Andhra Pradesh News: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా రాష్ట్రంలో ఇంటి వద్ద నుంచే ఓటు వేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తోంది. ఇంటి నుంచే ఓటింగ్ చేసే దానిపైనా, పోస్టల్ బ్యాలెట్ వినియోగంపైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. తొలిసారిగా అవకాశం కల్పిస్తున్న ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే వర్గాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వారికి ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేలా అవగాహన కలిగించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ ఎన్నికల్లో 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగవైకల్యం ఉన్నవాళ్లు పోలింగ్ స్టేషన్‌కు వచ్చిగానీ, ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ అండ్ హోం ఓటింగ్‌కు సన్నద్ధత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై అధికారులతో సచివాలయం నుచి మీనా జిల్లాల ఎన్నికల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్ధేశం చేశారు.
ఫారం 12డి దరఖాస్తు చేసుకోవాలి
ఇంటి వద్ద నుంచి ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే ముందుగా రిటర్నింగ్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫారం 12 డి ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికే ఇంటి వద్ద నుంచి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించనున్నట్టు ఎన్నికల అధికారి వెల్లడించారు. ఒకసారి ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశం పొందితే వారు నేరుగా పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోతారన్న విషయంపై ఓటర్లకు అవగాహన కలిగించాలని ఎన్నికల అధికారి అధికారులకు సూచించారు. ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే వవారి కోసం వీడియో గ్రాఫర్‌తో, ఐదుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు ముందుస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని మీనా అధికారులను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వివిధ శాఖల ఉద్యోగులు, సర్వీసు ఓటర్లకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని వివరించారు. ఈ మేరకు జిల్లాల్లోని ఎన్నికల అధికారులు సన్నద్ధం కావాలని సూచించారు. ఈ మేరకు ప్రతి రిటర్నింగ్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల కలెక్టర్లు హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్లకు తీసుకుంటున్న చర్యలను ఎన్నికల అధికారికి వివరించారు.
ఎంతో మేలు
ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తుండడం వల్ల ఎంతో మంది వృద్ధులకు మేలు కలుగుతుంది. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టలేని ఎంతో మంది ఓటింగ్ రోజు తీవ్ర ఇబ్బందులు పడి మరీ ఓటు వేస్తూ వస్తున్నారు. కొత్తగా తీసుకువస్తున్న ఈ విధానం వల్ల అటువంటి వృద్ధులు.. ఈ తరహా ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందడంతోపాటు సులభంగా ఓటును వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. ఇటువంటి వృద్ధులు ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో కనీసం ఐదు నుంచి పది మంది, ఇంకా ఎక్కువ మంది ఉండే అవకాశముంది.