Elections 2024 :  పిఠాపురం ప్రచారానికి రావాలని పవన్ కల్యాణ్ ఎప్పుడూ కోరుకోలేదని.. తన కంఫర్ట్ కే వదిలేస్తాడని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. పిఠాపురంలో చిరంజీవి  ప్రచారం  చేస్తారనేది మీడియా సృష్టించినదేనని తాను ఎందుకు సమాధానం చెప్పాలన్నారు. ఢిల్లీలో పద్మ విభూషణ్ అందుకున్న తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాారు. ఈ సందర్భంగా రాజకీయ అంశాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఉండాలనుకుంటున్నానని చెప్పారు. వ్యక్తిగతంగా తన మిత్రులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశానని.. పవన్ లాంటి నేతలకు ప్రజలు అండగా ఉండాలని అడగడానికే వీడియో విడుదల చేశానన్నారు.                                                                 

  


ఈ సమయంలో కొంత మంది ప్రతినిధులు మీరు కాంగ్రెస్ లో ఉన్నారా అని ప్రశ్నించారు. చిరంజీవి తాను కాంగ్రెస్ లో లేనని చేతులు ఊపుతూ వెళ్లిపోయారు. నిజానికి చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తర్వాత రాజకీయాల జోలికి రాలేదు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకున్నట్లుగా కూడా ప్రకటించారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం.. చిరంజీవి తమ పార్టీలో ఉన్నారని చెప్పుకుంటూ ఉంటారు. ఇటీవల పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి రూ. ఐదు కోట్ల విరాళాన్ని చిరంజీవి ఇచ్చారు. ఈ సందర్భంగా కొంత మంది కాంగ్రెస్ నేతలు.. ఈ విషయాన్ని  తమ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని ప్రకటనలు చేశారు. 


తిరుపతికి చెందిన చింతామోహన్ ప్రతీ సారి చిరంజీవి ప్రస్తావన తీసుకు వ్తస్తూంటారు. ఆయన కాంగ్రెస్ లో మళ్లీ యాక్టివ్ అయితే.. ముఖ్యమంత్రి పదవి వస్తుందని చెప్పేవారు. కానీ కానీ చిరంజీవి ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల జోలికి రాలేదు. 2019 ఎన్నికలకు ముందు చిరంజీవి ఫ్యాన్స్ అందరూ జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చిరంజీవి ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రారని పవన్ కూడా ప్రకటించారు. చిరంజీవి కూడా ఆ మాటకే కట్టుబడి ఉన్నారు. ఆయనకు  బీజేపీ నుంచి పలుమార్లు ఆఫర్లు వచ్చినప్పటికీ రాజకీయాల్లోకి వచ్చేది లేదని తెగేసి చెప్పారు.                     


వైఎస్ఆర్‌సీపీ కూడా ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ చిరంజీవి అలాంటిదేమీ లేదని.. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం లేదని ఎప్పుడో స్పష్టం చేశానన్నారు. అయితే చిరంజీవి ఓ సినిమాలో డైలాగ్ చెప్పినట్లుగా రాజకీయాలకు ఆయన దూరమైనా రాజకీయాలు మాత్రం ఆయన చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి.