Election Commission Orders On AP Elections : ఏపీలో పోలింగ్ అనంతరం జరిగిన హింసపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంది. అధికారులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్ష్యంగా వ్యవహిరంచినట్లుగా గుర్తించి సస్పెన్షన్లు, బదిలీలు చేసింది. ఏపీ సీఎస్, డీజీపీని పిలిపించుకుని వివరణ తీసుకున్న తర్వాత ఆదేశాలు జారీ చేసింది.
పల్నాడు జిల్లా కలెక్టర్ ను ఉన్న పళంగా బదిలీ చేయాలని ఆదేశించింది. ఆయనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.
పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీల్ని తక్షణం సస్సెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే వారిపై శాఖాపరమైన విచారణ కూడా చేయనున్నారు. తిరుపతి ఎస్పీని బదిలీ చేశారు. ఆయనపై కూడా శాఖాపరమైన విచారణ జరగనుంది. ప్రతి కేసులోనూ రెండు రోజుల్లో యాక్షన్ టేకెన్ రిపోర్టును సమర్పించాలని ఈసీ ఆదేశించింది. అలాగే కౌంటింగ్ అనంతరం ఎలాంటి పరిణామాలు సంభవించకుండా 25 CAPF కంపెనీల దళాలు ఏపీలోనే ఉంచాలని ఈసీ స్పష్టం చేసింది.
మూడు జిల్లాల్లో 12 మంది ఇతర పోలీసు అధికారుల సస్పెన్షన్ వేటు వేసింది. కౌంటింగ్ తర్వాత కూడా హింస చెలరేగే అవకాశం ఉండటంతో 25 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను ఏపీలో 15 రోజుల పాటు కొనసాగించాలని స్పష్టం చేసింది. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగే హింసను అదుపు చేయడానికి ఈ బలగాలను వినియోగించాలని ఆదేసించింది. హింస ప్రజ్వరిల్లవడం వెనుక పోలీసుల కుట్ర ఉందని.. తేలడంతో పన్నెండు మంది ఇతర అధికారులపై చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా అల్లరి మూకలకు సమాచారం ఇవ్వడం.. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించకపోవడం.. నిందితుల్ని అరెస్టు చేయకపోవడం వంటివి చేశారని ఈసీ గుర్తించినట్లుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం చెలరేగిన హింస కలకలం రేపుతోంది. వరుసగా మూడు రోజుల పాటు ఇవి జరిగాయి. పదమూడో తేదీన పోలింగ్ జరుగుతున్న సమయంలో ప్రారంభమైన హింస.. నిరాటంకంగా సాగింది. మాచర్ల, నర్సరావుపేట, తిరుపతి వంటి చోట్ల జరిగిన హింసలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా బయటపడింది. కింది స్థాయి అధికారులే అధికార పార్టీ నేతలకు.. ప్రతిపక్ష నేతల కదలికలపై సమాచారం ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. ఇలా ఇచ్చిన వారి వివరాలను కూడా గుర్తించారని.. ఆ వివరాలను ఈసీకి ఇవ్వడంతోనే చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఏపీ డీజీపీ, ఏపీ సీఎస్ తీరుపైనా ఈసీ అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ఉండటంతో ఆయనపై కూడా ఒకటి, రెండు రోజుల్లో వేటు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.