Delhi Assembly Election 2025:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌పై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్ ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ఈ దాడి జరిగింది. ప్రచారం పూర్తి చేసుకొని వెళ్తున్న టైంలో ఆయన కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కొందర్ని అదుపులోకి తీసుకున్నారు.
కేజ్రీవాల్ కారుపై జరిగిన రాళ్ల దాడిపై ఆప్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలు కావాలనే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దాడి ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. న్యూఢిల్లీ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ అనుచరులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆప్ ఆరోపించింది. ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు.
ఆప్ చేస్తున్న ఆరోపణలపై బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ స్పందించారు. తన మద్దతుదారులపై వాహనం దూసుకెళ్లిందని అందుకే వాళ్లు తిరగబడ్డారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగిందని ఇదే తీవ్రతకు దారి తీసిందని తెలిపారు. ఈ దాడిలో తన అనుచరులకు గాయాలు అయ్యాయని అన్నారు. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయని ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు.