Election 2022 Voting Live Updates: సాయంత్రం 5 గంటల వరకు పంజాబ్‌లో 63%, యూపీలో 57% ఓటింగ్
పంజాబ్ సహా ఉత్తర్‌ప్రదేశ్ మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
సాయంత్రం 5 గంటల వరకు పంజాబ్‌లో 63%, ఉత్తర్‌ప్రదేశ్‌లో 57 % పోలింగ్ నమోదైంది.
మధ్యాహ్నం 3 గంటల వరకు పంజాబ్‌లో 49.81%, యూపీలో 48.81% పోలింగ్ నమోదైంది.
యూపీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటాపోటీగా పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పంజాబ్‌లో 34 శాతం, యూపీలో 36 శాతం పోలింగ్ నమోదైంది.
యాక్టర్ సోనూసూద్ కారును పంజాబ్ మోగా జిల్లా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మోగాలోని ఓ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు సోనూసూద్ ప్రయత్నించారని దీంతో ఆయన కారును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మోగా జిల్లా పీఆర్‌ఓ వెల్లడించారు.
మోగా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సోనూసూద్ సోదరి మాల్విక సూద్ పోటీ చేస్తున్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు పంజాబ్‌లో 17.77% పోలింగ్ నమోదైంది. యూపీ మూడో విడత పోలింగ్‌లో ఉదయం 11 గంటల వరకు 21.18% ఓటింగ్ నమోదైంది.
శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ లంబీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఆయనతో పాటు హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, ప్రకాశ్ సింగ్ బాదల్ కూడా ఉన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కర్హాల్ నియోజకవర్గంలోని జశ్వంత్ నగర్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మొదటి రెండు విడతల్లోనూ 100కు పైగా స్థానాలను సమాజ్‌వాదీ దక్కించుకుంటుందని అఖిలేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ విడతలో కూడా ఎక్కువ స్థానాలు తమకే వస్తాయన్నారు.
Background
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్లో భాగంగా ఈరోజు పంజాబ్‌కు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ బూత్ లోనికి ఓటర్లను అనుమతిస్తారు. మొత్తం 117 స్థానాలకు ఈరోజే ఓటింగ్ జరుగుతోంది.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మూడో దశ పోలింగ్ కూడా ప్రారంభమైంది. ఉదయం 7 గం. నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 16 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి.
నేతల అభ్యర్థన
పంజాబ్ ప్రజలు తమ అమూల్యమైన భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయాలని దిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
పంజాబ్ ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. కొత్త ఆలోచనతో పంజాబ్ ముందుకెళ్లేందుకు మీ ఓటు ఉపయోగపడుతుందని ప్రియాంక అన్నారు.
భాజుపాకు గట్టి గుణపాఠం చెప్పేలా ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనాలని బహుజన్‌సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాలకు అందరూ తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -