AP Assembly Election 2024 Voting live updates: కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత- బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి
Ap Assembly Elections 2024: రాష్ట్రంలో ఓట్ల పండుగకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం ఉదయం మాక్ పోలింగ్ అనంతరం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
కడప జిల్లా జమ్మలమడుగు లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ ప్రశాంతంగా ముగుస్తున్న సమయంలో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పట్టణ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో పోలింగ్ బూత్ 116, 117 లో బిజెపి, వైసిపి వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తలకు గాయం అయినట్లు సమాచారం. మరోవైపు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి వాహన అద్దాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. జమ్మలమడుగు టిడిపి ఆఫీస్ వద్దకు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఆదినారాయణ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని పలువురు ముఖ్య నేతలను దేవగుడి గ్రామానికి తరలించారు పోలీసులు.
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు లోక్ సభ స్థానాలకు నేడు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసిన తరువాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అభ్యర్థి నారా లోకేష్ ఏపీ ఎన్నికలపై స్పందించారు. రాష్ట్రంలో ప్రజాతీర్పును తారుమారు చేసేందుకు వైఎస్సార్ సీపీ చేసిన అన్ని ప్రయత్నాలను తిప్పికొడుతూ పోలింగ్ కేంద్రాలవద్ద ఓట్లతో తిరుగుబాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అభినందనలు అని ట్వీట్ చేశారు.
ఏపీలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పలుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 6 గంటల వరకూ 75 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 74 శాతం నమోదు కాగా.. అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 55 శాతం ఓటింగ్ నమోదైంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూలైన్లలో ఓటు వేసేందుకు నిల్చున్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు, సమస్యాత్మక ప్రాంతాల్లో 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియగా.. మిగిలిన నియోజకవర్గాల్లో 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. 6 గంటల్లోపు క్యూలైన్లలో ఉన్న వారిని ఓటు వేసేందుకు ఎన్నికల సిబ్బంది అనుమతిస్తున్నారు. గత ఎన్నికల్లో 79.08 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి పోలింగ్ పెరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. చివరి గంటల్లో పోలింగ్ ఊపందుకుంది.
విజయవాడలోని పోరంకి పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొనగా.. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. టీడీపీ తీరుపై వైసీపీ అభ్యర్థి జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు దిగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలం బీరంగుంటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీకి ఏకపక్షంగా ఓట్లు పడుతున్నాయనే అనుమానంతో ఏఎంసీ మాజీ ఛైర్మన్ సుకుమార్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. అనుచరులతో వచ్చిన ఆయన.. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడికి దిగారు.
ఏపీలో పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. నరసరావుపేట పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ శ్రేణులు హల్చల్ చేశారు. ఓటర్లపై దాడికి యత్నించగా.. వారు భయాందోళనకు గురై పరుగులు తీశారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించగా.. టీడీపీ నేతలు తిప్పికొట్టారు.
ఏపీలో పోలింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఏపీలో చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. సాయంత్రం 4 గంటలకు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాల్లో పోలింగ్ ముగియగా.. పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నియోజకవర్గాల్లో క్యూలైన్లలో నిల్చున్న వారిని ఓటు వేసేందుకు సిబ్బంది అనుమతి ఇస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ సాగనుంది. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు సీఈవో ముకేష్ కుమార్ మీనా పర్యవేక్షిస్తున్నారు.
పెనమలూరు మండలం పోరంకిలోని నిడమానూరు రోడ్డు హైస్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రంలో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు దాడికి దిగారు. వైసీపీ అభ్యర్థి జోగి రమేశ్ తన అనుచరులతో వచ్చి దాడి చేశారని ఆరోపించారు. అనంతరం వైసీపీ వర్గీయులు టీడీపీ వర్గీయుల ఇళ్ల ముందు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని.. ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పరిధి పల్లపాడులో పోలింగ్ బూత్ 152లో పోలింగ్ నత్తనడకన సాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. పోలింగ్ అధికారి నిదానంగా విధులు నిర్వర్తిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగించాలని ఈసీని కోరుతున్నారు.
కాకినాడలో టీడీపీ - వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ ఇరువర్గాల నేతలు పరస్పరం దాడి చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి చక్కదిద్దారు.
పల్నాడు జిల్లా దొడ్లేరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరగ్గా గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అదనపు బలగాలు రప్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఏపీలో చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. చివరి గంటల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగేలా ఈసీ ఫోకస్ పెట్టింది. పోలింగ్ బూత్ ల ఆక్రమణ, తగాదాలకు తావు లేకుండా చూడాలని పోలీసులకు ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.
ఏపీలో పల్నాడు, తెనాలి, మాచర్ల, అనంతపురం ప్రాంతాల్లో ఘర్షణలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. నిందితులను గృహ నిర్బంధం చేయడం సహా కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. పుంగనూరులో నిందితులను వదిలేసిన ఎస్సైను సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
ప్రకాశం జిల్లా దర్శిలోని మండల పరిషత్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ నిలిచిపోగా.. సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్శి డీఎస్పీ పోలింగ్ కేంద్రానికి వెళ్లి పరిశీలించారు. టీడీపీ కౌన్సిలర్ ఈవీఎం ధ్వంసం చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
ఏపీలో పలుచోట్ల జరిగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ నేత కనకమేడల ఈ లేఖను ఈసీకి అందజేశారు. మరో 11 ఫిర్యాదులూ ఎన్నికల సంఘానికి ఇచ్చారు. రాష్ట్రంలో 120కి పైగా హింసాత్మక ఘటనలు జరిగాయని.. అన్ని చోట్లా వైసీపీ నేతలు హింసకు పాల్పడ్డారని ఫిర్యాదు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బ్రాహ్మణకాలువ గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. వీరిని అదుపు చేసే ప్రయత్నంలో సీఆర్పీఎఫ్ బలగాలు గాల్లోకి కాల్పులు జరిపారు. అటు, తిరుపతిలోని 13వ వార్డులో 141, 142, 143 బూత్ ల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని టీడీపీ, జనసేన నేతలు వారిని అడ్డుకున్నారు. దీంతో వివాదం నెలకొంది. కత్తులతో తమను బెదిరించారని కూటమి నేతలు ఆరోపించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపీలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. అయితే, జోరు వానలోనూ పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. పాడేరులో భారీ వర్షం కురుస్తుండగా.. విద్యుత్ సరఫరాను నిలిపేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద చీకట్లోనే ఓటింగ్ కొనసాగుతోంది. అటు, తెనాలిలోనూ భారీ వర్షంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షంలోనూ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసేందుకు తరలివస్తున్నారు. బాపట్ల జిల్లా పర్చూరులోనూ వర్షంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఏపీలో 3 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. అయితే, సాయంత్రం 4 గంటల్లోపు క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు ఎన్నికల సిబ్బంది అవకాశం కల్పిస్తారు. వీటిని అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా ఎన్నికల సంఘం గుర్తించింది.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టేందుకు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు.
ఏపీలో కొన్నిచోట్ల చెదురుమదురు ఘర్షణల మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 55 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి నెలకొంది. వృద్ధులు, మహిళలు అంతా ఓటింగ్ లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దొంగఓట్లు కలకలం సృష్టించాయి. విద్యానగర్ లో దొంగ ఓట్లు వేస్తున్నారని.. మంత్రి రజినికి ఏజెంట్ సమాచారం ఇవ్వగా.. ఆమె పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రం బయట అధికంగా ఉన్న కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ నిలిచిపోయింది. పోలింగ్ అధికారి టీడీపీకి సహకరిస్తున్నారని.. వృద్ధుల ఓట్లు వైసీపీకి బదులుగా టీడీపీకి వేయిస్తున్నారని ఏజెంట్ ఆరోపించారు. దీంతో ఓటర్లు ఆందోళనకు దిగగా.. పీవోని పోలీసులు విచారిస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో ఓట్లు వేసేందుకు వెళ్తున్న వారి బొలెరో జీపు కుడియా గ్రామం వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలు కాగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మండలంలోని పెద్దకోట పంచాయతీలో పోలింగ్ బూత్ నెంబర్ 295లో ఓట్లు వేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
గుంటూరు జిల్లా తెనాలి వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ పై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. పోలింగ్ పూర్తయ్యేవరకూ శివకుమార్ ను గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా, పోలింగ్ కేంద్రంలో ఆయన ఓ ఓటరుపై చేయి చేసుకున్న ఘటనలో సదరు ఓటరు ఆయన్ను తిరిగి చెంపపై కొట్టాడు. ఈ క్రమంలో ఓటరుపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు.
తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య ఘర్షణ నెలకొంది. చిల్లకూరు జిల్లా పరిషత్ పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ అభ్యర్థి మురళి, టీడీపీ అభ్యర్థి సునీల్ మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటు చేసుకున్నాయి. పోలింగ్ కేంద్రం వద్దకు ఇరుపార్టీల శ్రేణులు భారీగా చేరుకోగా.. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలకు సద్దిచెప్పారు.
కోనసీమ జిల్లా కాట్రోనికోన మండలం పల్లంలో వైసీపీ, టీడీపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకోగా.. పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారగా.. పోలీస్ బలగాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నిస్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోకర్ణపల్లిలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. అటు, ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని కుద్దిరాంలో జరిగిన ఘర్షణలో టీడీపీ కార్యకర్త తలకు తీవ్ర గాయమైంది. అలాగే, మన్యం జిల్లా పాలకొండ వైసీపీ అభ్యర్థి కళావతి.. భాసూరు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు యత్నించగా ఓటర్లు అడ్డుకున్నారు. దీంతో ఆమె వెనుదిరిగారు.
ఏపీలో భారీగా ఓటింగ్ నమోదవుతోంది. కొన్ని చోట్ల ఉద్రిక్తతల మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ 40.26 శాతం మేర పోలింగ్ నమోదు కాగా.. 1.70 కోట్ల మంది ఓటర్లు ఇప్పటివరకూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా కడప జిల్లాలో 45.5 శాతం నమోదు కాగా.. ఆ తర్వాత స్థానాల్లో కృష్ణా, కోనసీమ, చిత్తూరు, బాపట్ల, నంద్యాల జిల్లాలు ఉన్నాయి. అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 32.80 శాతం మేర పోలింగ్ నమోదైంది.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నార్నెపాడులో వైసీపీ ఏజెంట్ పై దాడి జరిగింది. ఏజెంట్ ను టీడీపీ నాయకులు బయటకు లాగి పడేశారు. వేసీపీ ఏజెంట్ తో మాట్లాడుతున్న మంత్రి అల్లుడిపై టీడీపీ వర్గీయులు దాడికి దిగారు. ఈ క్రమంలో ఆయన కారుపై రాళ్లతో దాడి చేయగా.. అద్దాలు ధ్వంసం అయ్యాయి. అటు, నెల్లూరు జిల్లా అల్లూరు రామకృష్ణ జూనియర్ కళాశాల పోలింగ్ స్టేషన్ వద్ద టీడీపీ, వైసీపీ వర్గీయుల ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ బలగాలు ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఆదోని వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డిపై కేసు నమోదైంది. నింబంధనలకు విరుద్ధంగా ఓటర్ స్లిప్పులపై తన ఫోటో ముద్రించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సాయిప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
ఏపీలో చెదురుమదురు ఘటనల మినహా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ 36 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటివరకూ దాదాపు కోటిన్నర మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 36.84 శాతం మేర మహిళలు ఓటు వేయగా.. 35 శాతం మేర పురుషులు ఓటు వేశారు.
ఎన్టీఆర్ జిల్లాలో నవాబుపేటలోని పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఏజెంట్ల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టారు. ఏజెంట్ల ఘర్షణతో ఆందోళనకు గురైన ఓటర్లు పరుగులు తీశారు. దీంతో పోలీస్ బలగాలు భారీగా ఆ కేంద్రానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, చెప్పులతో దాడి చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలకు సద్దిచెప్పి పంపించారు. అటు, మచిలీపట్నంలోని 144వ పోలింగ్ బూత్ లో వైసీపీకి అనుకూలంగా ఎన్నికల అధికారి పని చేస్తున్నారని టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. ఆయన్ను వెంటనే మార్చాలని పట్టుబడుతున్నారు.
గుంటూరు జిల్లా పెదపరిమిలో టీడీపీ, వైసీపీ వర్గీయుల ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ నేత, టీడీపీ వర్గీయులకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అదనపు ఎస్పీ పరిస్థితి చక్కదిద్దేందుకు యత్నిస్తున్నారు. పోలీసులు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలో ఈవీఎంలు ధ్వంసం కాగా.. పలు చోట్ల పోలింగ్ నిలిచిపోయింది. 216, 205, 206, 207 పోలింగ్ కేంద్రాల్లో భయంతో పోలింగ్ సిబ్బంది బయటకు వెళ్లిపోగా పోలింగ్ నిలిచిపోయింది. అటు, అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం దళవాయిపల్లెలో ఈవీఎంల ధ్వంసంతో నిలిచిన పోలింగ్ ను అధికారులు మళ్లీ పునరుద్ధరించారు.
తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం తిమ్మసముద్రంలో దొంగ ఓట్లు కలకలం రేపాయి. శ్రీకాళహస్తికి చెందిన 24 ఓటర్లు దొంగ ఓట్లు వేయడానికి వచ్చినట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. వీరిని అడ్డుకోగా.. టీడీపీ అభ్యర్థి వీరిపై పోలింగ్ కేంద్రం నుంచి ఆర్వోకు ఫిర్యాదు చేశారు.
పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మాచర్లలో ఇప్పటికీ దాడులు జరగడం పోలీసుల వైఫల్యమేనని అన్నారు. ఉదయం నుంచి ఎప్పటికప్పడు ఫిర్యాదులు చేస్తున్నా.. శాంతి భద్రతలను కాపాడలేకపోయారని ఆరోపించారు. ఈసీ వెంటనే పరిస్థితి చక్కదిద్దేలా చర్యలు చేపట్టాలని కోరారు.
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం, దళవాయిపల్లెలోని పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ మళ్లీ మొదలైందని రిటర్నింగ్ అధికారి లీలారాణి తెలిపారు. ఉదయం ఉద్రిక్తత నేపథ్యంలో ఈవీఎంలను ధ్వంసం చేయగా.. కొత్త ఈవీఎంలను తీసుకొచ్చి పోలింగ్ ప్రక్రియను పునరుద్ధరించారు.
కృష్ణా జిల్లా గన్నవరంలో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీయులు ఘర్షణకు పాల్పడగా.. పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు. అటు, అనంతపురం తాడిపత్రిలోనూ టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. అలాగే, బాపట్ల జిల్లా చీరాల మండలం గవినివారిపాలెంలోనూ టీడీపీ, వైసీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని చెదరగొట్టారు. కడప జిల్లా జమ్మలమడుగులోనూ ఇరు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగగా పోలీసులు చెదరగొట్టారు.
కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ, కూటమి కార్యకర్తలు ఎదురుపడగా.. మాటామాటా పెరిగి ఇరువర్గాలు దాడికి దిగేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.
తిరువూరు నియోజకవర్గం కంభంపాడులో వైసీపీ నాయకులు టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్నిని పోలింగ్ బూత్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని కేశినేని చిన్ని అన్నారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం దళావాయిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 192 పోలింగ్ కేంద్రంలో జనసేన ఏజెంట్ ను వైసీపీ వర్గీయలు లాగేశారు. ఇందుకు నిరసనగా గ్రామస్థులు ఈవీఎంలు పగలగొట్టారు. దీంతో పోలింగ్ నిలిచిపోగా. పోలింగ్ ప్రక్రియ పునరుద్ధరించడానికి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త ఈవీఎంలను పోలింగ్ కేంద్రానికి అధికారులు తరలించారు. ఈ క్రమంలో కూటమి నేతలు ఎన్నికల అధికారితో వాగ్వాదానికి దిగారు. జనసేన ఏజెంట్లు లేకుండా పోలింగ్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారికి సద్దిచెప్పారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం వణుకురులో కానిస్టేబుల్, టీడీపీ నేతలపై వైసీపీ నేత దాడికి దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొనగా.. టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏలూరు జిల్లా కైకలూరు మండలం వింజరంలో విషాదం నెలకొంది. ఓటు వేసేందుకు వచ్చి క్యూలైన్ లో నిల్చున్న ప్రభాకరరావు అనే ఓటరు ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. అటు విజయనగరంలో జిల్లాలోనూ ఓ వృద్ధురాలు ఓటేసేందుకు వచ్చి మృతి చెందింది.
ప్రకాశం జిల్లా దర్శి మండలం ఎర్రఓబునపల్లిలో టీడీపీ ఏజెంట్లు ఆందోళనకు దిగారు. తమను బయటకు పంపి ఎన్నికల సిబ్బంది పోలింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వెంటనే పోలింగ్ నిలిపేసి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆర్వో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
ప్రకాశం జిల్లాలో ఓ పార్టీ నేత డబ్బులు పంచుతుండగా అదనపు ఎస్పీ పట్టుకున్నారు. యర్రగొండపాలెంలోని ఎంఆర్ఎఫ్ షోరూంలో నగదు పంపిణీ చేస్తుండగా సమాచారం అందుకున్న అదనపు ఎస్పీ అశోక్ బాబు అక్కడికి వెళ్లి పట్టుకున్నారు. ఓటర్ల జాబితా, రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
నరసరావుపేట నియోజకవర్గం దొండపాడులో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు వాహనాలపై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడగా.. 3 వాహనాలు ధ్వంసం అయ్యాయి.
ఏపీలో కొన్నిచోట్ల స్వల్ప ఘర్షణల మినహా పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ 23.10 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.
ఏపీలో ఓటరు చైతన్యం పోటెత్తుతోంది. ఇప్పటివరకూ 18.81 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద జన సందడి నెలకొంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వృద్ధులు, మహిళలు ఓటు వేసేందుకు అధికంగా ఆసక్తి చూపుతున్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే శివకుమార్ క్యూలైన్ లో వెళ్లకుండా నేరుగా వెళ్లడంపై ఓటరు అభ్యంతరం తెలిపారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఓటరుపై దాడి చేయగా.. వెంటనే ప్రతిఘటించిన ఓటరు ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుచరులు ఓటరుపై దాడికి దిగారు.
ప్రకాశం జిల్లా బొట్లపాలెంలో ఓటర్ల మధ్య తోపులాట జరగ్గా.. పోలింగ్ కేంద్రంలోని ఈవీఎం కిందపడిపోయింది. అయితే, పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేదని.. కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. ఓటింగ్ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నామని.. బాధ్యులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించారు.
మంత్రి రోజా నగరిలో తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమండ్రిలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు, మంగళగిరిలోని కాజా పోలింగ్ బూత్ లో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు. ఉదయాన్నే పోలింగ్ స్టేషన్ల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరడం ఆనందం కలిగిస్తోందని.. ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. ఎక్కువగా వృద్ధులు, మహిళలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సందడి కనిపిస్తోంది. కాగా, ఇప్పటివరకూ 15 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. వైసీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు కాగా, 2 కార్లు ధ్వంసం అయ్యాయి. టీడీపీ నేతలే దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కడపలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇడుపులపాయలోని పోలింగ్ బూత్ నెంబర్ 261లో తన ఓటు వేశారు. అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు వైఎస్సార్ ఘాట్ వద్ద భర్తతో కలిసి ప్రార్థనలు చేశారు.
హిందూపురంలో నటుడు బాలకృష్ణ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పవిత్రమైన ఓటే ఆయుధమని.. అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఏపీలో పలుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. తొలి 2 గంటల్లో 10 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
నంద్యాల జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 9 గంటల వరకూ 5.10 శాతం పోలింగ్ నమోదైంది. ఆళ్లగడ్డ - 4.90 శాతం, బనగానపల్లి - 5.32 శాతం, డోన్ - 4.75 శాతం, నందికొట్కూర్ - 4.29 శాతం, నంద్యాల- 5.22 శాతం, శ్రీశైలం - 6.21 శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల తంగుడుబిల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓ వృద్ధురాలు ఓటు వేసేందుకు వచ్చి మృతి చెందింది. చాలాసేపు నిల్చొని కుప్పకూలిందని.. ఎండవేడిమికి తట్టుకోలేకే ఆమె మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం దలవాయిపల్లిలో కొందరు ఈవీఎంలు పగలగొట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలింగ్ నిలిచిపోగా.. తమ పోలింగ్ ఏజెంట్ ను కిడ్నాప్ చేశారని జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అటు, పిఠాపురంలోని 153వ పోలింగ్ బూత్ లో కరెంట్ లేదని ఓటర్లు నిరసన తెలిపారు. ఈవీఎంల్లో గుర్తులు కనిపించడం లేదని అధికారులను ప్రశ్నించారు.
పల్నాడు జిల్లాలోని పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రెంటచింతలలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. అటు, వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం చిన్న గులవలూరులోనూ ఘర్షణ నెలకొంది. చిత్తూరు జిల్లా పీలేరులో టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేశారని ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. అటు, కర్నూలు జిల్లా హాలహర్వి 74, బాపురం 22వ నెంబర్ పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పని చేయలేదు. పల్నాడుకు అవసరమైతే అదనపు బలగాలు తరలించాలని ఈసీ ఆదేశించింది. అటు, దాచేపల్లి, అచ్చంపేట, గురజాలలోనూ టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది.
మంగళగిరిలోని పోలింగ్ కేంద్రంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓటు వేశారు. తన సతీమణి అన్నా లెజీనోవాతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో అభిమానులు లోపలికి చొచ్చుకొచ్చేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తన సతీమణి విజయవాడలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
విజయనగరంలో కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతిరాజు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు, వైసీపీ నేత విజయసాయిరెడ్డి నెల్లూరులోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
చిత్తూరు జిల్లా పీలేరులో ముగ్గురు టీడీపీ ఏజెంట్ల కిడ్నాప్ చేశారని టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వీరిని పోలింగ్ కేంద్రాల్లోకి చేరుకోలేని ప్రాంతంలో వదిలారని తెలిపింది. అటు, అన్నమయ్య జిల్లా కేంద్రంలోని స్థానిక పోలింగ్ కేంద్రంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కారంపూడిలో ఈవీఎం మొరాయించింది. 151వ పోలింగ్ బూత్ లోని ఈవీఎంలో సాంకేతిక సమస్యతో గంటకు పైగా పోలింగ్ నిలిచిపోయింది. ఈ కేంద్రంలో ఉదయం 6 నుంచే ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు.
ఏపీ ఎన్నికలపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 'ఆంధ్రప్రదేశ్ ప్రజలు,ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు, రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయాలని కోరుతున్నాను. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నాను.' అని ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే, 'ఈ రోజు జరిగే నాలుగవ దశ లోక్ సభ ఎన్నికలలో పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 96 స్థానాలలో పోలింగ్ జరుగుతుంది.ఈ నియోజక వర్గాలలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారనీ ఓటింగ్ పెరుగుదలకు యువ ఓటర్లు మహిళలు దోహదం చేస్తారనీ నమ్ముతున్నాను.రండి ,మనందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం!' అంటూ మరో ట్వీట్ చేశారు.
ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని అన్నారు. పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే టీడీపీ శ్రేణులు ఊరుకోవని.. రౌడీయిజం, గూండాయిజంతో రెచ్చిపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పోలింగ్ ప్రశాంతంగా సాగేలా ఈసీ, పోలీసులు బాధ్యత చేపట్టాలని అన్నారు.
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతా ఓటు వేసేందుకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
పులివెందులలోని భాకరాపురంలో సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో అంతా ఓటు వేయడానికి తరలిరావాలని పిలుపునిస్తూ ట్వీట్ చేశారు.
పల్నాడు జిల్లా రెంటచింతలలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించింది. అవసరమైతే అదనపు బలగాలు తరలించాలని సూచించింది.
కడప జిల్లా పులివెందులలో సీఎం జగన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భాకరాపురంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఓటు వేశారు. అటు, వైసీపీ ఎంపీ నెల్లూరులోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం దాడికి దిగాయి. ఈ వివాదంలో ముగ్గురు టీడీపీ ఏజెంట్లకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు పాల్పడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు, కడప జిల్లాలోని కమలాపురం కోగట్టంలోనూ ఇరు పార్టీల మధ్య ఘర్షణ జరిగింది.
ఏపీవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మాక్ పోలింగ్ అనంతరం ఎన్నికల సిబ్బంది పోలింగ్ ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. కాగా, ఏపీలో 4.14 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఉదయాన్నే ఓటింగ్‌పై ట్వీట్ చేశారు. "నా అవ్వాతాతలందరూ… నా అక్కచెల్లెమ్మలందరూ… నా అన్నదమ్ములందరూ… నా రైతన్నలందరూ… నా యువతీయువకులందరూ… నా ఎస్సీ… నా ఎస్టీ… నా బీసీ… నా మైనారిటీలందరూ… అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి!"
Background
Andhra Pradesh Assembly Election 2024 Polling Live Updates: ఏపీలో పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఓటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకూ.. పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. అయితే, ఎన్నికల సంఘం నిర్దేశించిన టైం లోపల క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. తొలుత మాక్ పోలింగ్ అనంతరం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
ఇదీ ముఖచిత్రం
- ఏపీలో అసెంబ్లీ స్థానాలు - 175
- లోక్ సభ స్థానాలు - 25
- మొత్తం ఓటర్లు - 4.14 కోట్లు, పురుషులు - 2.3 కోట్లు, మహిళలు - 2.10 కోట్లు
- థర్ట్ జెండర్ ఓటర్లు - 3,421, సర్వీస్ ఓటర్లు - 68,185
- 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకూ పోలింగ్
- అరకు, పాడేరు, రంపచోడవరంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్
- పాలకొండ, కురుపాం, సాలూరులో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్.
- మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు, 1.6 లక్షల ఈవీఎంల వినియోగం.
అటు, అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, వేసవి దృష్ట్యా ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్ల సౌకర్యం, ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచింది.
పటిష్ట భద్రత
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను సైతం ఎన్నికల సంఘం భద్రతకు వినియోగిస్తోంది. మొత్తం 3.30 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 1.14 లక్షల మంది పోలీసులను భద్రత కోసం వినియోగిస్తున్నారు. వీరికి అదనంగా 10 వేల మంది సెక్టార్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బీఎల్ఓలు విధుల్లో ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా 5.26 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు.
ఈ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్
రాష్ట్రవ్యాప్తంగా 30,111 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో 12,459 కేంద్రాలను సెన్సిటివ్ గా ఈసీ గుర్తించింది. మాచర్ల సహా 14 నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వంద శాత వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. అనంత, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వంద శాతం పోలింగ్ కేేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఈసీ తెలిపింది. సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల లోపల, బయట సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ సాగనుంది. పోలింగ్ కేంద్రాల్లోకి ఫోన్లకు అనుమతి లేదని.. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని.. జూన్ 1వ తేదీ వరకూ ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంటుందని వెల్లడించారు. ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని.. మొత్తం 36 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు మానిటరింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు, 25 లోక్ సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అత్యధికంగా తిరుపతిలో 46 మంది, మంగళగిరిలో 40 మందికి పైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరుగురు పోటీ చేస్తున్నారు. ఇక, లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి అత్యధికంగా విశాఖలో 33 మంది అభ్యర్థులు, నంద్యాలలో 31 మంది, గుంటూరులో 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా, ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 2 కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నారు.
ఈ రూల్స్ పాటించాలి
- మాక్ పోలింగ్ అనంతరం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుంది. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్లు దూరంలో ఉండి స్లిప్పులు పంపిణీ చెయ్యొచ్చు.
- స్లిప్పులపై అభ్యర్థి పేరు, గుర్తు ఉండకూడదు. ఓటర్లను వాహనాల్లో తీసుకురాకూడదు. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేదు.
- పోలింగ్ రోజు ప్రతి అభ్యర్థికీ 3 వాహనాలకు అనుమతిస్తారు. ఎక్కడా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు
- ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం తెలిపింది.
ఈసారి ఓటింగ్ లో పాల్గొనేందుకు ఓటర్లు భారీగా తరలివస్తుండడంతో 83 శాతం పోలింగ్ జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. 2019 ఎన్నికల్లో 79.84 శాతం మేర పోలింగ్ నమోదు కాగా.. ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగేలా ఈసీ చర్యలు చేపట్టింది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -