C-Vigil App: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే అన్ని వ్యవస్థలు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్లిపోతాయి. ఎక్కడైనా అధికార పార్టీకి వ్యవస్థలు అనుకూలంగా ఉండకుండా అందరికి సమాన అవకాశాలు కల్పించేలా చేస్తుంది ఈసీ. ఈ క్రమంలోనే ప్రజలకి కూడా కొన్ని అధికారాలు ఇస్తోంది ఎన్నికల సంఘం. మీ ప్రాంతాల్లో అక్రమాలు జరిగినా అధికార దుర్వినియోగం కానీ, లేదా డబ్బుల పంపిణీ, ఇతర ప్రలోభాలు జరిగినా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావచ్చు.


అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఇందులో పౌరులను సైతం భాగస్వాములను చేస్తోంది. ‘సి విజిల్‌’(C-vigil) యాప్‌ ద్వారా  అందరి అక్రమాలు వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం కల్పించింది. 


ఈలవేసి గోల చేయ్‌..
ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన మరుక్షణం నుంచే  ‘సి విజిల్‌’(C-Vigil) యాప్‌ అందుబాటులోకి తెచ్చింది. ఎన్నికల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయాలంటే సరైన సాక్ష్యాధారాలు ఉండాలి. అలాంటి సాక్ష్యాలను కేంద్ర ఎన్నికల సంఘం(EC) ముందు ఉంచడమే ఈ యాప్‌ లక్ష్యం. అక్రమాలకు సంబంధించిన  ఫొటో లేదా వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్‌ చేసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాల్లో సదరు ఫిర్యాదుపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారు. దీన్ని పౌరులు ఎవరైనా వినియోగించవచ్చు. పార్టీలకు అతీతంగా ఎవరు అవినీతికి పాల్పడినా ఈ యాప్‌(APP)లో ఫిర్యాదు చేయవచ్చు.


రిజిస్టర్ తప్పనిసరి
గూగుల్‌ ప్లే స్టోర్‌(Googe Play Store)నుంచి ముందుగా యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం ఫోన్‌ నెంబర్ ఆధారంగా రిజిస్టర్‌ చేసుకుంటే・సి విజిల్‌' యాప్‌ ద్వారా అక్రమాలపై ఫిర్యాదు చేయవచ్చు. డబ్బు పంపకాలు, ఉచితాలు, బహుమతులు అందజేత, ప్రలోభాలకు గురిచేయడం, బెదిరింపులు, ఓటర్లను ప్రభావితం చేయడం, ఎన్నికల రోజు ఓటర్లను వాహనాల్లో తరలించడం. ఇలాంటి ఉల్లంఘనలను ఫొటో లేదా వీడియో లేదా ఆడియో రికార్డ్‌ చేసి అప్‌లోడ్‌ చేస్తే... ఎన్నికలసంఘం(EC) చర్యలుతీసుకుంటుంది. యాప్‌లో ఫొటో గానీ, వీడియోగానీ అప్‌లోడ్ చేసిన వెంటనే మన లొకేషన్ వస్తుంది. అక్కడ మిగిలిన వివరాలన్నీ క్షుప్తంగా నమోదు చేయాలి. యాప్‌లో వివరాలు పొందుపరిచిన ఐదు నిమిషాల్లోనే జిల్లా ఎన్నికల అధికారికి ఈ ఆధారాలు పంపుతారు. వారు 15 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటారు. అక్కడ ప్రజలను విచారించి అరగంటలోనే వివరాలు సేకరించి ఎన్నికల అధికారికి నివేదిస్తారు. వెంటనే దానిపై గంటలోపే చర్యలు తీసుకుంటారు. మొత్తం వ్యవహారం వంద నిమిషాల్లోనే ముగిసిపోతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.  సి విజిల్‌ యాప్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించినట్లు వారు తెలిపారు. మనం ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు ఎంతవరకు వచ్చాయన్న దాన్ని స్టేటస్‌ కూడా తెలుసుకునే వెసులుబాటు కల్పించారు.

అక్రమాలకు అడ్డుకట్ట
ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి గద్దెనెక్కుదామనుకునే నేతలకు సీ-విజియల్ యాప్ చెక్‌పెట్టనుంది. మంచి ప్రజానాయకుడిని ఎన్నుకోవడం ఎంత అవసరమో...అక్రమార్కులకు ఆదిలోనే అడ్డుకట్ట వేయడం అంతే అవసరం. కేవలం డబ్బుతోనే విజయం సాధించవచ్చనుకునే వాళ్లుకు ఈ యాప్‌ బరతంపట్టనుంది. ప్రజలంతా ఈ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకుని మీ దృష్టికి వచ్చిన అక్రమాలపై తక్షణం ఫిర్యాదు చేయాల్సిందిగా  ఎన్నికల సంఘం కోరింది. ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది.