Satya Sai District News: ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో ఎన్నికలవేళ రాజకీయ వేడి కొనసాగుతోంది. విజయం కోసం అధికార ప్రతిపక్షాలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు. వచ్చే ఐదేళ్లు చేయబోయే కార్యక్రమాలను ప్రజలకు చేరవేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 


పుట్టపర్తి(Puttaparthi)లో అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి(Sridhar Reddy) పోటీ చేస్తున్నారు. టీడీపీ(TDP) కూటమి తరఫున పల్లె రఘునాథ్‌ రెడ్డి(Palle Raghunath Reddy) కోడలు పల్లె సింధూర రెడ్డి(Palle Sindhura Reddy) బరిలో ఉన్నారు. పోటీలో సింధూర ఉన్నప్పటికీ మొత్తం ప్రచార బాధ్యతలను మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి భుజాన వేసుకున్నారు. అడుగడుగునా కోడలికి అండగా ఉంటూ పార్టీ తరఫున సింధూర రెడ్డిని గెలిపించేప్రయత్నాల్లో ఉన్నారు. మొదటి నుంచి పుట్టపర్తిలో ఇన్‌ఛార్జ్‌గా పల్లె రఘునాథ్‌రెడ్డి ఉన్నప్పటికీ యువతకు టికెట్లు ఎక్కువ ఇవ్వాలన్న కారణంతో ఇక్కడ సింధూరకు అవకాశం దక్కింది. అప్పటి నుంచి పల్లెల్లో తిరుగుతున్న సింధూర ప్రజలతో ఏకమయ్యారు. 




నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న సింధూర రెడ్డి: 
పల్లె రఘునాథ్ రెడ్డి రాజకీయ వారసురాలిగా పుట్టపర్తి అభ్యర్థిగా సింధూరకు టికెట్ అనౌన్స్ చేసిన రోజు నుంచి తనదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా గ్రామ గ్రామాన తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. పల్లె రఘునాథ్ రెడ్డిపై అభిమానంతో తనకు అవకాశం కల్పించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని హామీ ఇస్తున్నారు. 




కోడలి గెలుపు కోసం మామ 
కూటమి అభ్యర్థిగా కోడలికి టికెట్ కేటాయించడంతో గెలిపించి పట్టు నిలుపుకునేందుకు పల్లె రఘునాథ్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు నియోజవర్గ సమస్యలను ఎత్తి చూపుతున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా కేడర్‌ని ఉత్తేజపరుస్తూ పుట్టపర్తిలో గెలుపే ధ్యేయంగా పని చేస్తున్నారు. అసంతృప్తులతో చర్చలు జరిపి వారితో కూడా ప్రచారం చేయిస్తున్నారు. వాళ్లంతా సింధూర రెడ్డికి సహకరించేలా చర్యలను తీసుకున్నారు. 




ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి టార్గెట్‌గా మామ, కోడలి ప్రచారం 
సిట్టింగ్ ఎమ్మెల్యే కుంట శ్రీధర్ రెడ్డి పై ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి సింధూర రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే పుట్టపర్తిని అశాంతి నిలయంగా మార్చారని సింధూర రెడ్డి పదేపదే ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందంటూ విమర్శలు చేస్తున్నారు. పుట్టపర్తి గొడవలు దౌర్జన్యాలు పెరిగిపోయాయని ప్రజలకు వివరిస్తున్నారు. ఐదేళ్లలో జరిగిన విషయాలను గుర్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని పుట్టపర్తి నియోజకవర్గం మళ్లీ ప్రశాంత నిలయంగా మారుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు పల్లె సేవలు అందించారని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని సమస్య వచ్చినా పరిష్కారని ప్రజకు వివరిస్తున్నారు. ఎవరికి ఏం జరిగినా స్పందించే తత్వం ఉన్న వ్యక్తి అంటూ ఇంటింటికీ తిరిగి చెబుతున్నారు. అదే నచ్చి టికెట్ల విషయంలో సైతం చాలా మంది పేర్లు వచ్చినా పల్లె కుటుంబం వైపే అధినేత మొగ్గారని పేర్కొంటున్నారు.