Elections 2024 :  మాచర్లలో పోలింగ్ సమయంలో ఈవీఎంలను ధ్వంసం చేయడం, పోలింగ్ అనంతర ఘర్షణలపై కేసులు నమోదు కావడంతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నారు. ఆయనను అరెస్టు చేసి తీరాల్సిందేనని చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆదేశించడంతో ఏపీ అధికారులు హైదరాబాద్ లో ఉన్న ఆయనను పట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. బుధవారం మధ్యాహ్నం ఆయనను అరెస్టు చేసినట్లుగా ప్రచారం జరిగింది.  పోలీసు వర్గాలు ఈ మేరకు మీడియాకు సమాచారం లీక్ చేశాయి. సంగారెడ్డి వద్ద ఉన్న ఓ పరిశ్రమ గెస్ట్ హౌస్ లో వారిని పట్టుకుని ఏపీకి తరలిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది.         


తమ జిల్లా పరిధిలో అరెస్టు చేయలేదన్న సంగారెడ్డి ఎస్పీ                              


అయితే సంగారెడ్డి జిల్లా ఎస్పీ మాత్రం ఈ వార్తలను ధృవీకరించలేదు. తమ జిల్లా పరిధిలో పిన్నెల్లి అరెస్టు జరగలేదని ఆయన ప్రకటించారు. ఆయనను వెంబడించాం కానీ దొరకలేదని.. పారిపోయారని చెప్పారు. సాయంత్రం ఐదు గంటల లోపు అరెస్టు చేసి నివేదిక సమర్పించాలని సీఈవోను .. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఐదు గంటల  కల్లా ఆయనను అరెస్టు చూపించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఏపీ పోలీసులు మాత్రం అరెస్టును ధృవీకరించడం లేదు.                                       


పిన్నెల్లి అరెస్టుపై రోజంతా హైడ్రామా                         


పిన్నెల్లి అరెస్టు విషయంలో ఉదయం నుంచి అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయనను అరెస్టు చేసేందుకు ఏపీ నుంచి  ప్రత్యేక పోలీసు బృందాలు హైదరాబాద్ చేరుకున్నాయి. అయితే ఆ సమాచారం తెలియడంతో ఆయన సంగారెడ్డి వైపు తన అనుచరులతో కలిసి పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఆయన సంగారెడ్డి సమీపంలోని కంది వద్ద వాహనాలను  ఫోన్లను వదిలేసి వెళ్లిపోయారు. ఎక్కడికి వెళ్లారో తెలియదు. తర్వాత ఆయనను మహారాష్ట్ర సరిహద్దుల్లో పట్టుకున్నారని ఓ సారి... సంగారె్డిలోనే ఓ పరిశ్రమలో పట్టుకున్నారని మరోసారి ప్రచారం జరిగింది.           


ఎలాంటి ప్రకటనా చేయని ఏపీ పోలీసులు                                


అరెస్టు అయిన చాలా సేపటి వరకూ పోలీసులు ధృవీకరించలేదు. మరో వైపు హైదరాబాద్ లోని పిన్నెల్లి ఇంటి వద్ద పోలీసుల ఎక్కువగా ఉన్నారు. ఆయన పారిపోలేదని ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారని చెప్పేందుకు అక్కడే అరెస్టు చూపించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. తర్వాత పిన్నెల్లి విదేశాలకు వెళ్లిపోయారని.. వీసా అవసరం లేని దేశాలకు వెళ్లాడని చెప్పుకుంటున్నారు. మరో వైపు ఆయన విదేశాలకు వెళ్లకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం వ్యవహారంపై రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయడం లేదు.