Ys Sharmila Letter To CM Jagan: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ రసవత్తరంగా మారింది. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (Ys Sharmila) సీఎం జగన్ కు (Cm Jagan) వరుస లేఖలు రాస్తున్నారు. 'నవ సందేహాల' పేరుతో ఇప్పటికే ఆమె రెండు లేఖల్లో పలు ప్రశ్నలు సంధించారు. తాజాగా, శనివారం షర్మిల ఆయనకు మరో లేఖ రాశారు. ఈసారి మద్య నిషేధంపై ఆమె ప్రశ్నలు అడిగారు.
తాజా లేఖలో ప్రశ్నలివే..
'1. మీరు ప్రకటన చేసినట్లు మద్య నిషేధం హామీ ఎక్కడ.?, పాక్షికంగా అయినా అమలు అవుతుందా.?
2. మూడు దశల్లో మద్య నిషేధం అన్నారు. నిషేధం అమలు చేశాకే మళ్లీ ఓటు అడుగుతా అన్నారు.? ఏమైంది.?
3. మద్యం అమ్మకాల్లో రూ.20 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్లకు ఆదాయం పెంచుకున్నారు. అంటే అమ్మకాల్లో అభివృద్ధి చెందినట్లు కాదా.?
4. మద్యం ద్వారా ఆదాయం అంటే... ప్రజల రక్త మాంసాలు మీద వ్యాపారం అన్నారు. మీరు చేస్తున్నది ఏంటి.?
5. ఎక్కడా దొరకని బ్రాండ్లు, కనీ వినీ ఎరుగని బ్రాండ్లు ఇక్కడే అమ్ముతూ ప్రజల ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారు.?
6. బెవరేజేస్ కార్పొరేషన్ ను చేయూత, ఆసరా, అమ్మఒడి అమలు బాధ్యత అప్పగించడాన్ని ఎలా సమర్ధిస్తారు.?
7. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ.11 వేల కోట్ల రుణాలు ఎందుకు సేకరించాలని అనుకున్నారు.?
8. డ్రగ్స్ పట్టుబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఎందుకు ఉంది.?
9. రాష్ట్రంలో 20.19 లక్షల మంది డ్రగ్స్ కు అలవాటు పడ్డారంటే మీ వైఫల్యం కాదా.?' అని లేఖలో ప్రశ్నించారు.
'హామీలన్నీ కొట్టుకుపోయాయి'
కడపలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమని షర్మిల విమర్శించారు. కడపలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే హామీలన్నీ గాలికి కొట్టుకుపోయాయని మండిపడ్డారు. వైసీపీ ముఖ్యులంతా ఓ ముఠాగా తయారయ్యారని.. రాష్ట్రానికి హోదా లేదని, రాజధాని లేదని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా బీజేపీపైనా విమర్శలు గుప్పించారు. 'బీజేపీ అధికారంలోకి వస్తే 4 శాతం రిజర్వేషన్లు మాయం. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసే బీజేపీకి ఓటు వేద్దామా ?. రాష్ట్రంలో జగన్ కి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లే. BJP అంటే బాబు, జగన్, పవన్. మన రాష్ట్రంలో BJP వీళ్ల ముగ్గురిలోనే ఉంది. ప్రతి బిల్లుకు జగన్, చంద్రబాబు మద్దతు తెలిపారు. బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ముస్లింలకు భద్రత ఉండదు.' అని షర్మిల వ్యాఖ్యానించారు.
గత లేఖల్లో ఏం అడిగారంటే.?
ఇటీవల కూడా షర్మిల.. సీఎం జగన్ కు నవ సందేహాల పేరుతో 2 లేఖలు రాశారు. వాటిల్లో పలు ప్రశ్నలు సంధించారు. తొలి లేఖలో 'ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన విషయం వాస్తవం కాదా?, సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపేశారు?, 28 పథకాలను అర్ధంతరంగా ఎందుకు ఆపివేశారు.?, ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం రాష్ట్రంలో ఎందుకు నిలిచిపోయింది?, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం పెట్టిన విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు?, దళిత, గిరిజన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారు?, SC, STలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి. ఇది మీ వివక్ష కాదా?, దళిత డ్రైవర్ ను చంపి సూట్ కేసులో డోర్ డెలివరి చేసిన MLCని ఎందుకు సమర్థిస్తున్నారు?, స్టడీ సర్కిల్స్ కి నిధులు ఇవ్వకుండా వాటిని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు?.' అంటూ ప్రశ్నలు సంధించారు.
రెండో లేఖలో..
'1. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.. ఏమైంది.?
2. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎందుకు ఇవ్వలేదు.?
3. గ్రూప్ - 2 కింద ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు భర్తీ చేయలేదు?
4. 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఏం చేశారు.?
5. వర్శిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదు.?
6. 23 వేలతో మెగా డీఎస్సీ అని 6 వేలతో దగా డీఎస్సీ ఎందుకు వేశారు.?
7. నిరుద్యోగులు 7.7 శాతం పెరిగారంటే మీ వైఫల్యం కాదా.?
8. యువత ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు ఎందుకు పోతున్నారు.?
9. ప్రస్తుతం జాబ్ రావాలంటే మీ పాలన పోవాలి అని అంగీకరిస్తారా.?' అని షర్మిల.. సీఎం జగన్ ను ప్రశ్నాస్త్రాలు సంధించారు.
Also Read: Telugu News: సూరీడు ప్రచారానికి పార్టీలకు చెమటలు- శాంతించాలని వేడుకుంటున్న నేతలు