Telangana News: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. ఢిల్లీలో అభ్యర్థుల ఖరారుపై ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన టీపీసీసీ.. వారిలో కొంతమంది పేర్లను షార్ లిస్ట్ చేసి అధిష్టానానికి పంపింది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ లిస్ట్‌ను పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేయనుంది. అయితే పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న వేళ టీ పాలిటిక్స్‌లో నేతలు వలసలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో భేటీ అవ్వగా.. తాజాగా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కలిశారు.
త్వరలో నిర్ణయం తీసుకుంటా
రేవంత్ రెడ్డితో జరిగిన భేటీపై కోనేరు కోనప్ప క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డిని కలిశానని, ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆనను ఆయన ఆహ్వానించారని అన్నారు. పార్టీ మార్పుపై నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నానని, కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు కోనేరు కోనప్ప స్పష్టం చేశారు. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తుపై ఆయన విమర్శలు కురిపించారు. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం తనకు అసలు ఇష్టం లేదని, ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి తాను పనిచేయలేనని తెలిపారు. బీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలు తనను బాధ కలిగించాయని, తనను, తన కుటుంబాన్ని దూషించిన ప్రవీణ్ కుమార్‌తో పొత్తు పెట్టుకోవడం నచ్చలేదన్నారు. తనను రాజకీయంగా దెబ్బ తీయాలని ఆర్‌ఎస్పీ ఎంతో ప్రయత్నించారని, అలాంటి వ్యక్తితో తాను కలిసి పనిచేయలేనని పేర్కొన్నారు.
ఆర్‌ఎస్పీ తనపై ఎందుకు పోటీ చేశారు?
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనపైనే ఎందుకు పోటీ చేశారని కోనేరు కోనప్ప ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయని, కానీ తనపై పోటీ చేశారని అన్నారు. ఆర్ఎస్పీ తనపైనే ఎందుకు పోటీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతానని కోనేరు కోనప్ప స్పష్టం చేశారు. కాంగ్రెస్ నంచి తనకు ఎలాంటి హామీ రాలేదని, అయినా చేరుతానని అన్నారు. బీఆర్ఎస్, బీఎస్పీ సిద్దాంతాలను తాను వ్యతిరేకించడం లేదని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి పనిచేయలేకనే బీఆర్ఎస్‌ను వీడుతున్నట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కేసీఆర్‌ను ఆర్‌ఎస్పీ ఎన్నికలకు ముందు తీవ్రంగా విమర్శించారని, అలాంటి ఆయనతో పొత్తు ఎలా పెట్టుకుంటారని కోనేరు కోనప్ప ప్రశ్నించారు.
పొంగులేటితోనూ భేటీ
బుధవారం ఉదయం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కోనేను కోనప్ప భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరే విషయంపై ఆయనతో చర్చించారు. కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటానని పొంగులేటికి చెప్పారు. అయితే బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు పెట్టుకుంటున్నట్లు కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం ప్రకటించారు. దీనిపై అసంతృప్తితో ఉన్న కోనప్ప.. బుధవారం కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వచ్చారు. అనంతరం పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు.