Congress CM Candidate for Telangana: హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ నేతల బృందం రాజ్ భవన్ కు వెళ్లింది. గర్నవర్ తమిళిసైని కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థుల జాబితాను గవర్నర్ తమిళిసైకి అందజేశారు. గవర్నర్ తమిళిసైతో కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. గవర్నర్ ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్ కు కాంగ్రెస్ నేతలు లేఖ అందజేశారు.


రేపు ఉదయం సీఎల్పీ భేటీ..
గవర్నర్ ను కలిసిన అనంతరం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ నేత మాణిక్ ఠాక్రే, రేవంత్, ఉత్తమ్ తదితర నేతలతో వెళ్లి గవర్నర్ ను కలిసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమని గవర్నర్ కు చెప్పామన్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశం కానుందని శివకుమార్ తెలిపారు. ఈరోజు రాత్రికి ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు చేరుకోలేకపోయినందున రేపు ఉదయం సీఎల్పీ భేటీ నిర్ణయించామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విధానాన్ని అనుసరించి ఎమ్మెల్యేలు సీఎల్పీ భేటీలో సీఎం ఎవరనేది చర్చించి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.