Balakrishna will campaign extensively in Rayalaseema districts : స్వర్ణాంధ్ర_సాకార_యాత్ర పేరుతో బస్సు యాత్ర నిర్వహించనున్నారు బాలకృష్ణ. ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాలలో పర్యటనలు కొనసాగుతాయి. కదిరిలో శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి యాత్రను ప్రారంభిస్తారు. బస్సు యాత్ర ఏప్రిల్ కదిరి , పుట్టపర్తి, అనంతపురం నియోజకవర్గాల్లో జరగనుంది. ఏప్రిల్13న శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో, ఏప్రిల్14న బనగానపల్లె, ఆళ్లగడ్డ ,నంద్యాల నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. ఏప్రిల్15న పాణ్యం, నందికొట్కూరు, కర్నూలు , ఏప్రిల్16నకోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో బాలకృష్ణ పర్యటించనున్నారు. ఈనెల 17న పత్తికొండ, ఆలూరు ,రాయదుర్గ్ ప్రాంతాల్లనూ పర్యటిస్తారు.
మూడోసారి హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు బాలకృష్ణ. 1985 నుంచి ఎన్టీఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి హ్యాట్రిక్ ఖాయమని బాలకృష్ణ అంచనా వేసుకుంటున్నారు. బాలకృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈ నెల 25 నుంచి ఉత్తరాంధ్రలో చేపట్టనున్న ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. 19వ తేదీన హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు.
హిందూపురంలో బాలకృష్ణను ఓడించడానికి ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఆయన హిందూపురంలో వైసీపీని గెలిపించడాన్ని సవాల్ గా తీసుకున్నారు. టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉన్న హిందూపురం పట్టణం, చిలమత్తూరు మండలాల్లో టీడీపీ నేతల్ని చేర్చుకుంటున్నారు. హిందూపురం నియోజకవర్గంటీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఓటమన్నది లేకుండా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొంది అసెంబ్లీకి వెళ్లారు. టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు హిందూపురం నుంచి పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన తర్వాత నందమూరి హరికృష్ణ కూడా ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ రెండు సార్లు గెలిచారు. బాలకృష్ణ కూటమికి స్టార్ క్యాంపెయినర్ కావడంతో మూడు పార్టీల తరపున ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి.
రెండు విడతలుగా ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వందల కోట్లతో హిందూపురంలో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రజల స్వప్నం అయిన నీటి సమస్యను కూడా పరిష్కరించారు. తర్వాత టీడీపీ ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కరోనా సమయంలో ఆస్పత్రులకు ప్రత్యేకైన ఎక్విప్ మెంట్ సొంత డబ్బులతో ఇప్పించారు. షూటింగ్‌ల కారణంగా ఎక్కువగా హిందూపురంలో ఉండనప్పటికీ ఆయన.. క్యాడర్ కు దగ్గరగాఉంటారు. ఎవరి ఇంట్లో శుభకార్యం ఉన్నా హాజరవుతారు. ఆయన అందుబాటులో ఉండరని విమర్శలు చేస్తున్నప్పటికీ.. ప్రజలు ఆయన వైపు మొగ్గుచూపడానికి కారణం.. సమస్యలపై స్పందించడమేనని అంటున్నారు. బాలకృష్ణ స్టార్ క్యాంపెయినర్ కావడంతో తన నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేయనున్నారు.