Cm Jagan Meet With Ysrcp Leaders For Manifesto: ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న వేళ ఇప్పటికే ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెట్టిన సీఎం జగన్ (Cm Jagan).. ఇప్పుడు మేనిఫెస్టో రూపకల్పనపై దృష్టి సారించారు. ప్రస్తుతం విశాఖలో (Visakha) బస్సు యాత్ర చేస్తోన్న ఆయన.. సోమవారం పార్టీ కీలక నేతలతో భేటీ కానున్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలపై తుది కసరత్తు చేస్తున్నారు. ఉత్తరాంధ్రను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని హామీలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అటు, అన్ని వర్గాలకు లబ్ధి కలిగేలా మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నారు. తుది మేనిఫెస్టోను సోమవారం ఖరారు చేయనున్న జగన్.. ఈ నెల 26, 27 తేదీల్లో మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 25న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆ తర్వాతే మేనిఫెస్టో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.


సర్వత్రా ఆసక్తి


గత ఎన్నికల్లో నవరత్నాల హామీలతో సీఎం జగన్ సత్తా చాటారు. అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, ఫీజు రీయింబర్స్ మెంట్, పేదలందరికీ ఇళ్లు, రైతు భరోసా, ఆరోగ్య శ్రీ, పింఛన్ల కానుక వంటి హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ద్వారా నిరంతరం ప్రజలతో మమేకం అవుతున్నారు. ఐదేళ్లలో ఇంటింటికీ సంక్షేమ అందించామని.. ఎలాంటి అవినీతికి తావు లేకుండా దాదాపు రూ.2.70 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే వేశామని పేర్కొంటున్నారు. తాము అలవి కాని హామీలు ఇవ్వలేదని.. చేసేదే చెప్తామని.. చెప్పిందే చేస్తామని ప్రచారంలో జగన్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేసినట్లు వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. హామీల్లో ఇచ్చిన వాటినే కాకుండా ఇవ్వని వాటిని కూడా అమలు చేశారని చెప్పారు. 'మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి' అంటూ ఎన్నికల్లో సీఎం జగన్ ప్రజలకు పిలుపునిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కొనసాగాలంటే మంచి చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలంటూ అభ్యర్థిస్తున్నారు.


అటు, టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో పథకాలు ప్రకటించగా.. ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి సీఎం జగన్ ఎలాంటి హామీలు ఇస్తారో అని అంతా ఎదురుచూస్తున్నారు. హోరా హోరీ ఎన్నికల యుద్ధంలో పార్టీల మేనిఫెస్టోలపై అటు రాజకీయంగా, ఇటు బహిరంగంగా చర్చ సాగుతోంది.


Also Read: YS Sharmila: ఇదేనా వైఎస్ఆర్ వారసత్వం? వైసీపీకి ఓటేస్తే బూడిదలోపోసిన పన్నీరే - షర్మిల