తెలంగాణలో ఎన్నికలు వస్తున్నందున కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ఉంది. కానీ, అది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించింది. దీనిపై తాజాగా ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక ప్రభుత్వం తెలంగాణలో ప్రకటనలు ఇవ్వడంపై కేంద్ర ఎన్నికల సంఘం మండిపడింది. ఎన్నికల సమయంలో పక్క రాష్ట్రంలో ప్రకటనలు జారీ చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని చెప్పింది. ఈ తప్పిదంపై మంగళవారం సాయంత్రం ఐదు గంటల్లోపు తమకు వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. వెంటనే కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలు తెలంగాణలో నిలిపివేయాలని ఆదేశించింది. సంబంధిత శాఖ కార్యదర్శిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని లేఖలో రాసింది.
గత కొన్ని రోజులుగా తెలంగాణలో కర్ణాటకకు సంబంధించిన ప్రకటనలు వస్తున్నాయని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చాయి. పదే పదే ఫిర్యాదులు వస్తుండడంతో స్పందించిన ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. తమ ప్రకటనలను తెలంగాణలో ఇవ్వడంపై కర్ణాటక ప్రభుత్వం తమ నుంచి ఏ అనుమతులు పొందలేదని, కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదని ఎన్నికల సంఘం వెల్లడించింది.
బీఆర్ఎస్‌పై ఆగ్రహం, నోటీసులు జారీ
తెలంగాణ వ్యాప్తంగా వివిధ పత్రికల్లో ‘స్కాంగ్రెస్’ పేరుతో ప్రకటనలు ఇస్తున్న బీఆర్ఎస్ పై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయగా, ఈసీ పరిగణనలోకి తీసుకుంది. ఈ ప్రకటనల విషయంలో తమకు 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.