాలపై తమ అనుచరులతో చర్చిస్తున్నారు. పార్టీ అధిష్ఠానం, అనుచరుల అభిప్రాయాలను బేరీజు వేసుకుంటున్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా...తాము తగ్గుతూ పార్టీ నెగ్గేలా వ్యవహరిస్తున్నారు.
పార్టీ నిర్ణయమే శిరోధార్యమన్న దుర్గేష్
పార్టీ అధిష్ఠాన నిర్ణయమే శిరోధార్యంగా భావించి నిడదవోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా వీరవరంలో జనసేన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. నిడదవోలు నుంచి పోటీ చేయాలని అధిష్ఠానం చెప్పిందన్న ఆయన...రెండు, మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటన వస్తుందని స్పష్టం చేశారు. నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్న ఆయన...రెండు పార్టీ కార్యకర్తలు పార్టీ గెలుపునకు పాటు పడాలని పిలుపునిచ్చారు. వ్యూహ, ప్రతివ్యూహాలను పార్టీ పెద్దలకు వదిలేసి...పోటీ చేస్తానని వెల్లడించారు. తన వెన్నంటే ఉండి.....రాజకీయ ఎదుగుదలకు పాటు పడిన పార్టీ శ్రేణులకు దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలతో ఈ ప్రాంత యువత చూపిన ఆదరాభిమానాలు మరువలేనివన్నారు. అవినీతి ఆరాచక పాలకులను గద్దె దించేందుకు టీడీపీ-జనసేన కూటమి స్నేహం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
నిడదవోలు నుంచి కందుల పోటీ
టీడీపీ, జనసేన కూటమి ఇప్పటికే 99 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. తూర్పు గోదావరి జిల్లాలో కీలకమైన రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సీటుకు అభ్యర్థిని రెండు పార్టీలు ప్రకటించలేదు. తెలుగుదేశం పార్టీ తరపున గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన తరపున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ టికెట్ ఆశించారు. బుచ్చయ్య చౌదరి, కందుల దుర్గేష్‌లు రాజమండ్రి రూరల్ సీటు కోసం పట్టుబట్టడంతో అధినేతలకు తలనొప్పిగా మారింది. పొత్తులో భాగంగా జనసేనకు రాజమండ్రి రూరల్ సీటు అని ప్రచారం జరిగింది. అయితే టీడీపీ సీనియర్ బుచ్చయ్య చౌదరి పట్టుబట్టారు. తానే రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కందుల దుర్గేష్‌ను... జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలిచి నచ్చజెప్పారు. ఆ నియోజకవర్గం బదులు ప్రత్యామ్నాయంగా నిడదవోలు నుంచి పోటీ చేయాలని సూచించారు. ఇదే అంశంపై కొంతకాలంగా దుర్గేష్...అనుచరులు, పార్టీ కేడర్‌తో మాట్లాడుతున్నారు. అధిష్ఠానం నిర్ణయానికి అనుగుణంగా రాజమండ్రి రూరల్ అసెంబ్లీకి బదులు నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు.
రాజమండ్రి రూరల్ లో గోరంట్లకు లైన్ క్లియర్
రాజమండ్రి రూరల్ స్థానం నుంచి పోటీ చేస్తానని కొంతకాలంగా ప్రకటిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కందుల దుర్గేశ్ నిడదవోలు నుంచి పోటీ చేసేందుకు రెడీ అవడంతో...రాజమండ్రి రూరల్ స్థానంలో గోరంట్లకు లైన్ క్లియర్ అయింది. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో...బుచ్చయ్య చౌదరి పోటీలో నిలిస్తే బాగుంటుందని రెండు పార్టీలు భావించాయి. అందులో భాగంగానే కందుల దుర్గేష్ ను నిడదవోలు పంపాయి టీడీపీ, జనసేన