ఫ్యాక్ట్ చెక్
ఒరిజినల్ వీడియోలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష కూటమి జనాలని మోసం చేసింది అని విమర్శించారు.


క్లెయిమ్ ఏంటి?


ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను జనాలని మోసం చేశాను అని ఒప్పుకుంటున్న వీడియో అని క్లైమ్ చేస్తూ ఒక 16 సెకన్ల వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో శాసనసభ, లోక్ సభ ఎన్నికలు మే 13 నాడు జరగనున్నాయని తెలిసిందే.


“ఈ ఎన్నికలలో మీ బిడ్డ, మీ బిడ్డ ఒక్కడు, అందరినీ మోసం చేశాడు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచీ లేదు కాబట్టి, ఒంటరిగా బయలదేరాడు ఎన్నికలలో యుద్ధానికి,” అని జగన్ అనటం మనం వినవచ్చు. ఈ క్లిప్ షేర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ ఇక్కడ  చూడవచ్చు.  


సోషల్ మీడియా పోస్ట్ స్క్రీన్ షాట్ (Source: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 


అయితే ఇది ఎడిటెడ్ వీడియో. ఒరిజినల్ వీడియోలో జగన్ ప్రతిపక్ష కూటమిని విమర్శించారు. ప్రతిపక్ష కూటమిలో తెలుగుదేశం పార్టీ, జన సేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉన్నాయి.


ఆ వీడియోపై ఏం తెలిసింది.. 


ఈ వీడియో కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతుకుగా ఒరిజినల్ వీడియో మాకు లభించింది. ఏప్రిల్ 19, 2024 నాడు కాకినాడలో జరిగిన మేమంతా సిద్ధం సభ వీడియో ఇది. ఈ సభని సాక్షి చానల్ లైవ్ స్ట్రీమ్ చేసింది. వైరల్ వీడియోలో కూడా సాక్షి లోగో చూడవచ్చు.



ఈ ఒరిజినల్ వీడియోలో జగన్ 22:55 నుండి 23:21 మధ్య చేసిన వ్యాఖ్యలని క్రాప్ చేసి, వేరే చోట్ల యాడ్ చేసి వీడియోని వైరల్ చేశారు.


ఈ భాగంలో సీఎం జగన్, “ఈ ఎన్నికలలో ఇంటింటికీ మీ బిడ్డ మంచి చేశాడు కాబట్టి, మీ బిడ్డ ఒంటరిగా బయలదేరాడు ఎన్నికలలో యుద్ధానికి. అందరినీ మోసం చేశాడు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచీ లేదు కాబట్టి, కూటమిగా వారందరూ కూడా ఏకం అయ్యారు. మీ బిడ్డ ఒక్కడు, నక్కలు, తోడేళ్ళు అనేక మంది,” అని చెప్పటం మనం వినవచ్చు.


ఈ భాగంలో నుండి “మోసం చేశాడు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచీ లేదు కాబట్టి” అనే భాగాన్ని క్రాప్ చేసి, తన గురించి తాను మాట్లాడుతున్న భాగంలోకి జొప్పించి, తాను ప్రజలని మోసం చేశానని ఒప్పుకుంటున్నట్టుగా వైరల్ వీడియోని చేశారు. అయితే ఒరిజినల్ వీడియోలో, తాను ప్రతిపక్ష కూటమిని విమర్శిస్తున్నారు.


ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి ఇటువంటి అనేక ఎడిటెడ్ వీడియోలని లాజికల్లీ ఫ్యాక్ట్స్ డీబంక్ చేసింది. వాటిల్లో కొన్నింటిని ఇక్కడ ఇక్కడ  చదవొచ్చు. 


 వాస్తవం (Fact) 
ఎడిటెడ్ వీడియో క్లిప్ షేర్ చేసి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను జనాలని మోసం చేశానని ఒప్పుకున్నారని క్లైమ్ చేశారు. అయితే ఒరిజినల్ వీడియోలో తను ప్రతిపక్ష కూటమి జనాలని మోసం చేసింది అని విమర్శించారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని నిర్ధారణ అయింది. 


This story was originally published by Logicallyfacts, as part of the Shakti Collective. Except for the headline, excerpt and opening introduction para, this story has not been edited by ABP Desam staff.