Election Commission Guidelines On Postal Ballot: పోస్టల్ బ్యాలెట్‌పై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కీలక ఆదేశాలు జారీ చేసింది. రిటర్నింగ్ అధికారి (RO) సీల్ లేకున్నా పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈసీ మార్గదర్శకాలను సీఈవో ముకేశ్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) అన్ని జిల్లాల అధికారులకు పంపించారు. 'ఆర్వో సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్స్ చెల్లుబాటవుతాయి. 'ఫామ్ 13ఏ'పై ఆర్వో సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలి. అలా ఉండి స్టాంప్ లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుంది. ఆర్వో సంతకంతో పాటు బ్యాలెట్ ధ్రువీకరించే రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలి. ఫామ్ 13ఏలో ఓటరు, ఆర్వో సంతకం, బ్యాలెట్ సీరియల్ నెంబర్ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చు. అలాగే, పోస్టల్ బ్యాలెట్ పేపర్‌పై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయకపోయినా, ఆ ఓటు తిరస్కరించవచ్చు.' అని ఈసీ పేర్కొంది.  మరోవైపు, జూన్ 4న ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. 


కేంద్రాల వద్ద నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ సహా.. కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు సమన్వయంతో భద్రతను పర్యవేక్షించనున్నారు. జిల్లాల్లోని అన్ని కౌంటింగ్ కేంద్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కేంద్రాల వద్ద హైస్పీడ్ ఇంటర్నెట్, టేబుళ్ల నిర్వహణ, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను సీఈవో ఎంకే మీనా ఆదేశించారు. కౌంటింగ్‌కు హాజరయ్యే సిబ్బందికి, అధికారులకు, ఏజెంట్లకు, నియోజకవర్గం అభ్యర్థులకు అల్బాహారం, భోజనం, మంచినీళ్లు సహా ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతి ఉండదు. వీటిని భద్రపరిచేందుకు ప్రతి కేంద్రంలోనూ ఓ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నారు.


Also Read: Ap Elections 2024: పోలీస్ బందోబస్తుతో వెళ్లి ఓటేసిన కుటుంబం - ఆలస్యంగా వెలుగులోకి, ఎందుకో తెలుసా?