Telangana Exit Poll ABP Cvoter : తెలంగాణలో ఐదు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో ఏబీపీ - సీ ఓటర్ వంద శాతం ఖచ్చితమైన అంచనాలను వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ 64 అసెంబ్లీ సీట్లను సాధించబోతోందని బీఆర్ఎస్ పార్టీ 40 లోపు సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ ను ఏబీపీ - సీ ఓటర్ నిర్వహించింది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు, లోక్ సభ ఎన్నికలకు భిన్నత్వం ఎక్కువగా కనిపిస్తోంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు వేర్వేరుగా జరగడం వల్ల ఓటింగ్ ప్రయారిటీ అంశాలు మారిపోయాయి. అందుకే ఫలితాల్లోనూ భిన్నత్వం కనిపిస్తోంది. తెలంగాణలో ఏబీపీ - సీఓటర్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ అంచనాల్లో మొదట ఓట్ షేర్‌ను చూద్దాం.
జాతీయ స్థాయి అంశాల ప్రాతిపదికన ఓటింగ్ జరిగినందున జాతీయ పార్టీల మధ్యే ఎక్కువగా పోటీ జరిగింది. మొత్తం ఓట్లలో కాంగ్రెస్ పార్టీ 38.6 శాతం ఓట్లను సాధించబోతోంది. బీజేపీ ఓట్ల శాతం అనూహ్యంగా పెరగనుంది. ఆ పార్టీకి 33 శాతం ఓట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ అంచనాలో వెల్లడయింది. తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండు జాతీయ పార్టీల మధ్య పూర్తి స్థాయిలో నలిగిపోయినట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీకి కేవలం 20.3 శాతం ఓట్లు వస్తాయి. మజ్లిస్ పార్టీకి 2 శాతం ఓట్లు వస్తాయని అంచనా.
ఇక సీట్ల పరంగా చూస్తే తెలంగాణలో మొత్తం పదిహేడు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. అందులో 7 నుంచి 9 సీట్లు కాంగ్రెస్ పార్టీకి అదే 7-9 సీట్లు బీజేపీ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇతరులకు 0 నుంచి 1 సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం చూస్తే.. గత లోక్ సభ ఎన్నికలలో 9లోక్ సభ సీట్లు గెల్చుకున్న భారత రాష్ట్ర సమితి తీవ్రంగా నష్టపోనుంది. అలాగే మజ్లిస్ పోటీ పడిన హైదరాబాద్ సీటులోనూ హోరాహోరీ పోరు నడిచిందని అర్థమవుతుంది.
[DISCLAIMER: Current survey findings and projections are based on CVoter Exit Poll / Post Poll personal interviews conducted on polling day and after polling day among 18+ adults statewide, all confirmed voters, details of which are mentioned right below the projections as of today. The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. Our final data file has Socio-Economic profile within +/- 1% of the Demographic profile of the State. We believe this will give the closest possible trends. The sample spread is across all Assembly segments in the poll bound state. MoE is +/- 3% at macro level and +/- 5% at micro level VOTE SHARE projection with 95% Confidence interval.]