తెలంగాణలో ఎన్నికల హడావుడి పెరిగింది. అధికార బీఆర్ఎస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో మరింత వేగం పెంచనుంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితా ప్రకటించి.. అభివృద్ధి  కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో బిజీబిజీగా ఉన్నారు బీఆర్‌ఎస్‌ మంత్రులు. దశల వారీగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అందిస్తోంది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. పెండింగ్‌  ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రారంభిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే లోగా... చేయాల్సిన పనులు, ఇచ్చిన హామీలు నెరవేస్తున్నారు. 


ఇక, వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పక్కా వ్యూహరచన చేస్తోంది బీఆర్‌ఎస్‌. ఎన్నికల బరిలో దిగే క్యాండిడేట్స్‌ను అందరి కంటే ముందుగా ఖరారు చేసింది. ఇప్పుడు  మేనిఫెస్టోకు మెరుగులు దిద్దుతోంది. త్వరలోనే మేనిఫెస్టోను విడుదల చేయనుంది బీఆర్‌ఎస్‌. భారీ బహిరంగ సభ నిర్వహించి... మేనిఫెస్టోను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఈనెల 16న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి... ఆ సభలోనే సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో విడుదల చేస్తారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు.


వరంగల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్ని మంత్రి హరీష్‌రావు... ఈనెల 16న వరంగల్‌ భారీ బహిరంగ సభ జరగబోతోందని చెప్పారు. వరంగల్‌ సభా వేదికలో సీఎం కేసీఆర్‌ మేనిఫెస్టో రిలీజ్‌ చేయబోతున్నట్టు చెప్పారు. అంతేకాదు శుభవార్త వినడానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలని కూడా ఆయన చూసించారు. అంతేకాదు... ప్రతిపక్షాలకు మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఉండబోతుందన్నారు మంత్రి హరీష్‌రావు. 


బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోపై రోజూ ఎదో ఒక హింట్‌ ఇస్తూ... హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు మంత్రి హరీష్‌రావు. నిన్న కూడా మేనిఫెస్టో గురించి మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో  మహిళలకు ప్రత్యేక హామీలు ఉంటాయని చెప్పారాయన. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్‌.. మంచి పథకాలు ప్రకటించబోతున్నారని కూడా  చెప్పారు. మేనిఫెస్టోలో మహిళల కోసం శుభవార్త ఉందంటూ ఊరించారు. హరీష్‌రావు టీజర్లతో... బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోపై ప్రజల్లో ఆసక్తి పెరిగిపోతోంది. మేనిఫెస్టోలో అంతలా  ఏమేమి హామీలు ఉండబోతున్నాయో అని... ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఈనెల 16న వరంగల్‌ సభలో సీఎం కేసీఆర్‌ ప్రకటించబోయే మేనిఫెస్టోలో ఏయే హామీలు ఉండనున్నాయి..? మహిళలకు ప్రత్యేక స్కీమ్‌లు పెట్టబోతున్నా..? కాంగ్రెస్‌ ఆరు  గ్యారెంటీలకు మించిన పథకాలు ఉండబోతున్నాయా? నిపుణులతో చర్చించి మరీ సీఎం కేసీఆర్‌ మేనిఫెస్టో రూపొందిస్తున్నారని వార్తలు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో నిజంగా  బ్లాక్‌ బాస్టర్‌ కానుందా..? వీటికి వరంగల్‌ సభలో సమాధానాలు దొరుకుతాయంటున్నారు మంత్రి హరీష్‌రావు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి బాట  పయనిస్తోంది... వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై కూడా విమర్శలు గుప్పించారు మంత్రి హరీష్‌రావు. తెలంగాణలో ఓటర్లకు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనాలని కాంగ్రెస్‌ పార్టీ  ప్రయత్నిస్తోందని ఆరోపించారాయన. అంతేకాదు... ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి జైలు వెళ్లడం ఖాయమన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని చెప్పారు. ఈ కేసులో  విచారణ జరపాల్సిందేనని సుప్రీంకోర్టు కూడా చెప్పిందన్నారు మంత్రి హరీష్‌రావు.