పశ్చిమ రాయలసీమలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ వీడటం లేదు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు అనంతపురం జిల్లా జెఎన్టీయూలో కొనసాుతోంది. ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లు సంఖ్య 3,33,184 ఉంటే... 2,45,687 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ బాక్స్ లో పడిన ఓట్లలో 2,26,448 మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. 19,239 ఓట్లు చెల్లకుండా పోయాయి.
పశ్చిమ రాయలసీమలో నమోదైన ఓట్ల ప్రకారం... అభ్యర్థి ఎవరైనా గెలవాలంటే మాత్రం 1,13,225 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ రావాలి. 48 గంటలుగా ఓట్లు లెక్కిస్తున్న అధికారులు మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లపై ఆధార పడాల్సి వచ్చింది. దీని ప్రకారం రెండు ప్రయార్టీలో వైసీపీ అభ్యర్థి 17256 ఓట్లు వస్తే విజయం సాధిస్తారు... అదే టైంలో టిడిపికి అభ్యర్థి రాంభూపాల్ రెడ్డికి 19076 ఓట్లు వస్తే విజయం సాధిస్తారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు నడుస్తంది.
మొదటి ప్రయారిటీ ఓట్ల లెక్కింపుల్లో ఏ అభ్యర్థికి స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో రెండో ప్రయారిటీ ఓట్లు లెక్కింపు ప్రక్రియ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ప్రారంబించారు. ఉదయం 6 గంటల నుంచి రెండు ప్రయారిటీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అప్పటి నుంచి అందరూ తీవ్ర ఉత్కంఠగా ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
పశ్చమ రాయలసీమ అంటే కడప - అనంతపురము - కర్నూలు జిల్లాల్లోని పట్టభద్రులంతా ఈ ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ విజయంతో ఇక్కడి ప్రజల నాడి తెలుస్తుందని పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఈ ఎన్నికలపై అందరి ఫోకస్ ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల పరిశీలకులు ఐఏఎస్ అధికారు భాస్కర్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పర్యవేక్షిస్తున్నారు.
ఇప్పటికే తెలుగుదేశం రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో జయకేతనం ఎగరేసింది. ఆ పార్టీ అభ్యర్థులు చిరంజీవి, శ్రీకాంత్ బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పుడు పశ్చిమ రాయలసీమలో ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తుంది.
గెలిచిన టీడీపీ అభ్యర్థల మొదటి రియాక్షన్ ఇదే!
ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు నియోజకవర్గ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ... తన విజయాన్ని లోకేష్‌కు అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. తనను అభ్యర్థగా నిలబెట్టిన చంద్రబాబుకు, తన విజయానికి శ్రమించిన కార్యకర్తలకు పాదభివందనం చేశారు. పట్టభద్రులు తమ అసంతృప్తిని ఓట్ల రూపంలో చూపించారని అన్నారు. టీడీపీ జైత్రయాత్ర ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో ప్రారంభమైందని అభిప్రాయపడ్డారు. సైకిల్ వేగానికి ఫ్యాన్ తట్టుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని అక్రమాలకు పాల్పడిన అధికార పార్టీ విజయం సాధించలేకపోయిందని ప్రజలు తమవైపు ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ జెండా ఎగురుతుందన్నారు.
తన దగ్గర చదువుకున్న విద్యార్థులు, వారి తల్లి తండ్రులు తనను గెలిపించారు అన్నారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన వేపాడ చిరంజీవి. తన సేవలు నచ్చడం. వారు తనపై విశ్వాసం ఉంచడం వల్లే తాను గెలిచినట్లు చెప్పిన వేపాడ ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్లు ఈ ఎన్నిక తో రుజువైంది అన్నారు.