Family Casted Their Vote With Security: ఓటు.. సామాన్యులకు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు. ఐదేళ్లకోసారి తమను ఎన్నుకునే నాయకున్ని నిర్భయంగా ఎన్నుకునే ప్రక్రియ. ఈ నెల 13న ఏపీలో ఎన్నికల ప్రక్రియ జరిగిన సంగతి తెలిసిందే. చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే, ఈ ఎన్నికల్లో ఓ కుటుంబం మాత్రం పోలీస్, రెవెన్యూ అధికారుల బందోబస్తు మధ్య వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంబేడ్కర్ కోనసీమ (Konaseema) జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


భద్రత మధ్య ఎందుకంటే.?


అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రంలోని అమలాపురం (Amalapuram) పట్టణంలో ఓ కుటుంబానికి స్థానికులతో రహదారి వివాదం ఉంది. తాము ఓటేసేందుకు వెళ్లాలంటే ఆ దారి గుండానే వెళ్లాలి. అయితే, వివాదంతో తమను ఆ మార్గంలో అనుమతించరని, ఎలాగైనా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆ కుటుంబం భావించింది. ఈ క్రమంలో తమ సమస్యను వివరిస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై పరిశీలించిన ఈసీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించింది. అక్కడి నుంచి ఎన్నికల పరిశీలకుడికి తగు ఆదేశాలు అందడంతో పోలింగ్ రోజున ఓ కానిస్టేబుల్, రెవెన్యూ సిబ్బందిని ఆ కుటుంబానికి భద్రతగా పంపించారు. బందోబస్తు మధ్య ఆ కుటుంబం పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు వేశారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీసి భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు.


Also Read: Ap Elections 2024: ఎన్నికల కౌంటింగ్ - ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!