Ap Ceo Key Orders On Self Help Groups: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena).. డ్వాక్రా గ్రూపులకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున డ్వాక్రా బృందాలను ప్రభావితం చేసేలా ఎలాంటి నిర్ణయాలు వద్దని, కార్యక్రమాలు చేపట్టవద్దని అన్నారు. ఈ మేరకు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలకు ఆదేశాలిచ్చారు. సంబంధిత అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది స్వయం సహాయక బృందాలను (Self Help Groups) ప్రభావితం చేసేలా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొద్దని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా కానీ, బృందాలుగా కానీ ఎస్ హెచ్ జీలను రాజకీయంగా ప్రభావితం చేసే నిర్ణయాలు వద్దన్నారు. అవగాహన పేరుతో సమావేశాల నిర్వహణ, సర్వే తదితర కార్యక్రమాలు నిర్వహించకూడదని సెర్ప్ సీఈవో, మెప్మా మిషన్ డైరెక్టర్లకు ఉత్తర్వులు ఇచ్చారు.


ఉన్నతాధికారిపై బదిలీ వేటు


మరోవైపు, సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్రంలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు పడింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను తక్షణం విధుల నుంచి తొలగించాలని, ఎన్నికల విధులు అప్పగించొద్దని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయంగా ముగ్గురు ఐఏఎస్ ల పేర్లతో జాబితా ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.


మద్యం ఉత్పత్తి, విక్రయాల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి వాసుదేవరెడ్డిపై ఈసీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మద్యం ఉత్పత్తి దగ్గర నుంచి సరఫరా, అమ్మకం వరకూ ప్రతీది ప్రభుత్వ గుప్పిట్లో ఉంది. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులకు మద్యం దొరక్కుండా చేసి..  అధికార పార్టీకి మాత్రమే అందేలా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీకి వచ్చిన ఎన్నికల పరిశీలకులు మద్యం విషయంలో పలు వివరాలు సేకరించారు. ముందస్తుగా రాష్ట్రంలోని మద్యం దుకాణాలపై ఈసీ ఆంక్షలు విధించింది. గతేడాది ఇదే నెల విక్రయాల గణాంకాల ఆధారంగా ప్రభుత్వ రిటైల్ దుకాణాలు విక్రయించే మద్యంపై ఎన్నికల సంఘం పరిమితులు విధించింది. ఎన్నికల సమయంలో పారదర్శకంగా ఉండేలా మద్యం నిల్వల తొలగింపు, విక్రయాలపై రోజు వారీ నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించి వివిధ పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తుండడంతో ఎన్నికల్లో అవకతవకలు జరగకుండా మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు. 


టీడీపీ నేతల ఆరోపణలు


కాగా, ఎన్నికల కోడ్ రాక ముందు నుంచీ ఏపీలో మద్యం పాలసీపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వాసుదేవరెడ్డి డిప్యుటేషన్ పై ఏపీలో పని చేయడానికి వచ్చారు. నాలుగేళ్లుగా ఆయన బేవరేజెస్ కార్పొరేషన్ లో ఉన్నారు. రాష్ట్రంలో మద్యం బ్రాండ్ల వెనుక ఆయన ఉన్నారని టీడీపీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అటు, బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ తీరుపై ఇటీవల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం ఈసీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించినట్లు తెలుస్తోంది. మరోవైపు, వైసీపీకి అనుకూలంగా ఉండే అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు సీఈసీని కలిసి విజ్ఞప్తి చేశారు.


Also Read: CM Revanth Reddy: గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన