Cm Revanth Reddy Announced Gulf Special Board: గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) తెలిపారు. గల్ఫ్ ఏజెంట్లకు చట్టబద్ధత ఉండేలా చర్యలు తీసుకుంటామని.. తెలంగాణ గల్ఫ్, ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫెర్ బోర్డు పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో మంగళవారం గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలను వారు సీఎం రేవంత్ దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ ఉపాధిపై ఆధారపడి ఉన్నాయని.. కార్మికుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, గల్ఫ్ ఎన్ఆర్ఐ కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు.


'రూ.5 లక్షల ఆర్థిక సాయం'


'గల్ఫ్ కార్మికుల సహాయార్థం ప్రజా భవన్ లో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తాం. సీనియర్ ఐఏఎస్ నేతృత్వంలో ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తాం. ఉపాధి కోసం వెళ్లిన వారి వేతనాలు, బాగోగులు కూడా చూసుకోవాలి. ఓవర్సీస్ కార్మికుల కోసం పిలిప్పీన్స్, కేరళలో మంచి విధానం అమల్లో ఉంది. కొన్ని దేశాలు, ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నాం. పూర్తి స్థాయి అధ్యయనం తర్వాత సమగ్ర విధానం రూపొందిస్తాం. రైతు బీమా తరహాలోనే గల్ఫ్ కార్మికులకు బీమా అందిస్తాం. గల్ఫ్ కార్మికుల ప్రమాద బీమా రూ.5 లక్షలు ఇస్తాం. జూన్, జులైలో పాలసీ డాక్యుమెంట్ విడుదల చేస్తాం. ' అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.


సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు


ఈ క్రమంలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. '2018లో నేను ఓడిపోయాను కాబట్టే 2019లో ఎంపీ అయ్యాను. ఆ తర్వాత 2023లో తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యాను. అలాగే, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయారు కాబట్టి.. 2024లో కేంద్ర మంత్రి అవుతారని అన్నారు. ఇక, తాను ఎమ్మెల్యేగా ఓడిపోతే కొందరు బాధ పడ్డారని.. తన శత్రువులు సంతోష పడ్డారని పేర్కొన్నారు.


Also Read: KCR House: కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్ర పూజలు, అర్ధరాత్రే జరిగినట్లు అనుమానాలు!