BJP Vishnu In Varanasi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోటీ చేస్తున్న వారణాశి నియోజవకర్గంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నారు. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఈ ప్రచారంలో కీలక  పాత్ర పోషిస్తున్నారు. వారణాశి నియోజకవర్గం అంటే మినీ ఇండియా. అక్కడ అన్ని రాష్ట్రాలకు చెందిన వారు నివసిస్తూ ఉంటారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు కొన్నివేల మంది   ప్రజలు, స్థానికంగా నివాసం ఏర్పరచుకున్న భక్తులు పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అక్కడే స్థిరపడిపోయారు. వీరంతా అక్కడి ఓటర్లుగా ఉన్నారు. 


వారణాశి మోదీ ప్రచార బృందంలో సభ్యునిగా విష్ణువర్ధన్ రెడ్డి                           


వారణాశి నియోజకవర్గం  ప్రధాని మోదీ పోటీ చేస్తున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగానూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాని మోదీకి గత ఎన్నికల్లో అక్కడి  ప్రజలు ఐదు లక్షల ఓట్ల మెజార్టీ ఇచ్చారు. ఈ సారి మరింత ఎక్కువ మెజార్టీ సాధించే అవకాశాలు ఉన్నాయి. దక్షిణాది నుంచి వారణాశిలో ఎన్నికల  ప్రచారం చేసేందుకు ప్రచార బృందంలో సభ్యుడిగా  ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. మోదీ నామినేషన్ కార్యక్రమం నుంచి చురుకుగా ప్రచార బృందం వారణాశిలో పర్యటిస్తోంది.


తెలుగు ప్రజలతో విస్తృతంగా సమావేశాలు                                      


ఏపీ తెలంగాణకు చెందిన ప్రజలను విష్ణువర్ధన్  రెడ్డి కలుస్తున్నారు. తెలుగు కమ్యూనిటీతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రజలతోనూ  ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. అందర్నీ ఓటు వేసేలా మోటివేట్  చేస్తున్నారు. వారణాశి ప్రజల్లో 70శాతం మంది బీజేపీకే ఓటు వేస్తారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు అథ్యాత్మిక కార్యక్రమాలకే ఎక్కువ పరిమితం అవుతారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపరు. ఇలాంటి వారినందర్నీ మోటివేట్ చేసి అత్యధిక పోలింగ్ నమోదయ్యేలా చూసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అత్యధిక పోలింగ్ నమోదైతే మోదీకి రికార్డు స్థాయి మెజార్టీ లభించే అవకాశం ఉంది.


బయట రాష్ట్రాల్లోనూ పలుమార్లు ప్రచార బాధ్యతలు తీసుకున్న విష్ణు                                     


ఏపీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్న  నియోజకవర్గాల్లో సీనియర్ నేతలంతా విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డికి హైకమాండ్ హెలికాఫ్టర్ సౌకర్యం కూడా కల్పించింది. ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత వారణాశిలో ప్రచారానికి  శ్రీకారం చుట్టారు. దేశంలో సీనియర్ నేతలు ప్రచారం చేస్తున్న నియోజకవర్గాల్లో.. ఇతర ఎన్నికల సమయంలోనూ విష్ణువర్ధన్ రెడ్డికి  బీజేపీ హైకమాండ్ కీలక  బాధ్యతలు అప్పగిస్తూ ఉంటుంది. కర్ణాటక ఎన్నికల సమయంలోనూ ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు.