Andhra Pradesh Elections 2024 : మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి (Byreddy Rajasekhar Reddy ) కుమార్తె బైరెడ్డి శబరి ( Byreddy  Sabari )...నంద్యాల పార్లమెంట్ (Nandyala Parliament) నుంచి టీడీపీ (Tdp ) తరపున పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, నంద్యాల పార్లమెంట్ ఇన్ చార్జ్ వ్యవహరిస్తున్నారు. కొంతకాలంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతారంటూ ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి...టీడీపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. చర్చలు కొలిక్కిరావడంతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన కూమార్తె బీజేపీ నేత బైరెడ్డి శబరిలో టీడీపీలో చేరికకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. 


అసెంబ్లీ సీటు స్థానంలో నంద్యాల ఎంపీ సీటు
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తొలుత పాణ్యం అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించారు. బైరెడ్డి అనుచరులు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు సైతం వేశారు. అయితే టీడీపీ హైకమాండ్ మాత్రం అసెంబ్లీ ఇవ్వడం కుదరదని చెప్పేసింది. ఆయన కూతురు శబరికి పార్లమెంట్ సీటు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరనుంది. త్వరలోనే అధికారికంగా శబరి పేరును ప్రకటించనుంది టీడీపీ. ఆ పార్టీ నుంచి పార్లమెంట్ సీటు కన్ఫామ్ కావడంతో బైరెడ్డి అనుచరులు సంబరాలు చేసుకున్నారు. సోమవారం రాత్రి నగరంలోని నరసింహారెడ్డి నగర్‌ కూడలి వద్ద ఆమె అనుచరులు, అభిమానులు సీట్లు పంచారు. పెద్దఎత్తున బాణసంచాలు కాల్చి...బైరెడ్డి రాజశేఖరరెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. 


రెండు సీట్లు అడిగిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కుదరదన్న టీడీపీ
తనకు పాణ్యం ఎమ్మెల్యే టికెట్‌తో పాటు, కూతురు బైరెడ్డి శబరికి నంద్యాల ఎంపీ స్థానం కావాలని బైరెడ్డి రాజశేఖరరెడ్డి పట్టుపట్టారు. బైరెడ్డి రాజశేఖరరెడ్డి అడిగినట్లు కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. అంతేకాకుండా శబరికి నంద్యాల పార్లమెంట్ సీటును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల సమయంలోనే బైరెడ్డి రాజశేఖరరెడ్డి...సొంతగూటికి వెళ్లాలని భావించారు. కర్నూలు జిల్లాలోని కొందరు టీడీపీ నాయకులు అడ్డుపడటంతో బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేరిక ఆగిపోయింది. తాజాగా ఎన్నికల సమీపిస్తుండటంతో బైరెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. 


శాసనసభకు ఎన్నికైన తండ్రీ తనయులు
కర్నూలు జిల్లాలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తండ్రి శేషశయనారెడ్డి...1957 నుంచి మూడు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. నందికొట్కూరు నియోజక వర్గం నుంచి  1994 టీడీపీ తరపున పోటీ చేసి...తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1999లో రెండోసారి తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. 2004, 2009 లో జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. సెప్టెంబరు 2012 లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి...రాయలసీమ పరిరక్షణ సమితిని స్థాపించారు. రాయలసీమ హక్కుల పోరాటం చేశారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. నాలుగు నెలల పాటు 3వేల కిలోమీటర్లు...రాయలసీమ ప్రాంతంలో ట్రాక్టరు యాత్ర చేశారు. 2013 ఆగస్టు 5న రాయలసీమ పరిరక్షణ సమితినే తన పార్టీ పేరుగా ప్రకటించారు. కొంతకాలం తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు.