Harirama Jogayya about Seat sharing between TDP and Janasena : కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సీహెచ్‌ హరి రామజోగయ్య తాజాగా ఒక బహిరంగ లేఖను సోమవారం రాశారు. ఇందులో ఎవరికి రాసినట్టు పేర్కొనకపోయినా.. లేఖలో వెల్లడించిన అంశాలు మాత్రం పవన్ కు తెలియజేసేలా ఉన్నాయి. ఈ లేఖలో పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు మధ్య జరిగిన పొత్తు చర్చలు, సీట్ల సర్దుబాటుకు సంబంధించిన విషయాలు మీడియాలో ప్రచురితం కావడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టడంతోపాటు అసలు సీట్ల పంపకాలు ఏ ప్రాతిపదికన జరుగుతున్నాయంటూ ప్రశ్నించారు. గత కొన్నాళ్ల నుంచి వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతోపాటు పవన్‌ కల్యాణ్‌కు అండగా ఉంటూ వస్తున్నారు హరి రామ జోగయ్య. కానీ, తాజా లేఖలో ఆయన జనసేనాని కాస్త ఘాటుగానే ప్రశ్నించారు. ఈ లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన అంశంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే జనసేన, టీడీపీ సీట్ల సర్దుబాటు అంశాన్ని ఆయన తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తూ ఈ లేఖను సంధించారు. 


లేఖలో ఏముందంటే.. 
అసెంబ్లీ సీట్లు జనసేన, తెలుగుదేశం మధ్య జనాభాల నిష్పత్తిలో జరగబోతున్నాయా..? బడుగు బలహీన వర్గాలకు సీట్ల కేటాయింపు ద్వారా రాజ్యాధికారం దక్కబోతోందా..? సామాజిక న్యాయం జరగబోతోందా..? అంటూ లేఖను ప్రారంభించిన హరి రామ జోగయ్య కీలక అంశాలపై ప్రశ్నలు సంధించారు. తెలుగుదేశం, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాన్‌ గార్లు వారి వారి పార్టీల మధ్య సీట్ల పంపకం విషయంలోనూ, ఉమ్మడి మేనిఫెస్టె తయారు చేయడం విషయంలోనూ దఫదఫాలుగా సమావేశాలు జరపడం గమనిస్తూ ఉన్నాం. ఈ సమావేశాల్లో ఇద్దరి మధ్య ఏ విషయాలు చర్చకు వచ్చాయో, జనసేనకు తెలుగుదేశం అధినేత ఎన్ని సీట్లు, ఏఏ సీట్లు కేటాయించడానికి సిద్ధపడ్డారు, జనసేన అధినేత ఎన్ని సీట్లు ఏఏ సీట్లు, ఏఏ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని అంగీకరించారో వివరిస్తూ ఒక ఎల్లో టీవీ చానెల్‌ జనసేనకు 30 సీట్లని, ఒక ఎల్లో వార్తా పత్రిక జనసేనకు 27 సీట్లుని బహిరంగ ప్రకటన చేయడం, ప్రచురణ చేయడం జరిగింది.


ఈ సీట్ల వివరాలు త్వరలో ఎన్నికల నోటిఫికేషన్‌ తేదీలోగా ఇద్దరు నాయకులు ప్రకటించబోతున్నట్టుగా వారు ప్రకటించిన వార్తలలోని విశేషం. ఈ రకమైన ఏకపక్షమైన వార్తలు, ఎల్లో మీడియా ఎవరిని ఉద్ధరించడానికి ప్రకటించారో ఆయా పార్టీ శ్రేణులే గ్రహించాలి. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు ఒక్క దామోదరం సంజీవయ్య గారు మినహా ఈనాటి వరకు అగ్రవర్ణాలల్లో ఆరు శాతం జనాభా ఉన్న రెడ్డి, నాలుగు శాతం ఉన్న కమ్మ కులస్తులు తప్ప 80 శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాల వారెవ్వరూ ముఖ్యమంత్రి పదవులు అధిష్టించి పాలనా అధికారం చేపట్టినవారు ఎవరూ లేరు. ఈ రెండు అగ్రవర్ణాల వారు ఆర్థికంగాను, రాజకీయంగాను బలహీనులైన మిగిలిన బడుగు, బలహీన వర్గాలను ఉపయోగించుకుంటూ తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఆర్థికంగా లబ్ధి పొందుతూ ఆస్తులు పెంచుకుంటూ రాజకీయంగా లబ్ధి పొందుతున్న మాట వాస్తవం. ఆనాటి నుంచి 25 శాతం ఉన్న కాపు, తెలంగ, బలిజ, ఒంటరి కులస్తులు, బీసీ కులస్తులుగా గుర్తింపు పొందకుండా విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్‌ సౌకర్యం పొందకుండా అడ్డుకుంటున్నారనేది వాస్తవం.


రాజ్యాధికారం దక్కించుకోవడమే లక్ష్యం 
యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలంటే రాజ్యాధికారం దక్కించుకోవడం తప్పా మరో మార్గం లేదని గ్రహించిన కాపు సామాజికవర్గం ఈ దిశగా ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ప్రజల్లో మంచి చరిష్మా కలిగి ఉన్న పవన్‌ కల్యాణ్‌ గారు జనసేన పార్టీని స్థాపించి రాజ్యాధికారం దక్కించుకునే దిశగా చేస్తున్న ప్రయాణంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కూడా కల్పుకుని ఆయనకు పూర్తి సహకారం అందిస్తూ ఆయనతో కలిసి ముందుకు నడుస్తున్న మాట కాదనలేం. పంపకంలో కాకపోయినా ముఖ్యమంత్రి పదవి మీకు రెండున్నర ఏళ్ళు కట్టబెట్టబోతున్నట్లు ఎన్నికలు ముందే మీరు చంద్రబాబు నోటు గంట ప్రకటించగలుగుతారా అని మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తుంది. ఈ ప్రశ్నలకు మీ నుండి జనసైనికులు సంతృప్తి చెందైన ఎలా సమాధానాలు రాగలిగితే ఎన్నికలు అంతా సవ్యంగానే జరుగుతాయి.


జనసేనకు సీట్ల కేటాయింపు 40 నుంచి 60 తక్కువ కాకుండా జరగకపోయినా కాపు సామాజిక వర్గానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు బలమైన అభ్యర్థులు ఉండి జనాభా ప్రాతిపదికన సీట్ల పంపకం జరగకపోయినా ఓట్ల బదిలీ సవ్యంగా జరగక మీరు అనుకున్నది సాధించలేని ప్రమాదం ఉన్నదని దేనికి మీరుబయలు మాత్రమే కారణం అవుతారని విశ్వసిస్తూ విశ్లేషించాల్సి వస్తుంది సారీ' అని లేఖను ముగించారు.’ అంటూ లేఖను ముగించారు. ఇప్పుడు హరిరామ జోగయ్య రాసిన లేఖ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే లేఖపై విమర్శనాస్ర్తాలను జనసేన కేంద్రంగా వైసీపీ చేస్తోంది.