Telangana Panchayat Polling: తెలంగాణలో సుదీర్ఘంగా సాగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం తుది దశకు చేరింది. మూడో విడత పోలింగ్‌తో పల్లెపోరుకు తెరపడింది. రాష్ట్రంలోని 18 మండలాల పరిధిలో ఉన్న 3752 పంచాయతీల సర్పంచ్‌లకు పోలింగ్ జరుగుతోంది.ఈ తుదిదశ పోలింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూసేందుకు పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు.
పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ వెంటనే ఏజెంట్ల సమక్షంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. సాయంత్రానికి ఫలితాలు ప్రకటిస్తారు. ముందుగా సర్పంచ్ వార్డు సభ్యులు ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఏదైనా కారణంతో ఓన్నిక వాయిదా పడితే గురువారం పోలింగ్ నిర్వహిస్తారు.
తెలంగాణలో ఇప్పటికే రెండు దశల పంచాయతీ ఎన్నికలను ఎస్‌ఈసీ పూర్తి చేసింది. ఇప్పుడు మూడో విడతను కూడా విజయవంతంగా పూర్తి చేయాలని ఏర్పాట్లు చేసింది. ఈ మూడో విడత ఎన్నికల్లో 3752 సర్పంచ్ పదవుల కోసం 12, 652 మంది బరిలో ఉన్నారు. 28, 410 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 75, 725మంది పోటీ పడుతున్నారు. వీళ్లను ఎన్నుకోవడానికి 53 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 26 లక్షల మంది అయితే స్త్రీలు 27 లక్షల మంది ఉన్నారు. ప్రజల స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు 36, 483 పోలింగ్ కేంద్రాలను ఎస్‌ఈసీ అధికారులు ఏర్పాటు చేశారు.
మూడో విడతలో మొత్తంగా 394 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం అయ్యాయి. దాదాపు ఎనిమిదివేల వార్డు సభ్యులు కూడ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంకా 11 సర్పంచ్ స్థానాలకు 116 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా పడలేదు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలగకుండా ఉండేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నేర చరిత్ర ఉన్న వారిని బైండోవర్ చేశారు. ముందు జాగ్రత్తగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉన్న వారి ఆయుధాను స్వాధీనం చేసుకున్నారు. రెండు కోట్ల విలువైన నగదు, నాలుగు కోట్ల విలువైన మద్యం, కోటి విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.