ABP CVoter Telangana Exit Poll 2023  :  తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో .. కాంగ్రెస్ కు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది కానీ.. అదే సమయంలో హంగ్ అసెంబ్లీ అంచనాలను కూడా తోసిపుచ్చలేమని ఏబీపీ సీఓటర్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో స్పష్టమయింది.  కాంగ్రెస్ పార్టీకి  49 నుంచి 65 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని తేలింది. అదే సమయంలో భారత రాష్ట్ర సమితికి 38  నుంచి 54 సీట్లు వచ్చే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ కూటమికి మూడు నుంచి 13 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇతరులు 5 నుంచి 9 స్తానాల్లో గెలుస్తారు. ఇతరుల్లో మజ్లిస్ పార్టీ కూడా ఉంది.



ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 40.7 శాతం ఓట్లు వస్తాయి. అంటే గత ఎన్నికలతో ఓటింగ్ పర్సంటేజీ దాదాపుగా 12.4 శాతం పెరుగుతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 28.3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. భారత రాష్ట్ర సమితికి ఏకంగా 8.1 శాతం ఓట్లు తగ్గబోతున్నాయి. ఆ పార్టీకి 38.8 శాతం వరకూ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 46.9 శాతం ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతం పరంగా భారీగా లబ్ది పొందుతోంది. గత ఎన్నికల్లో కేవలం ఏడు శాతం ఓట్లే ఆ పార్టీకి వచ్చాయి. కనీ ఈ సారి మాత్రం ఏకంగా 17శాతం ఓట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడయింది. ఏకంగా  9 శాతం ఓట్లు బీజేపీకి పెరుగుతాయి. ఇతర పార్టీలకు వచ్చే ఓట్ల శాతం ఈ సారి బాగా తగ్గిపోయింది.  గత ఎన్నికల్లో ఇతరులకు 17.8 శాతం ఓట్లు రాగా ఈ సారి ఆ శాతం కేవలం 4.5 శాతానికి పడిపోతుందని తేలింది.



మార్జినల్స్ ఇవ్వకుండా ఖచ్చితంగా సీట్ల ప్రొజెక్షన్ అంచనా వేయాలంటే.. హంగ్ వస్తుందని ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్  పోల్ చెబుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ  సాధారణ మెజార్టీకి చాలా దగ్గరగా వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి 57 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే 38 సీట్లు ఎక్కువ. బీఆర్ఎస్ పార్టీ 42 సీట్లను కోల్పోయి 46 దగ్గర స్థిరపడుతుంది. బీజేపీ ఒకటి నుంచి ఎనిమది స్థానాలకు పెరుగుతుంది. అదర్స్ కు ఏడు సీట్లే వస్తాయి. ఆ ఏడూ మజ్లిస్ కే వచ్చే చాన్స్ ఉంది. 




ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఫలితాలు రెండు విధాలుగా వచ్చే అవకాశం ఉంది. 


సినారియో 1  - ప్రజల్లో అధికార వ్యతిరేకత ఉన్నప్పుడు


తెలంగాణ ప్రభుత్వం  పదేళ్లుగా అధికారంలో ఉంది. ఈ సందర్భంగా అధికార వ్యతిరేకత ఉందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడయింది. ఈ అధికార వ్యతిరేకత తీవ్రంగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి 67 నుంచి 79 సీట్ల వరకూ లభించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పరిస్థితి 29 నుంచి 41 సీట్లకు పరిమితమవ్వొచ్చు. బీజేపీకి నాలుగు నుంచి ఎనిమిది సీట్లు, ఇతరులకు మూడు నుంచి ఏడు సీట్లు వరకూ వస్తాయి. అంటే అధికార వ్యతిరేకత  బాగా ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి ఊహించనంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. 



సినారియో 2 - ప్రజల్లో ప్రభత్వంపై సానుకూలత ఉంటే


తెలంగాణ ప్రభుత్వం తమకు  ప్రజల్లో సానుకూలత ఉందని నమ్మకంతో ఉంది. ఎగ్జిట్ పోల్స్ లో అలాంటి వాతావరణ కనిపించకపోయినా..  ఓటర్లు చివరి క్షణంలో మనసు మార్చుకుని ఉంటే.. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ మరోసారి ఏర్పడుతుంది. కానీ.. అదీ అత్తెసరు మెజార్టీ లేదా హంగ్ ద్వారా మాత్రమే. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి్ 40 నుంచి 52 స్థానాలు వస్తాయి. బీఆర్ఎస్ పార్టీకి 54 నుంచి 66 స్థానాలు వస్తాయని అంచనా. బీజేపీకి ఏడు నుంచి 11 సీట్లు లభిస్తాయి.