Nellore Anilkumar: నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత నర్సరావుపేట వైసీపీ (YSRCP) లోక్ సభ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పార్టీ మారిన నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పార్టీ మారిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గతంలో వైసీపీ నుంచి బయటకు వచ్చిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy)పై విమర్శలతో విరుచుకుపడ్డారు. తాను ప్రస్తుతం నర్సరావు పేట వెళ్లినా.. ఎన్నికల తర్వాత సీఎం జగన్ పర్మిషన్ తీసుకుని మళ్లీ నెల్లూరుకు వస్తానని, అన్ని లెక్కలు సరిచేస్తానని చెప్పారు. 


ఆయన గురించి మాట్లాడొద్దు అనుకున్నా..
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు అనిల్. గతంలో నెల్లూరు రూరల్ నియోజక వర్గం రాష్ట్రం లోనే వైసీపీకి అడ్డాగా మారిందని చెప్పారు. రాష్ట్రం లోనే మొదట  వైసిపి గెలిచే రెండు సీట్లు నెల్లూరు రూరల్, ఆత్మకూరు అని.. అలాంటి చోట కోటంరెడ్డి పార్టీ మారారని అన్నారు. నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ ను తాను, కోటంరెడ్డి జీవితాంతం గుర్తుంచుకోవాలని, ఆయనకు తామిద్దరం కృతజ్ఞతతో ఉండాలని అన్నారు. తామిద్దరికీ టికెట్లు రాకుండా చేయాలని చాలామంది చాలా ప్రయత్నాలు చేశారని, కానీ సీఎం జగన్ తమను నమ్మి టికెట్లు ఇచ్చారని అన్నారు. ఆయన దయ, పుణ్యంతోనే తామిద్దరం ఎమ్మెల్యేలం అయ్యామన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి గురించి తాను మాట్లాడొద్దు అనుకున్నానని, కానీ తప్పడం లేదని చెప్పారు. రూరల్ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ అని అబద్ధాలు చెప్పినప్పుడు తాను ఆయనకు ఓ సవాల్ విసిరానన్నారు. అది ట్యాపింగ్ కాదు రికార్డింగ్ అని చెప్పానని, ఇప్పటికీ అది రికార్డింగేనని చెబుతున్నానని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఒక్కడినే లక్ష మందిని కలుస్తా అని చెప్పారని.. ఇప్పుడు రోజుకు ఎంత మందిని కలుస్తున్నాడని నిలదీశారు. 


వేమిరెడ్డికి గర్వం..
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి డబ్బు ఉందనే అహం, గర్వం ఉన్నాయని ఆరోపించారు ఎమ్మెల్యే అనిల్. దైవ కార్యక్రమాలు చేస్తున్నా అని చెప్పుకునే వేమిరెడ్డి.. పాపాలు చేశారు కాబట్టే అవన్నీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తనపై జగన్ కు రెండేళ్లు చాడీలు చెప్పారని.. అలా తనను తరిమేదాకా వేమిరెడ్డి నిద్రపోలేదన్నారు. తాను కొన్ని కారణాలు తో నరసరావుపేట పోయానని.. అలా వెళ్తూ వెళ్తూ ఒక మైనారిటీ అభ్యర్దిని అక్కడ పోటీకి నిలబెట్టామని.. దానికి కూడా వేమిరెడ్డి అలిగారని అన్నారు. 


విజయసాయి వచ్చారుగా..
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ నుండి పోగానే క్యాడర్ నిరుత్సాహ పడిందని వారు అనుకుంటున్నారు కానీ.. విజయ సాయిరెడ్డి ఎంట్రీతో టీడీపీ బ్యాచ్ కి భయం పట్టుకుందన్నారు అనిల్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2016 లో జిల్లాలో అడుగు పెట్టాకే ఆయన లెగ్ మహిమతో పార్టీ  చెల్లా చెదురుగా అయిందని, ఆయన పార్టీ నుండి పోయాకే మళ్ళీ అందరం కలిశామని చెప్పారు అనిల్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సొంత డబ్బులతో  ప్రజా సేవ చేయలేదని, CSR నిధులతోనే వాటర్ ప్లాంట్ లు పెట్టారని చెప్పారు అనిల్. అలా కాదని, సొంత డబ్బులు ఖర్చు పెట్టాని వేమిరెడ్డి చెప్పాలని సవాల్ విసిరారు. 


టీడీపీలో చేరినవారు దొంగలు అని అన్నారు అనిల్. డబ్బుతో ఏమైనా చేస్తానని చెప్పే వారికి రాబోయే రోజుల్లో బీసీ, మైనార్టీ వర్గాలు బుద్ధి చెప్పాలన్నారు. నెల్లూరు ఎంపీగా విజయ సాయిరెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు అనిల్.