Who is Next Karnataka CM : కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ.. అధికారానికి కావాల్సిన పూర్తి మెజార్టీ సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 113కు మించి.. అత్యధిక సీట్లలో గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థులు. 130 సీట్లలో విజయం ఖాయంగా ఉంది. విక్టరీ వన్ సైడ్ కావటంతో.. కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం కొత్త సీఎం ఎవరు అనే అంెసంపై మేధోమథనం జరుపుతోంది. ప్రస్తుతం ఇద్దరు అగ్రనేతలు పోటీలో ఉన్నారు. ఒకరు మాజీ సీఎం సిద్దరామయ్య.. మరొకరు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజార్టీ తీసుకురావటంలో తీవ్రంగా కృషి చేశారు.
పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడిన పని చేసిన డీకే శివకుమార్
గత ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో.. డీకే శివకుమార్ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. అన్నీ తానై వ్యవహరించారు. పార్టీని నడిపించటంలో.. పార్టీ క్యాడర్ కు ఉత్సాహం నింపటంలో ముందున్నారు. కాంగ్రెస్ నుంచి చేజారిన నేతలను తిరిగి కాంగ్రెస్ వైపు తీసుకొచ్చారు. క్యాంప్ రాజకీయాల ఉచ్చులో చిక్కుకున్న వారిని సైతం ఒప్పించి తీసుకొచ్చారు. ఆయన మనీలాండరింగ్ కేసులు ఎదుర్కొన్నారు. జైలుకు కూడా వెళ్లి వచ్చారు. డీకే శివకుమార్ జైలులో ఉన్నప్పుడు సోనియాగాంధీ స్వయంగా జైలుకు వెళ్లి పరామర్శించి వచ్చారు. రాహుల్ గాంధీ పాదయాత్రను కర్ణాటక రాష్ట్రంలో విజయవంతం చేయటంలో డీకే శివకుమార్ పాత్ర కీలకం.
వ్యూహ నిపుణుడు సిద్దరామయ్య
ఇదే సమయంలో మాజీ సీఎం సిద్దరామయ్యను కూడా విస్మరించలేని విషయం. గతంలో ఆయన ఐదేళ్లు సీఎంగా చేసినప్పుడు చేసిన అభివృద్ధి కలిసొచ్చింది. మంచి మాటకారి.. వ్యూహ రచన చేయటంలో దిట్ట. బ్రహ్మాణ – వక్కలింగ – లింగాయత్ సామాజిక వర్గాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి.. గత ఎన్నికల్లోనే కాదు.. ఈ ఎన్నికల్లోనూ ఆయన చేసిన ప్రయోగం ఫలించింది. వ్యక్తిత్వంగా మంచి పేరు ఉంది. కర్ణాటక సీఎం ఎవరు ఉంటే బాగుంటుంది అంటూ చేసిన సర్వేల్లో సిద్దరామయ్యకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. 45 శాతానికి పైగా ప్రజలు.. సిద్దరామయ్య సీఎంగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన తన మనసులోని మాట బయటపెట్టారు. సీఎం నేనే అవుతానంటూ చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. తన రాజకీయ జీవితానికి ఇవే చివరి ఎన్నికలు అని.. చివరి సారిగా సీఎం అయ్యి.. రాజకీయాలకు గుడ్ బై చెబుతానంటూ కామెంట్లు చేశారు.
ఇద్దరికీ పదవిని పంచుతారా ? మొదట సిద్ధరామయ్యకే చాన్సిస్తారా ?
ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు సీఎంను ఎంపిక చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ కొత్త ఫార్ములాను రెడీ చేస్తున్నట్లగా భావిస్తున్నారు. ఇద్దరికీ పదవిని పంచాలనే ఓ ఫార్ములాపై వర్కవుట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డీకే శివకుమార్ సేవలు పార్టీకి చాలా ఉపయోగకరమని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ ఆయన సేవలను కర్ణాటకలోనే కాకుండా.. దక్షిణాది మొత్తం ఉపయోగించుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే ముందుగా సిద్ధరామయ్యను సీఎం చేసే అవకాశం ఉందని అంటున్నారు. సార్వత్రిక ఎన్నకిల వరకూ సిద్దరామయ్యను సీఎంగా ఉంచి.. సార్వత్రిక ఎన్నికల తర్వాత శివకమార్ కు సీఎం పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. పైగా సిద్దరామయ్య తనకు ఇదే చివరి ఎన్నికలని.. చివరి చాన్స్ అని చెబుతున్నారు. దీనిపై అందరితో చర్చించిన తర్వాత హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.