2024 సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమై మొదటి ఫేజ్  ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది (ఇక్కడ & ఇక్కడ). మెడలో కాంగ్రెస్‌ను పోలిన కండువాతో అల్లు అర్జున్ ఒక వాహనంపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తున్నట్టు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి చేస్తున్న క్లెయిమ్‌లో  నిజమెంతుందో చూద్దాం.

 


క్లెయిమ్: 2024 ఎన్నికలకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న వీడియో.


ఫాక్ట్(నిజం): ఈ దృశ్యాలు 2022లో అమెరికాలో జరిగిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలలో అల్లు అర్జున్ పాల్గొన్నప్పటివి. అమెరికాలోని ప్రవాస భారతీయులు నిర్వహించిన ఈ పరేడ్‌లో అల్లు అర్జున్‌ను గ్రాండ్ మార్షల్‌గా సత్కరించారు. ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకు మద్దతిచ్చినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.


ముందుగా ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకు మద్దతిచ్చినట్లు మాకు ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు. కాగా, ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోకు భారత ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో 2022లో అమెరికాలో జరిగిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించింది. 


ఈ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం ఇంటర్నెట్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఇవే దృశ్యాలను 2022లో రిపోర్ట్ చేసిన పలు కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం 2022లో న్యూయార్క్‌లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా జరిగిన ఇండియా డే పరేడ్‌లో గ్రాండ్ మార్షల్‌గా నటుడు అల్లు అర్జున్ పాల్గొన్నారు. ప్రస్తుతం షేర్ అవుతున్న దృశ్యాలు ఆ కార్యక్రమానికి సంబంధించినవే.


అమెరికాలోని ప్రవాస భారతీయులు నిర్వహించిన ఈ పరేడ్‌లో అల్లు అర్జున్‌ను గ్రాండ్ మార్షల్‌గా సత్కరించారు. ఈ కార్యక్రమం 21 ఆగస్టు 2022న జరిగింది. అల్లు అర్జున్ తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఫూటేజ్‌ను షేర్ చేసాడు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరికొన్ని కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ వివరాల బట్టి షేర్ అవుతున్న వీడియోకు ప్రస్తుత ఎన్నికలకు ఎటువంటి సంబంధంలేదని స్పష్టమవుతుంది. 


చివరగా, 2022లో అమెరికాలో జరిగిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అల్లు అర్జున్ పాల్గొన్న దృశ్యాలను ప్రస్తుత ఎన్నికల్లో అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నట్లు షేర్ చేస్తున్నారు .


This story was originally published by Factly.in, as part of the Shakti Collective. Except for the headline, excerpt and opening introduction para, this story has not been edited by ABP Desam staff.