Chandragiri leaders created tension in Tirupati : తిరుపతిలో తెలుగుదేశం, వైసీపీ కార్యకర్తల ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి నామినేషన్ వేయడానికి తిరుపతి ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. ఇందు కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు ఆర్డీఓ కార్యాలయం దగ్గర గుమికూడారు. అంతకు ముందే టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కూడా పెద్ద ఎత్తున ర్యాలీతో ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్లు వేసేందుకు లోపలికి వెళ్లారు. వారు లోపలికి వెళ్లిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగిందంటూ వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడులకు దిగారు. టీడీపీ కార్యకర్తలు ప్రతి దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
లాఠీచార్జి చేసి చెల్లాచెదురు చేసిన పోలీసులు
ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అభ్యర్థులు ఇద్దరూ నామినేషన్లు వేసి వెళ్లిపోయేంత వరకూ చుట్టుపక్క ఎవర్నీై ఉండనీయకుండా లాఠీచార్జ్ చేశారు. రెండు పార్టీల కార్యకర్తల్ని చెరో వైపు చెల్లా చెదురు చేశారు. కాసేపటి తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ సారి ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చే్సతున్నారు. చంద్రగిరి నుంచి తన కుమారుడు మోహిత్ రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించుకున్నారు. ఓ వైపు ఒంగోలులో ప్రచారం చేస్తూ.. మరో వైపు కుమారుడి రాజకీయాన్ని కూడా చక్కదిద్దుతున్నారు. ఈ రోజు నామినేషన్ వేయించేందుకు స్వయంగా వచ్చారు.
చావో రేవో అన్నట్లుగా పులివర్తి నాని రాజకీయం
మరో వైపు టీడీపీ నేత పులివర్తి నాని చావో రేవో అన్నట్లుగా రాజకీయం చేస్తున్నారు. ఆయన ఓ సారి దొంగ ఓట్ల వివాదంలో ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో చాలా రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. ఆయన భార్య సుధారెడ్డి కూడా చెవిరెడ్డిపై పోరాడుున్నారు. పేదల ఇళ్లు తొలగిస్తున్న సందర్భంలో ఆమె అడ్డుకోవడానికి వెళ్తే పోలీసులు లాగి పడేసిన ఘటనలో ఆమె కాలు విరిగింది. తీవ్రమైన వేధింపుల మధ్య తాము రాజకీయం చేస్తున్నామని పులివర్తి వర్గీయులు అంటున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాలు ఎదురు పడితే పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది.
ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే సమస్యాత్మక నియోజకవర్గాల్లో చంద్రగిరి కూడా ఉంటుందని భావిస్తున్నారు. గత ఐదేళ్లుగా రాజకీయాల్లో ప్రత్యర్థులు కన్నా.. వ్యక్తిగత శత్రువులు అన్నట్లుగా రెండు పార్టీలు మారిపోవడంతో సమస్యలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అవి మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి.