Telangana Congress CM Candidate LIVE: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి - ఏఐసీసీ అధికారిక ప్రకటన

Telangana New CM: తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డిని ఏఐసీసీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.

ABP Desam Last Updated: 05 Dec 2023 06:37 PM
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి - ఏఐసీసీ అధికారిక ప్రకటన

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని ఖరారు చేస్తూ ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ నెల 7న ఆయన సీఎంగా ప్రమాణం చేస్తారని తెలిపారు. 

2 రోజుల నుంచి హోటల్ లోనే రేవంత్.. అక్కడి నుంచే నేతలతో మంతనాలు

కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లినా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హోటల్ పల్లా నుంచి బయటకు రాలేదు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. ఖర్గే నేతృత్వంలో కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, డీకే శివకుమార్ తదితర అగ్రనేతలు ఢిల్లీలో సమావేశమై సీఎం ఎంపికపై చర్చించారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం రెండు రోజులనుంచి హోటల్లోనే ఉండి పార్టీ నేతలతో మంతనాలు జరుగుతున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై డిస్కస్ చేశారని సమాచారం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలు అమలుపై సమావేశం జరిగింది. 

హోటల్ కు వెళ్లి రేవంత్ ను కలిసిన సీపీఐ నేతలు

తెలంగాణ సీఎం ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా డిసైడ్ చేసినట్లు సమాచారం. విషయం తెలియగానే హోటల్ ఎల్లాకి కాంగ్రెస్ నేతలు చేరుకుంటున్నారు. సీపీఐ అగ్రనేతలు సైతం హోటల్ కు చేరుకున్నారు. సీపీఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి తదితరులు హోటల్ ఎల్లాకి చేరుకుని రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ సహా కాంగ్రెస్ కీలక నేతలతో సీపీఐ అగ్రనేతలు భేటీ అయ్యారు. నేటి సాయంత్రం సీఎం పేరును డీకే శివకుమార్ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో సీపీఐ నేతలు, హోటల్ కు చేరుకుని రేవంత్ తో భేటీ కావడం ఉత్కంఠ రేపుతోంది. 

హైదరాబాద్ కు బయలుదేరిన డీకే శివకుమార్, సాయంత్రం సీఎల్పీ భేటీ

మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఢిల్లీలో తెలంగాణ సీఎం ఎంపికపై కీలకంగా చర్చించారు. కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మీటింగ్ అనంతరం కర్ణాటక డిప్యూటీ సీఎం మల్లికార్జున ఖర్గే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరినట్లు తెలుస్తోంది. సాయంత్రం సీఎల్పీ భేటీ నిర్వహించి అధిష్టానం నిర్ణయాన్ని శివకుమార్ ప్రకటించనున్నారు. 

Telangana New CM: ఢిల్లీలో ఖర్గే నివాసంలో ముగిసిన కీలక భేటీ

తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో పార్టీ నేతల సమావేశం ముగిసింది. రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌, డీకే శివకుమార్‌ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేల నిర్ణయంపై కీలకంగా చర్చ జరిగింది. సమావేశం అనంతరం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ హైదరాబాద్ కు బయలుదేరారు. సాయంత్రం మరోసారి సీఎల్పీ భేటీ నిర్వహించి పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 

తెలంగాణ సీఎంపై కాంగ్రెస్‌ క్లారిటీ- శాఖల కేటాయింపు, డిప్యూటీ సీఎంపైనే కసరత్తు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ తన సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడంలో మాత్రం రెండు రోజుల నుంచి కసరత్తు చేస్తోంది. అయితే సీఎం ఎవరనే దానిపై క్లారిటీకి వచ్చిందని ఆయన జట్టులో ఎవరెవరు ఉండాలో అనే అంశంపై చర్చలు నడుస్తున్నట్టు సమాచారం. దీనిపై ఖర్గే నివాసంలో చర్చిస్తున్న రాహుల్ గాంధీ సమావేశాన్ని ముగించి వెళ్లినపోయారు. 
తెలంగాణ సీఎం అభ్యర్థి ఆయన జట్టుపై కసరత్తు చేస్తున్న ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, డీకే శివకుమార్‌ సమావేశం ముగిసింది. దాదాపు అరగంట పాటు దీనిపై చర్చించారు. పార్టీ విజయం సాధించినప్పటి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్లు చెప్పిన అభిప్రాయాలు, రాష్ట్రంలో నెలకొన్ని పరిణామాలపై కీలకమైన రిపోర్టును డీకే శివకుమార్ అధినాయకత్వం ముందు పెట్టారు. 
డీకే శివకుమార్ మీటింగ్‌కు ముందు మీడియాతో మాట్లాడతూ.. సీఎల్పీ లీడర్ ఎన్నిక, సీఎం ఎంపికపై ఎమ్మెల్యేలు చేసిన తీర్మానాన్ని అధిష్ఠానానికి అందిస్తా అన్నారు. వారి సూచనలతో సాయంత్రం లోపు నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధినాయకత్వమే ఫైనల్‌ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. 
సీఎల్పీ భేటీ తర్వాత కూడా పలువురు సీనియర్లతో డీకే శివకుమార్ చర్చించారు. రేవంత్ రెడ్డితో మాట్లాడారు. ఈ ఉదయం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కతో కూడా విడివిడిగా మాట్లాడారు. వారి అభిప్రాయాలు తీసుకున్నారు. అన్నింటిని క్రోడీకరించి పార్టీ అగ్రనేతలతో డీకే శివకుమార్ చర్చించారు. 
ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో ఎక్కుమంది రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. అభ్యంతరం చెప్పిన వాళ్లు కూడా పదవుల అంశంపై పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. కొత్తగా కొలువు దీరే అసెంబ్లీలో 18 మందికి చోటు దక్క వచ్చని తెలుస్తోంది. వారిలో ఎంతమంది డిప్యూటీ సీఎంలుగా తీసుకుంటారనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది. 
శాఖ కేటాయింపులు, డిప్యూటీలు ఎన్ని ఉండాలనే వాటిపై నేతలతో చర్చించిన డీకే శివకుమార్ అధినాయకత్వానికి నివేదిక సమర్పించారు. ఆ నివేదికపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చర్చించారు. సుమారు అరగంట పాటు మాట్లాడారు. మరో రెండు మూడు గంటల్లో కీలక నిర్ణయం వెలువడే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. 

హైకమాండ్‌కు నివేదిక ఇచ్చిన డీకే శివకుమార్- ఖర్గే నివాసంలో రాహుల్, కేసీ వేణుగోపాల్ మంతనాలు 

తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపిక కసరత్తును కాంగ్రెస్ తీవ్రం చేసింది. రెండు మూడు గంటల్లో దీనిపై క్లారిటీ ఇచ్చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆ దిశగా ఢిల్లీలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. కర్ణాటక డిప్యూటి సీఎం డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఠాక్రేతో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ ఇద్దరి నేతలతో ఠాక్రే, డీకే విడివిడిగా మాట్లాడినట్టు తెలుస్తోంది. వారి అభిప్రాయలతోపాటు మెజార్టీ ఎమ్మెల్యే అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఓ నివేదిక సిద్ధం చేశారు. దీనిని హైకమాండ్‌కు డీకే శివకుమార్ అందజేశారు. 


తెలంగాణ సీఎం అంశంపై ఖర్గే నివాసంలో డీకే శివకుమార్, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఠాక్రే మాట్లాడుతున్నారు. ఖర్గే నివాసంలో భేటీకి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్... ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని నివేదిక సమర్పించిన తర్వాత సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 

Background

Telangana Congress CM Candidate Announcement Live Updates: తెలంగాణ సీఎం అభ్యర్థి కోసం ఢిల్లీలో కసరత్తు కొనసాగుతోంది. ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క అధిష్ఠానం పెద్దలతో చర్చలు కొనసాగిస్తున్నారు. గంటల తరబడి ఈ అంశంపై చర్చిస్తున్నారు. ఎలాగైనా సాయంత్రానికి  సీఎం అభ్యర్థి ఎవరనేది క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తోంది. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తోపాటు ఏఐసీసీ పరిశీలకులు ఖర్గేతో సమావేశమై చర్చించిన తర్వాత... సోనియా అనుమతితో తెలంగాణ సీఎం అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. డీకే శివకుమార్‌తో చర్చిస్తున్న ఉత్తమ్‌ కుమార్ భట్టి విక్రమార్క మధ్యాహ్నం తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge)తో సమావేశం కానున్నారు. చర్చలు పూర్తైన తర్వాత సీల్డ్‌ కవర్‌తో డీకే శివకుమార్ (DK Sivakumar)‌, మాణిక్‌రావు థాక్రే (Manik Rao Thackeray) హైదరాబాద్‌ చేరుకుంటారని తెలుస్తోంది. ఈ తర్వాత సీఎం అభ్యర్థి ఎవరనేది తేలిపోనుంది.


నిన్న ఉదయం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సీఎల్పీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కాంగ్రెస్‌ తరపున గెలిచిన ఎమ్మెల్యేల మనోగతం, పార్టీ సీనియర్ నేతల  అభ్యంతరాలను తెలుసుకున్నారు ఏఐసీసీ పరిశీలకులు. ఏఐసీసీ పరిశీలకుల బృందంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సీఎల్పీ  సమావేశాని ముందు... పార్క్‌ హయత్‌ హోటల్లో డీకే శివకుమార్‌తో భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ఆ తర్వాత వీరంతా కలిసి  సీఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. సీఎం అభ్యర్థి ఎంపికను అధిష్టానానికి అప్పగిస్తూ సీఎల్పీ సమావేశంలో ఏకవాక్య తీర్మానం చేశారు ఎమ్మెల్యేలు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు,  సీనియర్‌ నేతలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకున్నారు ఏఐసీసీ పరిశీలకులు. ఆ తర్వాత ఒక నివేదికతో ఢిల్లీ వెళ్లారు. రాత్రి ఢిల్లీ చేరుకున్న ఏఐసీసీ పరిశీలకులు...  తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల అభిప్రాయాలను అధిష్టానానికి అందిచనున్నారు. ఇక... నిన్న రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్‌ నేత కేసీ వేణగోపాల్‌తో సోనియా గాంధీ (Sonia Gandhi) సమావేశమయ్యారు. తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై చర్చించినట్టు సమాచారం. 


ఏఐసీసీ పరిశీలకులు తెలంగాణ ఎమ్మెల్యేల అభిప్రాయాలు అధిష్టానికి సమర్పించనున్నారు. దీనిపై చర్చించన తర్వాత తెలంగాణ సీఎం అభ్యర్థి ఎవరన్నది అధిష్టానం ఖరారు చేయనుంది. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్‌ రానున్నారు ఏఐసీసీ పరిశీలకులు. హైదరాబాద్ చేరుకుని సీనియర్లతో మంతనాలు, బుజ్జగింపులు చేసే అవకాశం కనిపిస్తోంది. అందరితో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రిపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది సాయంత్రంలోగా క్లారిటీ రానుంది.


మొదటి నుంచి రేవంత్‌రెడ్డే సీఎం అని ప్రచారం జరిగింది. నిన్న రాత్రి 8గంటలకు రాజ్‌భవన్‌ (Raj Bhavan)లో ప్రమాణస్వీకారానికి కూడా ఏర్పాట్లు జరిగాయి. కొత్త కాన్వాయ్‌ని కూడా సిద్ధం చేశారు. అయితే... ముఖ్యమంత్రి పదవి కోసం రేవంత్‌రెడ్డితోపాటు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ పడుతుండటంతో... అధిష్టానం సీఎం క్యాండిడేట్‌పై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో నిన్న జరగాల్సిన ప్రమాణస్వీకారం వాయిదా పడింది. అధిష్టానం సీఎం అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత... ఈనెల 6 లేదా 7వ తేదీన ప్రమాణస్వీకారం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.