కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ రూపంలో పుస్తెలు కట్టడానికి 2 వేల కోట్లు ఇచ్చి... పుస్తెలు తెంచి 45 వేల కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. భూలోకంలో నరకాన్ని అనుభవించి వచ్చిన వాడినన్నారు. కెసిఆర్ అనే యమధర్మ రాజు తనకు 6 నెలల నరకం అనే శిక్ష వేశాడని... 6 నెలలు కొట్లాడి.. ప్రజల ఆశీర్వాదంతో బయటపడ్డానన్నారు.
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం అడవితుమ్మలపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్... టీఆర్‌ఎస్, కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రచారంలో భాగంగా పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. సర్పంచ్‌ల పరిస్థితి సుంకరి వాళ్ళకంటే హీనంగా తయారైందన్నారు ఈటల. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో చాలా మంది ప్రజలకు పింఛన్లు వచ్చాయన్ని తెలిపారు. కొందరికి గొర్రెలు వచ్చాయన్నారు. 4 ఏళ్ల కింద డిడి కట్టిన వారికి కూడా రాని గొర్రెలు ఇప్పుడు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
గత ఎన్నికల్లో కేసీఆర్ హామీ ఇచ్చినట్టు 3116 నిరుద్యోగ భృతి ఒక్కరికీ ఇవ్వలేదన్నారు ఈటల. లక్ష రూపాయల లోపు రుణం ఏకకాలంలో మాఫీ అని మోసం చేశారన్నారు. బ్యాంక్‌ల దృష్టిలో రైతులు దొంగలుగా చేసిన ఘనత కెసిఆర్‌కే దక్కిందన్నారు.
ఉపఎన్నికలు అయిపోయిన తర్వాత కేసీఆర్ దొరకరని... ఇప్పుడే అన్ని పనులు చేయించుకోవాలన్నారు ఈటల. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎటుపాయే అని నిలదీశారు. అర్హులందరికీ 5 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలని లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నట్టు వెల్లడించారు.
రైతు బంధు, పెన్షన్, కళ్యాణలక్ష్మి అన్నీ కలిపితే 26 వేలకోట్లు అవుతాయన్నారు ఈటల. కానీ మందుపోసి కేసీఆర్ వసూలు చేస్తున్న డబ్బు 45 వేల కోట్లని లెక్క చెప్పారు. జనాలు మద్యం తాగి తాగి బానిసలు అవుతున్నారన్నారు. భార్య కూలికి పోయి సంపాదించుకొని వచ్చిన డబ్బులు కూడా లాక్కొని తాగుతున్న వారు అన్నీ ఊర్లలో ఉన్నారన్నారు. కెసిఆర్ సంపద వెనుక తెగిన కళ్యాణ లక్ష్మీ పెళ్లి కూతుళ్ల తాళిబొట్లు ఉన్నాయన్నారు. పుస్తెలు కట్టడానికి 2 వేల కోట్లు ఇచ్చి.. పుస్తెలు తెంచి 45 వేల కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నారన్నారు.
హుజూరాబాద్‌లో 6 వేల రూపాయలు ఒక్కో ఓటుకు ఇచ్చారన్నారు. మునుగోడులో కూడా మీ పాత అప్పులు అన్నీ పోతాయని... నెల రోజుల పాటు దావత్ ఉంటుందన్నారు ఈటల. కెసిఆర్ బానిసలు చెప్పే దొంగ మాటలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. బీజేపీని గెలిపించండని పిలుపునిచ్చారు.