Botsa Comments :  రైల్వే జోన్ ను ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా అవసరమైన  స్థలం ఇవ్వలేదన్న   కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపణలను బొత్స సత్యనారాయణ ఖండించారు. రైల్వే జోన్ కోసం 52 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అడ్డంకులు అన్నీ తొలగించి రైల్వే జోన్ కోసం భూములు అప్పగించామన్నారు. మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని  బొత్స పీయూష్ గోయల్‌కు సూచించారు. మాట్లాడే ప్రతీ మాటకు నిబద్దత ఉండాలన్నారు.  పియుష్ గోయల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఇకపై మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని  పీయూష్ గోయల్ కు సలహా ఇచ్చారు. 


2014లో  కూటమిలో బీజేపీ కూడా ఉందని అప్పుడు రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేదని బొత్స ప్రశ్నించారు.  2014-19 మధ్య కేంద్రంలో ఉంది సింగిల్‌ ఇంజిన్‌ ప్రభుత్వమా అని ప్రశ్నించారు. మధ్యలో ఒక ఇంజిన్‌ పని చేసిందా మరో ఇంజిన్‌ రిపేర్‌ అయ్యిందా అని సెటైర్లు వేశారు.  పియూష్‌ గోయల్‌ ఏది పడితే అది మాట్లాడుతున్నారని అది కరెక్ట్ కాదన్నారు.  విద్యాశాఖపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలన్నారు.   నిజం లేదు గనుకే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు అని బొత్స అన్నారు.   రాష్ట్రంలో ఏ ఒక్క అధ్యాపకుడు అయినా విద్యాశాఖ మంత్రిగా ఉన్న నాపై వేలు ఎత్తి చూపించ లేడని  విద్యాశాఖ లో అవినీతి జరిగిందని చెప్పగలరా అని సవాల్ చేశారు.  


కేంద్రంలో మాపై ఆధారపడే పార్టీ రావాలని కోరుకుంటున్నామన్నారు.  అలా వస్తే రాష్ట్రానికి రావాల్సిన ఇంకా కొన్ని ప్రయోజనాలు కోసం మాట్లాడవచ్చన్నారు.   ప్రస్తుతం మనం అడిగితే పనులు అయ్యే పరిస్థితి కేంద్రంలో లేదన్నారు.   కేంద్రం అన్నీ రాజకీయ కోణంలో ఆలోచిస్తుంది. అందుకే మనపై ఆధారపడే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్సార్‌సీపీ పని చేస్తుందని..  మేలు జరిగే ప్రతీ అంశానికి మద్దతు ఇస్తామన్నారు.   ఏది చేసినా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. 


పీయూష్ గోయల్ ఏమన్నారంటే ?                            


ఏపీ  అభివృద్ధికి ఎన్నో సహజ వనరులు ఉన్నాయని, ఈ ఐదేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోలేదని పీయూష్ గోయల్ విమర్శించారు.  కార్మికులు, రైతులు, యువతను అసలు పట్టించుకోలేదన్నారు.  సీఎం జగన్  స్వార్ధ ప్రయోజనాలే చూసుకున్నారని, శాండ్  , ల్యాండ్ , లిక్కర్   మాఫియాలతో  కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.  కేంద్రం ఇచ్చిన వేల‌ కోట్ల నిధులు జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని, అనేక ప్రాజెక్టులలో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ఇస్తామని విభజన చట్టంలో పెట్టారని, కానీ రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూములు జగన్ ప్రభుత్వం కేటాయించలేకపోయిందని ఎద్దేవా చేశారు. పంచాయతీలకు కేటాయించిన నిధులు దుర్వినియోగం చేశారన్నారు. గ్రామాల అభివృద్ధి లేకుండా జగన్ సొంత అవసరాలకు డబ్బులు వినియోగించారని, ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డని తీవ్రస్థాయిలో విమర్శించారు.