Srikakulam News: టీడీపీ మూడో జాబితా సిక్కోలు జిల్లాలో అగ్గిరాజేసింది. టీడీపీ వెల్లడించిన మూడో జాబితాతో ప్రశాంతంగా ఉన్న జిల్లాలో రణరంగమైంది. పార్టీ ఇన్చార్జీలు సైతం హైకమాండ్ తీసుకున్న నిర్ణయాలకు భగ్గుమంటున్నారు. వారి మద్దతుదారులైతే తమకు అడ్డుగా నిలిచిన వారి ఓటమి చూడనిదే తగ్గేదేలే అంటున్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా టీడీపీ శ్రేణులు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. దీనంతటికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్ కారణమని మండిపడుతున్నారు.
శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు తీరని అన్యాయం చేశారంటూ ఆయా వర్గాలు అసహనంతో ఊగిపోతున్నాయి. రవికుమార్, అచ్చెన్నాయుడు నిర్ణయాలతోనే జిల్లాలో ఈ పరిస్థితి తలెత్తిందంటూ ఆగ్రహాంతో రగిలిపోతున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వాల్ పోస్టర్లు, టీడీపీ జెండాలను దహనం చేశారు. ఆ పార్టీ అధినేతకు వ్యతిరేకంగా నినాదాలతో హెూరెత్తించారు. గతంలో ఎప్పుడూ టీడీపీలో ఇలాంటి పరిణామాలు జిల్లాలో కనిపించలేదు.
టికెట్ మాకే వస్తుందని చివరకు ఇన్‌చార్జ్‌లకు బలంగా విశ్వసించారు. గత ఐదేళ్లుగా వైసీపీ నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పార్టీని, కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చామని దీనికి గొప్ప బహుమతి చంద్రబాబు ఇచ్చారంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అందుకే చంద్రబాబు ఫొటోలు పగలగొట్టి నిరసన తెలిపారు. జిల్లాలో శుక్రవారం వెల్లడించిన మూడు నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. పలాస గౌతు శిరీషకు కేటాయించారు. పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు, శ్రీకాకుళం నుంచి గొండు శంకర్‌ను బరిలో నిలుపుతున్నారు.
పలాస నియోజకవర్గానికి ఎవరూ పోటీ లేనప్పటికి శిరీషకు టికెట్ కేటాయించడంలో పార్టీ జాప్యం చేసింది. దీనిపై తీవ్ర చర్చసాగింది. చివరకు శిరీషకు కేటాయించారు. పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవీ టిక్కెట్ తమకే వస్తుందని ఆశించారు. ఈ రెండు నియోజకవర్గాలకు వేరేవారికి టికెట్ ఇచ్చారు.
2014 వరకు టీడీపీలో కొనసాగిన కలమట వెంకటరమణ ఎన్నికల ముందు వైసీపీలో చేరి ఆ ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం కలమట టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఆ నియోజకవర్గ ఇన్‌చార్జీగా బాధ్యతలతో పార్టీ కాపాడుకుంటు వస్తున్నారు. గతేడాది నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి కలమట వెంకటరమణ అంటూ చంద్రబాబు, రామ్మోహన్ అచ్చెన్న అనేక సందర్భాల్లో చెప్పారు. పాతపట్నం నియోజకవర్గం టికెట్ ఆశించిన మామిడి గోవిందరావు కూడా పార్టీ పరంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. రెబల్‌గా ముద్ర పడిన గోవిందరావు తరచూ అచ్చెన్న, రవికుమార్‌ను కలుస్తూ వారి మన్ననలు పొందారు. వారిద్వారానే లోకేష్, చంద్రబాబు దృష్టిలో పడ్డారని టాక్.
గోవిందరావుకు టికెట్ రావడానికి అచ్చెన్న, రవికుమార్ కారణమని కలమట వెంకటరమణ వర్గం మండిపడుతున్నారు. అందుకే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్టు భోగట్టా. రవికుమార్, అచ్చెన్నాయుడు పోటీ చేసే స్థానాల్లో పొటీకి దిగాలని కలమట వర్గం భావిస్తోంది. పాతపట్నంలో కలమట వెంకటరమణ రెబల్‌గా, ఆమదాలవలసలో కలమట వెంకటరమణ కుమారుడు సాగర్, టెక్కలి నుంచి కలమట వెంకటరమణ సతీమణి ఇందిర ను బరిలో దించాలని కేడర్ పట్టుపడుతున్నారు.
హిరమండలం జడ్పీటీసీ రాజీనామాకు సై
గోవిందరావుకు టికెట్ ఇచ్చారని కలమట అభిమానులు తట్టుకోలేకపోతు న్నారు. ఆయనకు మద్దతుగా రాజీనామాకు సిద్ధపడుతున్నారు. హిరమండలం జడ్పీటీసీగా ఉన్న బుచ్చిబాబు తన పదవీకి రాజీనామాకు సన్నద్ధమవుతున్నారు. మరికొందరు తాజా, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కూడ రాజీనామా చేస్తామంటున్నారు. టిక్కెట్ కలమటకేనంటూ పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చి మోసం చేసిందని మండిపడుతున్నారు. గత కొద్ది రోజులుగా కలమట అమరావతిలో మకాం వేసినా ఫలితం లేకపోయింది.
మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి టికెట్ ఆశించి భంగపడ్డారు. మూడో జాబితా వరకు ఎంతో ఆశగా ఉన్న ఆమెకు చివరి నిమిషంలో నిరాశ ఎదురైంది. శ్రీకాకుళం టిక్కెట్ గొండు శంకర్‌కు కేటాయించారని తెలిసిన పార్టీ కార్యకర్తలు, నాయకులు లక్ష్మీదేవి ఇంటికి చేరుకుని అన్యాయం జరిగిందని వాపోయారు. పార్టీ హైకమాండ్ కనీసం సంప్రదింపులు చేయకుండానే ఏకపక్షంగా టిక్కెట్ కేటాయించిందని మండి పడుతున్నారు. 40 ఏళ్లుగా పార్టీకి విశ్వాసంగా గుండ అప్పలసూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులు చేసిన సేవకు గొప్ప బహుమతి ఇచ్చారంటూ రగిలిపోతున్నారు. నమ్మించి మోసం చేశారని గుండ అనుచరుల వర్గం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్టీలో కొనసాగలేమంటూ టీడీపీ జెండాలు, బ్యానర్లు, కటౌట్లు, చంద్రబాబు, లోకేష్, అచ్చెన్న, రామ్మోహన్ పోస్టర్లు బూడిద చేశారు.
స్వతంత్రంగా బరిలో దిగి గుండ వెనుకున్న సత్తా చాటు దామంటూ బహిరంగంగా పార్టీ శ్రేణులు పిలుపునిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగాలంటూ అప్పలసూర్యానారాయణ, లక్ష్మీదేవిపై ఒత్తిడి చేస్తున్నారు. అప్పలసూర్యనారాయణ ఎంపీగా, లక్ష్మీదేవి శ్రీకాకుళం ఎమ్మెల్యేగా రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తే టిక్కెట్ రాకుండా అడ్డుకున్న పార్టీ నేతలకు బుద్ధి వస్తుందని హెచ్చరిస్తుండడంతో సిక్కోలు రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. 40 ఏళ్లు పార్టీకి ఎనలేని సేవ చేసుకు వచ్చిన పార్టీ కంటే మీ పట్ల ప్రజలకు, కేడర్‌కు విశ్వాసం ఉందని ఇక టీడీపీకి గుడ్‌బై చెప్పేద్దామంటూ తెలుగు తమ్ముళ్లు సెలవిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగితేనే అసలు సత్తా తేలుతుందని స్పష్టం చేస్తున్నారు.
ఆ రెండు నియోజకవర్గాలపై చర్చ
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటి వరకు ఎనిమిది నియోజకవర్గాలు సీట్లు ప్రకటించారు. ఇక ఎచ్చెర్ల, పాలకొండ సెగ్మెంటుల అభ్యర్ధుల పేర్లు ప్రకటించాల్సి ఉంది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూడా సీనియర్ నాయకుడైన కళా వెంకటరావుకు మూడో జాబితాలో చోటు దక్కకపోవడంతో అనుచరవర్గం తీవ్ర నిరాశచెందుతోంది. పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో జూనియర్లకు దక్కడంతో ఎచ్చెర్ల పై కూడ కళా ఆశలు వదులు కోవలసిందేనని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. అదే పరిస్థితి పాలకొండ నియోజకవర్గంలో కూడ కనిపిస్తుందని చెబుతున్నారు.